5,003 కేజీల రేషన్ బియ్యం స్వాధీనం
జగ్గంపేట: మండలంలోని ఇర్రిపాక గ్రామంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని బుధవారం సివిల్ సప్లయీస్, విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. జగ్గంపేట ఎంఎస్‌ఓ కృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. గోరింట గ్రామానికి చెందిన కోరుకొండ అచ్యుతరావు ఏపీ 39 యూవై 5549 అనే వాహనంలో రేషన్ బియ్యాన్ని ఇర్రిపాక మీదుగా జగ్గంపేట పరిసరాల్లోని చేపల చెరువులకు తీసుకువెళుతున్నాడు. ఇర్రిపాక గ్రామంలో వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా అధికారులు ఆ వ్యాన్‌లో రేషన్ బియ్యాన్ని గుర్తించారు. ఆ బియ్యాన్ని జగ్గంపేట ఎంఎస్‌ఓ పాయింట్ వద్ద కాటా వేయగా వంద బస్తాల్లో 5,003 కేజీల ఉన్నట్టు నిర్ధారించారు. అవి మన్యం తేజ అనే వ్యక్తికి చెందిన బియ్యమని వ్యాన్ డ్రైవర్ తెలిపాడు. ఈ నేపథ్యంలో అచ్యుతరావు, మన్యం తేజ, వ్యాన్ యజమాని గనిశెట్టి రాజులపై కేసులు నమోదు చేశారు. వ్యాన్, బియ్యం విలువ రూ.9 లక్షల వరకూ ఉంటుందని అంచనా. తనిఖీల్లో విజిలెన్స్ సీఐ టి.గోపాలకృష్ణ, జగ్గంపేట ఎంఎస్‌ఓ జీఎం కృష్ణ, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


