ఎక్కడి ధాన్యం అక్కడే | - | Sakshi
Sakshi News home page

ఎక్కడి ధాన్యం అక్కడే

Dec 4 2025 7:26 AM | Updated on Dec 4 2025 7:26 AM

ఎక్కడ

ఎక్కడి ధాన్యం అక్కడే

పెరవలి: అన్నదాతకు ఖరీఫ్‌ సాగు కలసి రాలేదు సరికదా ప్రకృతి పగబట్టినట్లు వర్షాలు, తుపానులు దండెత్తడంతో పంట దక్కేలా కనిపించటం లేదు. ప్రభుత్వం కూడా రైతుల పట్ల నిర్లక్ష ధోరణి కనబరచడంతో వారి పాట్లు వర్ణనాతీతంగా ఉన్నాయి. అన్నింటిని తట్టుకుని ధాన్యం అమ్మే సమయంలో సర్వర్లు పనిచేయక ధాన్యం రాశుల్లో, బస్తాల్లో, చేలగట్ల మీద, అరుగులపై నిల్వ చేసుకుంటున్నారు. శనివారం నుంచి సర్వర్లు పనిచేయకపోవటంతో ధాన్యం కొనుగోళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన ఏర్పాట్లలో మునిగితేలుతున్నారు. రైతులు మాత్రం ఒకవైపు వర్షాలకు ధాన్యం తడిసిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటూనే, మరోవైపు కొనుగోలు కేంద్రాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదుకోవలసిన ప్రభుత్వం నిబంధనలు కఠినతరం చేయటంతో రైతుల నానా ఇబ్బందులు పడుతున్నారు. తడిసిన ధాన్యం మొలక వస్తుండగా, కొనుగోలు కేంద్రాల వద్ద 17 శాతం తేమ శాతం ఉంటేనే ధాన్యం కొంటామని చెప్పటంతో రైతులు తలలు పట్టుకుంటున్నారు. ఆరుదల ధాన్యం పట్టుకెళ్లినా సర్వర్లు పనిచేయకపోవటం వల్ల ధాన్యాన్ని రైతుల వద్దే ఉంచుకోవలసిన దుస్థితి ఏర్పడింది.

39,966 హెక్టార్లలో పూర్తికాని కోతలు

జిల్లాలో ఖరీఫ్‌ సీజన్‌లో 79,966 హెక్టార్లలో వరి సాగు చేపట్టారు. ప్రస్తుతం వరి కోతలు ముమ్మరంగా చేపట్టడంతో ఈ నెల 30 వరకు 40 వేల హెక్టార్లలో వరి కోతలు పూర్తి కాగా మిగిలిన 39,966 హెక్టార్లలో కోతలు జరగవలసి ఉంది. జిల్లాలోని 18 మండలాల్లో వరి కోతలు ముమ్మరంగా జరుగుతున్నాయి.

పనిచేయని సర్వర్లు

జిల్లాలో ధాన్యం కొనుగోలు ఈ నెల 29 వరకు బాగానే జరిగినా ఆ తరువాత నుంచి సర్వర్లు పనిచేయక రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు 205 ఏర్పాటు చేసినా సర్వర్లు పనిచేయక ఎక్కడి ధాన్యం అక్కడే నిలిచిపోయింది. ఒకవైపు వర్షాలు జోరుగా కురుస్తున్నా రైతులు మాత్రం ధాన్యం మాసూళ్లు ఆపలేదు. ఎప్పుడు వర్షం తగ్గితే అప్పుడు వరికోత యంత్రాలతో కోతలు కోయించి ధాన్యాన్ని రోడ్లపైకి తీసుకువచ్చి ధాన్యం తడిసిపోకుండా బరకాలతో కప్పి రాశులుగా చేశారు. నాలుగురోజులుగా ఇదే పరిస్థితి కొనసాగుతున్నా సర్వర్ల గురించి అధికారులు పట్టించుకోవడంలేదు. దీనితో రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాయాల్సి వస్తోంది.

జిల్లాలో ధాన్యం నిల్వలు ఎన్ని

జిల్లాలో 4 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనాలు వేసి, అందుకు తగినట్లు కొనుగోలు కేంద్రాలు ఏర్పాట్లు చేశారు. నవంబర్‌ 30వ తేదీ వరకు జిల్లాలో 28,180 మంది రైతుల నుంచి 2,10,210.640 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనగోలు చేశారు. అధికారుల అంచనాల ప్రకారం జిల్లాలో ఇంకా 1.90 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించవలసి ఉంది. ఇప్పటి వరకు కోతలు 60 శాతం పూర్తయ్యాయి. నాలుగు రోజులుగా జిల్లాలో వరి కోతలు జరిగి రైతుల వద్ద నిల్వ ఉన్న ధాన్యం సుమారు లక్ష మెట్రిక్‌ టన్నులని అంచనా. వర్షంతో ధాన్యం తడిసిపోయి మొలకలు రావటంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు.

తగ్గుతున్న దిగుబడులు

జిల్లాలో మోంథా తుపాన్‌కు ముందు జరిగిన మాసూళ్లలో దిగుబడి 30 నుంచి 35 బస్తాలు వస్తే ఇప్పుడు దిత్వా తుపాను వల్ల పండిన పంట తడిసి ఈదురు గాలులకు చేలు పడిపోయి ధాన్యం రాలిపోవటంతో దిగుబడి 18 నుంచి 22 బస్తాలు మాత్రమే వస్తోంది.

ఖండవల్లి కొనుగోలు కేంద్రంలో సర్వర్‌ పనిచేయక ఎదురు తెన్నులు

నల్లాకులవారిపాలెంలో మొలక వచ్చిన ధాన్యం

వైఎస్సార్‌ సీపీ

ప్రభుత్వ హయాంలో..

2023లో వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో వచ్చిన తుపాను సమయంలో రైతులకు ముందస్తుగా హెచ్చరికలు చేయటంతో పాటు వ్యవసాయ, రెవెన్యూ అధికారులు సమన్వయంతో పనిచేసి చేలల్లో ఉన్న ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించారు. తడిసిన ధాన్యం సేకరించాలని ఆదేశాలు ఇవ్వటంతో పాటు ఆఫ్‌లైన్‌లో కొనుగోలు చేసి మిల్లులకు తరలించారు. ఇప్పడు అటువంటి హెచ్చరికలు లేవు. అధికారులు పత్తాలేకుండా పోయారని, సంచులు కూడా సక్రమంగా పంపిణీ చేయలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మొరాయించిన సర్వర్లు

పట్టించుకోని అధికారులు

నిలిచిపోయిన కొనుగోళ్లు

తడిసి ముద్దయి మొలక వస్తున్న వైనం

గగ్గోలు పెడుతున్న రైతన్నలు

జిల్లాలో వరి సాగు 79,966 హెక్టార్లు

కోతలు పూర్తి అయింది 60 శాతం

ధాన్యం కొనుగోలు అంచనాలు

4 లక్షల మెట్రిక్‌ టన్నులు

ఇప్పటికి 2.10 లక్షల మెట్రిక్‌ టన్నుల

సేకరణ

ఆరబెట్టి పట్టుకు రమ్మన్నారు

ఽతుపాను వలన ఽచేను ఎక్కడ పడిపోతుందోనని భయపడి రాత్రి సమయంలో వరికోత యంత్రంతో కోతలు కోయించి ధాన్యం పట్టుకొచ్చి గట్టుపై వేశాను. అంతే వర్షం వచ్చింది. కొనుగోలు కేంద్రానికి వెళితే ధాన్యం తడసింది, ఆరబెట్టి పట్టుకు రమ్మన్నారు.

–బండెల సాయిరామ్‌,

కౌలు రైతు, ఖండవల్లి

ఏం చేయాలో అర్థం కావడం లేదు

చేతికి వచ్చిన పంట నోటికి దక్కుతుందో లేదో తెలియటం లేదు. కష్టపడి కోతలు కోయించాను. ఆరబెట్టాను. తీరా కొనుగోలు కేంద్రానికి పట్టుకెళ్లితే సర్వర్లు పనిచేయటం లేదు, రేపు పట్టుకు రమ్మని చెప్పారు. వర్షం వచ్చి ధాన్యం తడిసి మొలక వచ్చింది. ఏం చేయాలో అర్థం కావడం లేదు.

–కె.రాఘవులు, కౌలు రైతు, ఖండవల్లి

గత ప్రభుత్వంలో అధికారులు సహకరించారు

రైతు ప్రభుత్వం అంటే ఇదేనా? రైతులు నానా పాట్లు పడుతుంటే పట్టించుకున్న నాథుడే లేడు. వర్షాల వల్ల ధాన్యం మొలక వచ్చాయి. ఎండ కాస్తే కానీ ధాన్యం ఆరదు. అధికారులు ఎవరూ కనిపించటం లేదు. కొనుగోలు కేంద్రాల్లో సర్వర్లు పనిచేయటం లేదు. ఫిర్యాదు చేసినా పట్టించుకునే అఽధికారి లేరు. నాయకులు లేరు. గత ప్రభుత్వంలో ఇటువంటి ఇబ్బంది వచ్చినప్పుడు అధికారులు సహకరించారు.

– పిల్లా శ్రీనివాస్‌, రైతు, కొత్తపల్లి అగ్రహారం

ఎక్కడి ధాన్యం అక్కడే1
1/6

ఎక్కడి ధాన్యం అక్కడే

ఎక్కడి ధాన్యం అక్కడే2
2/6

ఎక్కడి ధాన్యం అక్కడే

ఎక్కడి ధాన్యం అక్కడే3
3/6

ఎక్కడి ధాన్యం అక్కడే

ఎక్కడి ధాన్యం అక్కడే4
4/6

ఎక్కడి ధాన్యం అక్కడే

ఎక్కడి ధాన్యం అక్కడే5
5/6

ఎక్కడి ధాన్యం అక్కడే

ఎక్కడి ధాన్యం అక్కడే6
6/6

ఎక్కడి ధాన్యం అక్కడే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement