కోటసత్తెమ్మ తిరునాళ్లకు వేళాయె
నిడదవోలు రూరల్: మండలంలోని తిమ్మరాజుపాలెం గ్రామంలో కొలువైన కోటసత్తెమ్మ అమ్మవారు భక్తుల కొంగు బంగారంగా వెలుగొందుతున్నారు. శక్తి స్వరూపిణి అయిన కోటసత్తెమ్మపై భక్తులకు అపారమైన భక్తి. అమ్మవారిని కొలిస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయని ప్రగాఢ విశ్వాసం. ఏటా ఇక్కడ దేవీ నవరాత్ర మహోత్సవాలతో పాటు డిసెంబర్ నెలలో అమ్మవారి ‘తిరునాళ్లు’ వైభవంగా నిర్వహిస్తారు. అమ్మవారి ఆలయానికి ప్రతి ఆది, మంగళవారాల్లో అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి తమ మొక్కులను తీర్చుకుంటారు. ఈ ఏడాది తిరునాళ్లకు వచ్చే భక్తుల కోసం ఆలయ అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు.
ఆలయ చరిత్ర ఇదీ..
తిమ్మరాజుపాలెంలో వేంచేసియున్న కోటసత్తెమ్మ అమ్మవారి ఆలయానికి ఘన చరిత్ర ఉంది. అమ్మవారు ‘శంఖచక్రగధ అభయ హస్తయజ్ఞోప వీత ధారిణిగా ఏక శిలావిగ్రహంతో దర్శనమిస్తారు. ఈ ఆలయ క్షేత్రంలో గతంలో కోట ఉండేదని కాలక్రమంలో అది అంతరించిందని భక్తులు చెబుతారు. కోటసత్తెమ్మ విగ్రహం 11వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పాలించిన తూర్పు చాళుక్యుల నాటిది. నాటి నిరవద్యపురాన్ని (నిడదవోలు)పాలించిన కాకతీయరాజు వీరభద్రుని కోటలోని శక్తిగా పూజలందుకుని కాలక్రమంలో కనుమరుగైన అమ్మవారి విగ్రహం 1934లో తిమ్మరాజుపాలెం గ్రామానికి చెందిన దేవులపల్లి రామమూర్తి శాస్త్రి పొలం దున్నుతుండగా బయటపడింది. ఈ భూమి యజమాని రామమూర్తి శాస్త్రికి ఒకరోజు వచ్చిన కలను అనుసరించి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఆనాటి నుంచి దినదినాభివృద్ధి చెందుతూ ఉభయగోదావరి జిల్లాలతో పాటు రాష్ట్రంలోని భక్తుల పాలిట పుణ్యస్థలంగా పేరుగాంచింది.
ఇవీ కార్యక్రమాలు
కోటసత్తెమ్మ అమ్మవారి ‘తిరునాళ్లు గురువారం నుంచి 8 తేదీ వరకు నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు పూర్తిచేశారు. అమ్మవారి ఆలయ ప్రాంగణం విద్యుత్తు దీపాలంకరణలు, భారీ సెట్టింగులతో దేదీప్యమానంగా దర్శనమిస్తోంది. గురువారం ఉదయం ఆలయ ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్, ఛైర్మన్ దేవులపల్లి రవిశంకర్ దంపతులు కలశ స్థాపనతో ఉత్సవాలు ప్రారంభించి అమ్మవారికి లక్ష కుంకుమార్చన చేస్తారు. ప్రతి రోజు అమ్మవారికి సహస్ర నామ పూజలతో పాటు ఉదయం చండీపారాయణం, సాయంత్రం హోమాలు నిర్వహిస్తారు. 5న ఉదయం 10 గంటలకు గురవాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి, నిడదవోలు నాంగల్యదేవి అమ్మవారి దేవస్థానం ఆధ్వర్యంలో అమ్మవారికి చీర–సారె సమర్పణ, 6న నిడదవోలు ఆర్యవైశ్య వర్తక సంఘం వారి చీర–సారె సమర్పణ, 7న అఖిల తెలుగుసేన మహిళా అధ్యక్షురాలు జి.ఆదిలక్ష్మి ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం నుంచి 101 మహిళలతో చీర–సారె, కలశాలు, బోనాలతో అమ్మవారికి పసుపు, కుంకుమలు సమర్పిస్తారు. 8న సోమవారం సాయంత్రం 6 గంటలకు విలస గ్రామానికి చెందిన మానేపల్లి సత్యనారాయణ సన్నాయిమేళం, గరగ నృత్యాలు, నందన డాన్స్ ఆకాడమీ (తణుకు) వారి కూచిపూడి, జానపద నృత్య ప్రదర్శన, కేరళ చందామేళం, కాళికా డాన్స్, మహిళల కోలాటం ఏర్పాటు చేశారు.
భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు
ఈ ఏడాది కోటసత్తెమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో జరిగే తిరునాళ్లు కార్యక్రమాలకు వచ్చే భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశాం. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించడంతో పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తాం.
– వి.హరిసూర్యప్రకాష్, అసిస్టెంట్ కమిషనర్, ఆలయ ఈఓ, తిమ్మరాజుపాలెం.
కోరిన కోర్కెలు తీర్చే తల్లిగా ప్రసిద్ధి
నేటి నుంచి ఈ నెల 8వ తేదీ వరకు మహోత్సవాలు
విద్యుత్ కాంతులతో మెరుస్తున్న
ఆలయ ప్రాంగణం
కోటసత్తెమ్మ తిరునాళ్లకు వేళాయె
కోటసత్తెమ్మ తిరునాళ్లకు వేళాయె


