వ్యాస భారతం ధర్మాల పుట్ట
సమన్వయ సరస్వతి సామవేదం
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): వేదవ్యాస భారతం ధర్మాల పుట్ట, ఏ శ్లోకాన్ని తాకినా అనేక ధర్మ రహస్యాలు వెల్లడి అవుతాయని సామవేదం షణ్ముఖ శర్మ అన్నారు. ఋషిపీఠం చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో స్థానిక హిందూ సమాజంలో నిర్వహిస్తున్న వేదవ్యాస మహాభారతం ప్రవచనంలో ఏడో రోజైన బుధవారం ఆయన శాకుంతలం ఇతివృత్తాన్ని వివరించారు. వేట తమకంతో కణ్వుని ఆశ్రమానికి వచ్చిన దుష్యంతుడు శకుంతల పట్ల ఆకర్షితుడు అవుతాడు. విప్ర సీ్త్రల పట్ల నా మనస్సు చలించదు, నీవు ఎవరివి అని శకుంతలను అడుగుతాడు. ఆమె తాను విశ్వామిత్రుని కుమార్తెనని, కణ్వుడు తనను పెంచిన తండ్రి అని వివరిస్తుంది. వారు గాంధర్వ వివాహం చేసుకుంటారని సామవేదం అన్నారు. తనకు పుట్టిన కుమారుని తీసుకుని దుష్యంతుని వద్దకు వెళ్ళిన శకుంతల ఆయన తిరస్కారానికి గురి అవుతుంది. నీవు ఎవరో నాకు తెలియదని అన్న దుష్యంతునితో శకుంతల అన్న మాటలను విద్యార్థి లోకానికి తెలియపరచాలని సామవేదం అన్నారు. ‘నీ హృదయంలో ఉన్న అంతరాత్మకు నిజం తెలుసు. ఏకాంతంలో జరిగినది ఎవరికీ తెలియదని అనుకోవద్దు, సూర్య చంద్రులు, అగ్ని, వాయువు, అంతరిక్షం, భూమి, ఉభయ సంధ్యలు, అంతరాత్మ సాక్షులు, వారి కన్ను కప్పలేవు‘ అని శకుంతల దుష్యంతునితో చెబుతుంది. దుర్వాస మహర్షి శాపంతో దుష్యంతుడు శకుంతలను మరచిపోయాడని వ్యాస భారతంలో లేదు, కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలంలో ఇటువంటి కథనం కనపడుతుంది. ఈ కథనానికి పద్మ పురాణం ఆధారమని సామవేదం అన్నారు. భారతంలో స్త్రీ పాత్రలు ఉదాత్తమైనవని ఆయన అన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో
అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు
కంబాలచెరువు(రాజమహేంద్రవరం): 2025 – 26 విద్యా సంవత్సరంలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లను జిల్లాలోని 11 మండలాల్లో నియమించనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి కె.వాసుదేవరావు బుధవారం ప్రకటనలో తెలిపారు. తాత్కాలిక పద్ధతిలో 25 పోస్టులను భర్తీ చేస్తామని, డిసెంబర్ 8 నుంచి మే 7వ తేదీ వరకు వీరు పనిచేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అనపర్తి, బిక్కవోలు, పెరవలి, రాజమహేంద్రవరం (అర్బన్), రాజమహేంద్రవరం (రూరల్), ఉండ్రాజవరం, కొవ్వూరు, నిడదవోలు, సీతానగరం, రాజానగరం, కడియం మండలాల్లో ఈ పోస్టుల నియామకాలుంటాయన్నారు. అర్హత గల అభ్యర్థులు సంబంధిత మండల విద్యాశాఖాధికారులకు దరఖాస్తులను ఈ నెల 5వ తేదీలోపు సమర్పించాలన్నారు. మరిన్ని వివరాలకు మండల విద్యాశాఖాధికారులను సంప్రదించాలన్నారు.
పనిచేసిన సర్వర్లు
పెరవలి: మండలంలో వరికోతలు 85 శాతం పూర్తయ్యాయని, 11,061 మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేసి మిల్లులకు తరలించామని వ్యవసాయాధికారి మేరీ కిరణ్ తెలిపారు. బుధవారం సాక్షి దినపత్రిలో ‘మోరాయించిన సర్వర్లు –వర్షార్పణం’ శీర్షికన కథనం ప్రచురితమైంది. దీనిపై అఽధికారులు స్పందించారు. ఈ నెల రెండో తేదీన ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సర్వర్లు సాంకేతిక కారణాల వలన పని చేయలేదని, తరువాత సాంకేతిక సమస్య తొలగిందన్నారు. పెరవలిలో రైతు భరోసా కేంద్రానికి రైతులందరూ ఒక్కసారే రావడంతో కొద్ది సేపు ఆలస్యమైందని, తర్వాత ఆన్‌లైన్ చేసి ధాన్యాన్ని తరలించామని తెలిపారు. వర్షాల వలన ఽబరకాలు కప్పి ఉంచిన ధాన్యాన్ని ఈరోజు ఆరబెట్టించి రైతు సేవా కేంద్రాల ద్వారా మిల్లులకు పంపించమని తెలిపారు. అలాగే రైతుల వద్ద ఉన్న ధాన్యాన్ని రైతు సేవా కేంద్రాల వద్ద ఆన్‌లైన్ చేసి మిల్లులకు తరలిస్తామని వివరణ ఇచ్చారు.
6న జాబ్ మేళా
అమలాపురం రూరల్: అమలాపురంలోని ఉపాధి కార్యాలయ ప్రాంగణంలో ఈ నెల 6వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి వసంతలక్ష్మి తెలిపారు. ప్రముఖ ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాల భర్తీకి ఉదయం 10 గంటల నుంచి ఇంటర్వ్యూలు జరుగుతాయన్నారు. పదో తరగతి, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు తమ ధ్రువపత్రాలు, బయోడేటాతో హాజరుకావాలని కోరారు.
వ్యాస భారతం ధర్మాల పుట్ట


