ఉద్యోగాల పేరిట టోపీ
● రూ.75 లక్షల వసూలు
● ట్రాంజ్ ఇండియా కార్పొరేట్ నెట్‌వర్క్‌కు
చెందిన ఎనిమిది మంది అరెస్ట్
● వివరాలు వెల్లడించిన కాకినాడ
ఎస్డీపీవో మనీష్ దేవరాజ్ పాటిల్
పిఠాపురం: ఉద్యోగాల పేరుతో యువకులకు గాలం వేసి సుమారు రూ.75 లక్షలు వసూలు చేసి మోసగించిన కేసులో ట్రాంజ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నెట్‌వర్క్‌కు చెందిన 8 మందిని అరెస్ట్ చేసినట్లు కాకినాడ ఎస్డీపీవో (సబ్ డివిజినల్ పోలీసు ఆఫీసర్) మనీష్ దేవరాజ్ పాటిల్ తెలిపారు. పిఠాపురం పోలీస్ స్టేషన్‌లో మంగళవారం ఆయన వివరాలు వెల్లడించారు. రాయుడుపాలేనికి చెందిన నాళం గంగాభవాని గత నెల 24వ తేదీన పిఠాపురం కోటగుమ్మం సెంటర్లో ‘ఉద్యోగ అవకాశాలు. నెలకు రూ.15,000 నుంచిరూ రూ.35,000 జీతం‘ అని ఉన్న పాంప్లెట్ చూసి, అందులోని నంబర్లకు కాల్ చేసింది. అటువైపు మాట్లాడిన వ్యక్తులు ప్రాసెసింగ్ ఫీజులు, ల్యాప్‌ట్యాప్ పేరుతో రూ.24,000 ఫోన్ పే ద్వారా పంపించమని చెప్పి పంపిన తరువాత మోసం చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కోటపల్లి సాయి, అతని స్నేహితులు మరో ముగ్గురు ఒక్కొక్కరు రూ.13 వేల చొప్పున ఇలాగే మోసపోయినట్లు ఫిర్యాదు చేశారు. పిఠాపురం పట్టణ పోలీసు స్టేషన్లో రెండు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎస్పీ జి.బిందుమాధవ్ ఆదేశాలతో పిఠాపురం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ జి. శ్రీనివాస్, ఎస్సైలు వి.మణికుమార్, ఎస్‌కే జానీబా షాతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి దర్యాప్తు నిర్వహించామన్నారు. ట్రాంజ్ ఇండియా కార్పొరేట్ నెట్‌వర్క్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట రాజమహేంద్రవరంలో కార్యాలయం ఏర్పాటు చేసి, డేటాఎంట్రీ, టెలికాలింగ్ ఉద్యోగాల పేరుతో పాంప్లెట్లు ముద్రించి పిఠాపురం సహా పరిసర ప్రాంతాల్లో అతికించి, నిరుద్యోగుల నుంచి రూ.13,000 చొప్పున వసూలు చేసినట్లు దర్యాప్తులో తేలింది.
ప్రత్యేక బృందాల సాయంతో నిందితుల పట్టివేత
ఎవరినైనా కొత్త వ్యక్తులను కంపెనీలో జాయిన్ చేసినవారికి కంపెనీ రూ.900 ఇస్తుందని నమ్మించారు. జాయిన్ అయిన కొత్త వ్యక్తులతో బ్యాంకు అకౌంట్లను ఓపెన్ చేసి ఫోన్ కాల్స్ ద్వారా ఇతర వ్యక్తులను మోసం చేసేవారు. అకౌంట్లో డబ్బు వేయించుకున్నాక, మొత్తం నగదును వారితో డ్రా చేయించి సొమ్ముని మేనేజర్ అయిన మంజునాథ్ తీసుకుని కంపెనీకి డిపాజిట్ చేస్తున్నట్లు నమ్మించేవారు. గత సంవత్సరం నుంచి సుమారు రూ.75 లక్షలు నిరుద్యోగ యువతీ యువకుల వద్ద నుంచి వసూలు చేసినట్లు దర్యాప్తులో తేలిందన్నారు. ప్రత్యేక బృందాల ద్వారా ఈ మోసాలకు పాల్పడిన సత్యసాయి జిల్లా గుండువెల్ల గ్రామానికి చెందిన మేకల మంజునాథ్, కర్ణాటక రాష్ట్రం తమకూరు జిల్లా మల్లనాయకనపల్లికి చెందిన సిద్ధేశ్ శ్రీధర్, సిద్దేశ్ సుదీ, నంద్యాల జిల్లా హనుమంతుకుండకు చెందిన యశ్వంత్ కుమార్, అనంతపురం జిల్లా మార్తాడుకు చెందిన వడ్డి జయరాముడు, పార్వతీపురం జిల్లాకు చెందిన దేశం సౌజన్య, అనంతపురం జిల్లా మద్దన్నకుంటకు చెందిన నాగప్ప కావ్య, యానాంకి చెందిన రేపు మహాలక్ష్మిలను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వారి నుంచి ల్యాప్‌ట్యాప్, అకౌంట్ బుక్స్, ఏటీఎం కార్డులు, మొబైల్స్, సిమ్ కార్డ్స్, రూ.53,000 నగదు, 20 గ్రాముల బంగారం, టీ షర్ట్స్ ట్రాన్స్ ఇండియా కంపెనీ ప్రమోషన్ ఐటమ్స్‌ను స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులను రిమాండ్ నిమిత్తం పిఠాపురం జీఎఫ్ సీఎం కోర్టులో హాజరు పరుస్తామని తెలిపారు.
ఉద్యోగాల పేరిట టోపీ


