పరిహారం ఎప్పుడు బాబూ?
సాక్షి, రాజమహేంద్రవరం: మోంథా తుపాను అక్టోబర్ నెలాఖరులో విరుచుకుపడి రైతులను నిండా ముంచేసింది. పంట చేతికందే సమయంలో వచ్చిన ఈ తుపాను ప్రభావంతో జిల్లావ్యాప్తంగా వేలాది ఎకరాల్లో వరి పంట నేలకొరిగింది. పొలాల్లో నీరు చేరి, పంట కోతలకు సైతం తీవ్ర ఇబ్బంది ఏర్పడింది. మరోవైపు ఉద్యాన పంటలకు కూడా తీవ్ర నష్టం వాటిల్లింది. ఆపత్కాలంలో రైతులకు అండగా ఉండాల్సిన చంద్రబాబు ప్రభుత్వం చేతులెత్తేసింది. పంట నష్టం అంచనాలు అరకొరగా రూపొందించి మమ అనిపించేసింది. ఇక పరిహారం ఎప్పుడిస్తారో తెలియని పరిస్థితి. వారి అవస్థలను ప్రభుత్వం పట్టించుకుంటున్న దాఖలాలు కనిపించడం లేదు. పైగా రైతులకు ఎంతో చేసినట్లు కలరింగ్ ఇచ్చే ప్రయత్నాలకు నాంది పలికిందనే విమర్శలు వస్తున్నాయి. ఇందులో భాగంగానే గత నెల 24 నుంచి 30వ తేదీ వరకూ ‘రైతన్నా మీకోసం’ పేరిట ప్రచారార్భాటానికి శ్రీకారం చుట్టింది. రైతుల జీవనోపాధి, ఆర్థిక స్థితి, నైపుణ్యాభివృద్ధిలో శాశ్వత మార్పు తెస్తామని చెబుతోంది. వాస్తవానికి ఈ కార్యక్రమాన్ని ప్రతి రైతు సేవా కేంద్రం పరిధిలోనూ తూతూ మంత్రంగానే నిర్వహించారు. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా నిర్వహిస్తున్న కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు బుధవారం నల్లజర్ల రానున్నారు. తమను ఆదుకోవాల్సిన సమయంలో ఇటువంటి ప్రచార కార్యక్రమాలేమిటనే విమర్శ రైతుల నుంచి వస్తోంది.
అన్నదాతకు అపార నష్టం
● జిల్లావ్యాప్తంగా మోంథా తుపాను నష్టాలపై అధికారులు ప్రభుత్వానికి తుది నివేదిక పంపారు. దీని ప్రకారం మొత్తం 18 మండలాల పరిధిలోని 33,262 మంది రైతులు 16,540 హెక్టార్లలో వ్యవసాయ, ఉద్యాన పంటలు నష్టపోయారు. దీని విలువ రూ.40.96 కోట్లుగా నిర్ధారించారు.
● ఇందులో 31,074 మంది రైతులకు చెందిన వరి, మినుముకు సంబంధించి 15,738.607 హెక్టార్లలో పంట నష్టం వాటిల్లింది. దీని విలువ రూ.38,21,07,405 కోట్లుగా పేర్కొన్నారు.
● మోంథా తుపానుతో జిల్లావ్యాప్తంగా ఏడు రకాల ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లింది. రాజానగరం, రంగంపేట, సీతానగరం, కొవ్వూరు, చాగల్లు, నల్లజర్ల, పెరవలి, ఉండ్రాజవరం, నిడదవోలు, తాళ్లపూడి, గోపాలపురం, దేవరపల్లి మండలాల్లో పంట నష్టం అత్యధికంగా జరిగింది. 14 మండలాల్లో 802.193 హెక్టార్లలో పంటలు దెబ్బ తిన్నట్లు నిర్ధారించారు. 2,153 మంది రైతులకు సంబంధించి రూ.2,75,77,692 కోట్ల నష్టం జరిగినట్లు తేల్చారు.
● పంట నష్టపోయిన రైతులందరి పేర్లూ నమోదు చేయలేదు. 33 శాతం కంటే ఎక్కువ నష్టపోయిన వారి పేర్లు మాత్రమే నమోదు చేశారు.
● వరికి హెక్టారుకు రూ.25 వేలు, మినుముకు హెక్టారుకు రూ.17 వేల చొప్పున ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాల్సి ఉంది.
● నివేదిక సమర్పించి రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకూ నయాపైసా నష్టపరిహారం అందించిన దాఖలాలు లేవు. ఎప్పుడు ఇస్తారన్న స్పష్టత కూడా ఇవ్వకపోవడంతో పంట సాగుకు చేసిన అప్పులు ఎలా తీర్చుకోవాలో తెలియక రైతులు గగ్గోలు పెడుతున్నారు.
అన్నిటా అన్యాయమే..
● తాము అధికారంలోకి వస్తే అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు ఏటా రూ.20 వేల పెట్టుబడి సాయం అందిస్తామని చంద్రబాబు, కూటమి నేతలు ప్రకటించారు. అధికారం చేపట్టిన తొలి ఏడాది ఈ సాయం ఎగ్గొట్టారు. రెండో దశలో జిల్లా వ్యాప్తంగా 18,511 మంది రైతులకు మొండిచేయి చూపారు.
● ఉచిత పంటల బీమాకు చంద్రబాబు ప్రభుత్వం మంగళం పాడింది. ప్రీమియం భారం రైతుల పైనే మోపింది. హెక్టారు వరి పంట విలువను రూ.1.05 లక్షలుగా నిర్ధారించి, రైతు వాటాగా రూ.1,575 (1.50 శాతం) ప్రీమియం చెల్లించాలని పేర్కొంది. ఇది భారం కావడంతో వేలాదిగా రైతులు పంటల బీమాకు దూరమయ్యారు. ఫలితంగా మోంథా తుపాను వల్ల జరిగిన పంట నష్టానికి వీరికి బీమా పరిహారం పొందలేని పరిస్థితి ఏర్పడింది.
● రైతులకు వ్యవసాయ సేవలు, విత్తనాలు, పురుగు మందులు అందించేందుకు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం 367 రైతు భరోసా కేంద్రాలు (ఆర్‌బీకే) ఏర్పాటు చేసింది. వీటి ద్వారా నాణ్యమైన ఎరువులు, విత్తనాలు, ఉద్యాన పంటలకు ఎంతో ప్రోత్సాహం అందించింది. రైతులకు సకాలంలో సూచనలు, సలహాలు అందించింది. అటువంటి వ్యవస్థ ప్రస్తుతం నిర్వీర్యమైంది. ఎరువుల పంపిణీ బాధ్యతను పీఏసీఎస్‌లకు అప్పగించారు. ఫలితంగా ఎరువులు పొందేందుకు రైతులు నానా అవస్థలూ పడ్డారు.
చంద్రబాబు రైతు వ్యతిరేకి
వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేసి, దండగ అన్న ముఖ్యమంత్రి చంద్రబాబే. రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చి ఆదుకోవాలని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్సార్ నిర్ణయిస్తే.. కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవాలంటూ వ్యంగ్యంగా మాట్లాడిన వ్యక్తి చంద్రబాబు. 17 నెలల చంద్రబాబు పాలనలో ధాన్యం, పొగాకు, మిర్చి, టమాటా, ఉల్లి, అరటి, మామిడి, పత్తి, బత్తాయి, మొక్కజొన్న, చీనీ ఇలా.. ఏ పంటకూ గిట్టుబాటు ధర రాక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ 17 నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 70 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. 2014లో రూ.80 వేల కోట్ల రుణాలు మాఫీ చేస్తానంటూ అధికారంలోకి వచ్చి.. రూ.15 వేల కోట్లు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకొన్నారు. ఇప్పుడు కూడా అదే పంథా అవలంబించారు. అన్నదాత సుఖీభవ కింద కేంద్రంతో సంబంధం లేకుండా రూ.20 వేలు ఇస్తామని చెప్పి.. ఇప్పుడు కేంద్రం ఇచ్చే రూ.6 వేలు కలిపి ఇస్తూ మోసం చేస్తున్నారు.
– తలారి వెంకట్రావు, మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ కొవ్వూరు నియోజకవర్గ ఇన్‌చార్జి
మిగిలిన వాటికీ నిరీక్షణే..
మోంథా తుపాను ప్రభావంతో జిల్లాలో ఇతర రంగాలకు కూడా నష్టం వాటిల్లింది. మొత్తం 56 ఇళ్లు నేలమట్టమవగా రూ.28 లక్షల నష్టం జరిగినట్లు నిర్ధారించారు. విద్యుత్ శాఖకు రూ.37.34 లక్షల నష్టం జరిగింది. 48 రోడ్లు ధ్వంసమయ్యాయి. రంగంపేటలో రూ.6.26 కోట్లు, బిక్కవోలులో రూ.4.04 కోట్లు, రాజానగరంలో రూ.16 కోట్ల మేర రహదారులకు నష్టం వాటిల్లింది. 33 పంచాయత్‌రాజ్ రోడ్లు దెబ్బ తినగా.. రూ.45.81 కోట్ల మేర నష్టం జరిగింది. 21 మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు, చెరువులకు రూ.6.87 కోట్ల మేర నష్టం వాటిల్లింది. వీటి పరిస్థితి ఏమిటనే దానిపై ప్రభుత్వం ఇప్పటి వరకూ స్పష్టత ఇవ్వలేదు.
ఫ ‘మోంథా’ పంట నష్టం రూ.40.96 కోట్లు
ఫ నేటికీ రైతుకు నయాపైసా అందించని ప్రభుత్వం
ఫ నేడు నల్లజర్లలో ‘రైతన్నా మీకోసం’
ఫ హాజరు కానున్న సీఎం చంద్రబాబు
ఫ రైతులను ఆదుకోకుండా వారి సంక్షేమానికి కృషి చేస్తున్నట్లు కలరింగ్ ఇవ్వడమేమిటంటూ విమర్శలు
పరిహారం ఎప్పుడు బాబూ?


