భారత కథకు మూలపురుషుడు వ్యాసుడు
అల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): భారత కథను రచించినవాడే కాదు.. దీనికి మూలపురుషుడు కూడా వేద వ్యాసుడేనని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖశర్మ అన్నారు. ఋషిపీఠం చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యాన స్థానిక హిందూ సమాజంలో నిర్వహిస్తున్న వేదవ్యాస భారత ప్రవచనాన్ని ఆరో రోజైన మంగళవారం ఆయన కొనసాగించారు. ‘వ్యాసాయ విష్ణురూపాయ, వ్యాసరూపాయ విష్ణవే’ అని ఆర్షవాజ్ఞ్మయం చెబుతోంది. వ్యాసుడు విష్ణువే. కనుకనే మహాభారతాన్ని రచించగలిగాడు. ఇతరులకు అది సాధ్యం కాదు. వ్యాసోచ్ఛి ష్టం జగత్ సర్వం అన్నది అక్షరసత్యం. సాహిత్యమంతా వ్యాసుని ఉచ్ఛిష్టం నుంచి వచ్చినదే. మహాకవి కాళిదాసు రచించిన అభిజ్ఞాత శాకున్తలమ్, మాఘుని శివుపాల వధ తదితర కావ్యాలన్నిటికీ మూలం భారతమే’ అని చెప్పా రు. బ్రహ్మసూత్రాలు వ్యాసుడు రాయలేదని, బాదరాయణుడు, మరొకరంటూ కొందరు పండితులు వ్యాఖ్యానాలు చేయడం శోచనీయమన్నారు. భారత భాగవతాలు, పురాణాలు రచించిన వ్యాసుడు కాక బ్రహ్మసూత్రాలు రాసింది మరొకరు కాదని స్పష్టం చేశారు. ‘మట్టి కుండ నుంచి పుట్టిన నీ పుట్టుక ఎట్టిది?’ అనే సినీ కవుల సంభాషణలు మూలగ్రంథాలను అధ్యయనం చేయకుండా రాసినవేనన్నారు. ఋషి హృదయాన్ని ఉపాసన ద్వారా గ్రహించాలని, కేవలం భాషాపాండిత్యాలు సరిపోవని చెప్పారు. భాగవతంలో విష్ణుదేవుని 21 అవతారాలు కనపడతాయని, వాటిలో 17వది వ్యాసుడేనని అన్నారు. ‘మహాత్ముల పుట్టుకలను మామూలు పుట్టుకలుగా భావించరాదు. అవి దివ్యమైనవి. నిన్న వైజ్ఞానికంగా అసాధ్యమనుకున్నవి నేడు రుజువు కావడం చూస్తున్నాం. నాటి మానవుల ఆయుఃప్రమాణాలు వేరు. జగత్తుకు మూలం ధర్మం. ధర్మానికి మూలం వేదం. వేదాల్లో ఉన్న ధర్మాలను చెప్పడానికే స్మృతి పురాణేతిహాసాలు ఆవిర్భవించాయి. 12 సంవత్సరాలు బ్రహ్మచర్యం అవలంబించిన వాడు మహాయోగి కాగలడని స్వామి వివేకానందుడు అన్నాడు. ధర్మనిష్ఠయందే నిరంతరం చరించే మహామునుల మనస్సులు కొన్ని సందర్భాల్లో చలించడం దైవప్రేరణ వల్లనే జరిగింది’ అని వివరించారు. కురుపాండవుల జనన విశేషాలను సామవేదం తన ప్రవచనంలో వివరించారు.


