‘నన్నయ’కు 5 ఐఎస్‌ఓ సర్టిఫికెట్లు
రాజానగరం: ఆదికవి నన్నయ యూనివర్సిటీకి ఒకేసారి 5 ఐఎస్‌ఓ సర్టిఫికెట్లు లభించాయని, ఇదే ఒరవడిలో త్వరలోనే ఫైవ్ స్టార్ క్వాలిటీ రేటింగ్ సర్టిఫికెట్ కూడా అందుకుంటామని వైస్ చాన్సలర్ ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ అన్నారు. యూనివర్సిటీలోని ఈసీ హాలులో ఐక్యూ ఏసీ డైరెక్టర్ వి.పెర్సిస్ సమన్వయంతో మంగళవారం జరిగిన ఐఎస్‌ఓ ఎగ్జిట్ సమావేశంలో హిమ్ (హెచ్‌వైఎం) ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్స్ సంస్థ అధిపతి ఆలపాటి శివయ్య వీటిని వీసీకి అందజేశారు. అవసరాలకు అనుగుణంగా ఎనర్జీ, పర్యావరణ నిర్వహణ వ్యవస్థలను, విద్యార్థులకు అందిస్తున్న ఉత్తమ విద్యా సేవలకు, జెండర్ సెన్సిటైజేషన్ ఆడిట్ అమలుకు ఈ సర్టిఫికెట్లు ప్రతీకగా నిలుస్తాయన్నారు. శివయ్య మాట్లాడుతూ, వర్సిటీలో రెండు రోజుల పాటు నిర్వహించిన ఆడిట్ ప్రక్రియ సంతృప్తినిచ్చిందన్నారు. దీనికిగాను త్వరలోనే ఫైవ్ స్టార్ క్వాలిటీ రేటింగ్ సర్టిఫికెట్ అందిస్తామని చెప్పారు. తమ సంస్థ ద్వారా తొలిసారిగా ‘నన్నయ’ వర్సిటీకే ఈ సర్టిఫికెట్ అందజేయనున్నామన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య కేవీ స్వామి, అధ్యాపకులు పాల్గొన్నారు.


