బడోపేతానికి కసరత్తు | - | Sakshi
Sakshi News home page

బడోపేతానికి కసరత్తు

Dec 2 2025 8:24 AM | Updated on Dec 2 2025 8:24 AM

బడోపే

బడోపేతానికి కసరత్తు

ఆందోళనకరంగా ప్రభుత్వ

పాఠశాలల్లో విద్యార్థుల నమోదు

5న మెగా పీటీఎం 3.0

ఏర్పాట్లలో విద్యాశాఖ నిమగ్నం

రాయవరం: ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల బలోపేతం, విద్యార్థుల నమోదు లక్ష్యంగా తల్లిదండ్రులు–ఉపాధ్యాయుల సమావేశాన్ని నిర్వహించేందుకు రాష్ట్ర విద్యాశాఖ చర్యలు చేపట్టింది. దీనికి మెగా పీటీఎం 3.0గా నామకరణం చేశారు. ఈ విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు ఆందోళనకరంగా ఉంది. ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం కలిగించేందుకు, సమాజ భాగస్వామ్యం పెంచేందుకు, విద్యార్థుల ప్రగతిని తల్లిదండ్రులకు తెలియజేసేందుకు ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. విద్యార్థుల భవితకు బంగారు బాటలు వేసేలా అవసరమైన సూచనలను తల్లిదండ్రుల నుంచి సేకరించడం, పాఠశాలల అభివృద్ధికి దాతల సహకారం అర్థించడం వంటి అంశాల ప్రాతిపదికగా ఈ సమావేశాలు నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నారు. ఈ నెల 5వ తేదీ ఈ సమావేశాన్ని జిల్లా వ్యాప్తంగా 1,582 ప్రభుత్వ, మున్సిపల్‌, ఎయిడెడ్‌, ఏపీ సోషల్‌ వెల్ఫేర్‌, బీసీ వెల్ఫేర్‌ యాజమాన్యాల పరిధిలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో నిర్వహించేందుకు జిల్లా విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఈ సమావేశాలను ఉప విద్యాశాఖ అధికారులు, సమగ్ర శిక్షా సెక్టోరల్‌ అధికారులు, మండల విద్యాశాఖ అధికారులు పర్యవేక్షణ చేయనున్నారు.

విద్యార్థుల ప్రగతి నివేదికలు

ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఇప్పటికే రెండు ఫార్మేటివ్‌, సమ్మేటివ్‌–1 పరీక్షలు నిర్వహించారు. వీటిలో విద్యార్థులు సాధించిన మార్కులను ప్రగతి నివేదికల్లో పొందుపర్చి తల్లిదండ్రులకు అందించనున్నారు. ఈ ప్రగతి నివేదికల్లోనే విద్యార్థుల హాజరు, క్రీడా ప్రగతి, వ్యక్తిగత ఆరోగ్యాంశాలు పొందుపరచనున్నారు. విద్యార్థులు సెల్‌ఫోన్‌ అధికంగా వినియోగించకుండా తల్లిదండ్రులకు ఈ సమావేశాల వేదికగా అవగాహన కల్పించనున్నారు. సైబర్‌ నేరాలపై విద్యార్థులు, తల్లిదండ్రులకు మహిళా పోలీసుల ద్వారా అవగాహన కల్పిస్తారు. ఇదే సందర్భంలో విద్యార్థులకు వివిధ రకాల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేస్తారు. విద్యార్థులతో పాటుగా మెగా పేటీఎం రోజు తల్లులకు రంగవల్లులు పోటీలు, తండ్రులకు టగ్‌ ఆఫ్‌ వార్‌ పోటీలు నిర్వహించి బహుమతులు అందించనున్నారు. పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పూర్వ విద్యార్థులను ఆహ్వానించి వారు సాధించిన విజయాలను తెలియజెప్పేలా చర్యలు తీసుకుంటారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశాలు మధ్యాహ్నం ఒంటిగంటకు సహ ఫంక్తి భోజనంతో ముగియనున్నాయి. ఈ సమావేశాలకు సంబంధించిన వీడియోలు, ఫొటోలను మొబైల్‌ యాప్‌లో అప్‌లోడ్‌ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.

ఏర్పాట్లలో నిమగ్నం

మెగా పీటీఎం ఏర్పాట్లలో భాగంగా పాఠశాలల్లో అవగాహనా సమావేశాలు నిర్వహిస్తున్నాం. విద్యార్థుల ద్వారా తల్లిదండ్రులకు ఆహ్వాన పత్రాలు అందజేస్తున్నాం. రాజకీయాలకు అతీతంగా ఈ సమావేశాలను నిర్వహించేందుకు ఉన్నతాధికారులు అదేశాలు ఇచ్చారు.

– జి.మమ్మీ, అదనపు ప్రాజెక్టు

కోఆర్డినేటర్‌, సమగ్ర శిక్షా,

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా

ప్రధానోపాధ్యాయులు

చర్యలు చేపట్టాలి

విద్యాశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మెగా పీటీఎంను అన్ని ప్రభుత్వ, ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో నిర్వహించాల్సి ఉంది. ఈ మేరకు డీవైఈవోలు, ఎంఈవోలకు ఆదేశాలు ఇచ్చాం. స్థానిక పరిస్థితులను అంచనా వేసుకుని అందుకనుగుణంగా విద్యార్థులు, తల్లిదండ్రులు సమావేశాలకు హాజరయ్యేలా ప్రధానోపాధ్యాయులు చర్యలు తీసుకోవాలి.

– డాక్టర్‌ షేక్‌ సలీం బాషా, జిల్లా విద్యా శాఖాధికారి, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా

బడోపేతానికి కసరత్తు1
1/2

బడోపేతానికి కసరత్తు

బడోపేతానికి కసరత్తు2
2/2

బడోపేతానికి కసరత్తు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement