హెచ్‌ఎం కులవివక్ష చూపుతున్నారని ఆందోళన
● ఆగ్రహం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు
● విద్యాశాఖాధికారి హామీతో
నిరసన విరమణ
కొత్తపల్లి: పాఠశాలలో విద్యార్థుల మధ్య కుల వివక్ష చూపుతూ తల్లిదండ్రులను కూడా చులకన చేసి మాట్లాడుతున్న ప్రధానోపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులతో కలిసి తల్లిదండ్రులు సోమవారం ఆందోళన చేపట్టారు. ఆందోళన కారులకు సీఐటీయూ నాయకులు మద్దతు పలికారు. మండలంలోని ఎండపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో పిల్లల పట్ల వ్యత్యాసం చూపుతున్నారని, కులం పేరుతో దూషిస్తున్నారంటూ తల్లిదండ్రులు నిరసన వ్యక్తం చేశారు. దీంతో పాఠశాల వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్న జి.సురేష్ బోస్ పాఠశాలలో విద్యార్థుల మధ్య కుల వివక్ష చూపుతూ అగ్రకులాలకు చెందిన విద్యార్థులతో చులకనగా మాట్లాడుతున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. బాలికల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. అక్రమ సంబంధాలు అంటగడుతున్నారని ఆరోపించారు. మండల విద్యాశాఖాధికారులు వేణుగోపాల్, పైడిరాజు, ఎస్సై వెంకటేష్ పాఠశాల వద్దకు చేరుకుని ప్రధానోపాధ్యాయుడు, విద్యార్థుల తల్లిదండ్రులతో చర్చించారు. ఈ ఘటనపై పూర్తిస్ధాయిలో విచారణ చేపడతామని, వివక్ష లేకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
హెచ్‌ఎం కులవివక్ష చూపుతున్నారని ఆందోళన


