గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం స్వాధీనం
ఆలమూరు: మండలంలోని జొన్నాడ రావులపాలెం మధ్య ఉన్న గౌతమీ గోదావరి నదిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆలమూరు ఎస్సై జి.నరేష్ కథనం ప్రకారం గోదావరి మధ్యలో సుమారు 50 ఏళ్ల వయసు కలిగిన గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం స్థానికుల కంటపడింది. వారు ఇచ్చిన సమాచారంతో రావులపాలెం రూరల్ సీఐ సీహెచ్ విద్యాసాగర్ నేతృత్వంలో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీశారు. మూడు రోజుల క్రితమే మృతి చెంది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. మృతుడు నీలం రంగ నిక్కరు, బనియను ధరించి ఉన్నాడు. అతనికి ఎడమ చేయి లేదు. కాళ్లు, చేతి వేళ్లు కొరికినట్టు ఉన్నాయి. ఈ మృతదేహాన్ని జంతువులు కొరికివేసి ఉండవచ్చునని భావిస్తున్నారు. పోస్టుమార్టం కోసం మండపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
4న వాలీబాల్ ఎంపికలు
అమలాపురం టౌన్: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 4వ తేదీన రాజమహేంద్రవరం ఆర్ట్స్ క్రీడా మైదానంలో జూనియర్స్ బాలుర, బాలికల ఎంపికలు జరుగుతాయని ఉమ్మడి జిల్లా వాలీబాల్ అసోసియేషన్ కార్యదర్శి కుంచె యశ్వంత్ ఓ ప్రకటనలో తెలిపారు. ఆర్ట్స్ మైదానంలో డాక్టర్ పరి మి రామచంద్రరావు మెమోరియల్ వాలీబాల్ కో ర్టులో ఈ ఎంపిక పోటీలు జరుగుతాయని పేర్కొన్నారు. జూనియర్స్ కేటగిరిలో పాల్గొనే బాల బాలికలు 2008 జనవరి 1వ తేదీ తర్వాత పుట్టినవారు ఈ పోటీలకు అర్హులు. ఈనెల 4వ తేదీ మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఎంపికలు జరుగుతాయని తెలిపారు. పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు జనన ధ్రువీకరణ పత్రాలు, ఆధార్ కార్డును సమర్పించాలని సూచించారు. వివరాలకు 99595 07330, 92472 59703 ఫోన్ నెంబర్లలో సంప్రదించాలని యశ్వంత్ విజ్ఞప్తి చేశారు.
సంస్థను మోసగించిన
ఉద్యోగి పరారీ
బిక్కవోలు: మండలంలోని బలభద్రపురం గ్రామానికి చెందిన గ్రాసీం ఇండీస్ట్రీ అనుబంధ సంస్థ సిగాచిలో హెచ్‌ఆర్ విభాగంలో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్న సాంగిశెట్టి రామకృష్ణ సంస్థను మోసం చేసి పరారీలో ఉన్నట్టు ఎస్సై వాసంశెట్టి రవిచంద్ర కుమార్ తెలిపారు. సోమవారం సిగాచి సంస్థ డిప్యూటీ జనరల్ మేనేజరు మల్లాడి సుధాకర్ ఈ మేరకు ఫిర్యాదు చేశారన్నారు. తెలంగాణ రాష్ట్రం మల్కజగిరి ప్రాంతానికి చెందిన సాంగిశెట్టి రామకృష్ణ సిగాచి సంస్థలో హెచ్‌ఆర్ విభాగంలో అసిస్టెంట్ మేనేజరుగా పనిచేశాడు. ఆయన సోదరుడు సాంగిశెట్టి రాజేష్‌తో పాటు, బంధువులు, పరిచయం ఉన్న వ్యక్తుల పేర్లతో వారు సంస్థలో పనిచేయకపోయినా పనిచేసినట్లు జీతాలు ఇచ్చాడు. గడచిన ఆర్థిక సంవత్సరంలో రూ.9,38,175 వారి ఇచ్చినట్లు గుర్తించారు. సంస్థ ఆడిట్ చేసే లోపే విధుల నుంచి పరారయ్యాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.


