భార్యపై అనుమానంతో హత్య
● ఇంద్రపాలెం పిల్ల కాల్వ రోడ్డులో ఘటన
● కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
కాకినాడ రూరల్: పచ్చని సంసారంలో అనుమానమనే జాడ్యం చిచ్చురేపింది. బతుకు తెరువు కోసం ఊరు గాని ఊరు వచ్చిన ఆ కుటుంబంలో విషాదం నింపింది. కష్ట సుఖాల్లో కడ వరకూ తోడు ఉంటానని ఏడు అడుగుల సాక్షిగా మూడు ముళ్లు వేసిన భర్తే దారుణంగా సహధర్మ చారిణిని కడతేర్చాడు. కాకినాడ రూరల్ ఇంద్రపాలెం గ్రామంలో ఆదివారం రాత్రి చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి ఇంద్రపాలెం పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. ఇంద్రపాలెం పిల్ల కాల్వ ప్రాంతంలో అద్దెకు నివాసం ఉంటున్న బేతా మల్లీశ్వరి(47) భర్త గంగరాజు చేతిలో హత్యకు గురయ్యింది. మల్లీశ్వరి, గంగరాజు దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. వీరిది నర్సీపట్నం సమీపంలోని వేమూలపూడి గ్రామం. కూతురుకు కాకినాడ రూరల్ స్వామినగర్‌కు చెందిన వ్యక్తితో వివాహం జరిపించారు. కొడుకు మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. పనీపాటూ లేకుండా ఇంటి వద్ద గడిపే గంగరాజు తరచూ భార్యను వేధించడంతో గొడవలు జరిగేవి. ఈ నేపథ్యంలో కూతురు స్వామినగర్‌లో ఉండడంతో వారు కాకినాడ రూరల్ ఇంద్రపాలెంకు నెలన్నర కిత్రం మకాం వచ్చారు. అప్పటి నుంచి ఇంద్రపాలెం పిల్ల కాల్వ రోడ్డులో ఉంటున్నారు. మల్లేశ్వరి ఇంటింటా పాచి పని చేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉండగా, కొడుకు మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. గంగరాజు భార్యపై అనుమానంతో ఆదివారం రాత్రి గొడవ పడ్డాడు. ఆ సమయంలో కొడుకు తన సోదరి ఇంటికి వెళ్లాడు. మల్లీశ్వరితో గొడవ పెరిగి తీవ్ర వాగ్వాదం జరగడంతో నాపరాయితో తలపై గట్టిగా మోదాడు. రాత్రి ఆలస్యంగా ఇంటికి వచ్చిన కుమారుడు తల్లి గాయాలతో పడి ఉండడం చూసి ఇరుగుపొరుగు వారి సాయంతో కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించాడు. అప్పటికే ఆమె మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ఇంద్రపాలెం ఎస్సై వీరబాబు కేసు నమోదు చేయగా సీఐ చైతన్య కృష్ణ ఘటనా స్థలాన్ని పరిశీలించారు.


