● సదరం సర్టిఫికెట్ల కోసం పడిగాపులు
● ఉదయం 9 నుంచి
ఒంటి గంట వరకూ నిరీక్షణ
● చివరకు అక్కడ ఈ సౌకర్యం లేదని చెప్పిన సిబ్బంది
గోపాలపురం: గ్రామ పంచాయతీ, సచివాలయాల ఉద్యోగుల నిర్వాకం వల్ల దివ్యాంగులు అవస్థలు పడ్డారు. సదరం సర్టిఫికెట్ల కోసం గోపాలపురం కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు ఉదయం 9 గంటలకు రావాలంటూ ఆయా గ్రామ పంచాయతీ, సచివాలయాల్లో దివ్యాంగులకు కాగితాలు అందజేశారు. గోపాలపురం నియోజకవర్గంలోని గోపాలపురం, దేవరపల్లి, నల్లజర్ల మండలాల నుంచి సోమవారం కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు 10మంది దివ్యాంగులు వచ్చారు. కానీ అక్కడ వారికి చుక్కెదురైంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకూ వేచి ఉన్నా సర్టిఫికెట్ ఇచ్చే వైద్యులు రాకపోవడంతో ఆకలితో అలమటించిపోయారు. అప్పటికి స్పందించిన సీహెచ్‌సీ సిబ్బంది ఈ ఆసుపత్రిలో సదరం సర్టిఫికెట్లు జారీ చేయడం లేదని, ఇక్కడకు డాక్టర్లు రారని చెప్పడంతో నిరాశతో దివ్యాంగులు వెనుతిరిగారు. దీనిపై ఆసుపత్రి సూపర్‌రింటెండెంట్ డాక్టర్ చైతన్యరాజును వివరణ కోరగా సదరం సర్టిఫికెట్ల స్లాట్ బుకింగ్ ఇక్కడ లేదని, విశాఖ జిల్లా గోపాలపట్నంలో సదరం సర్టిఫికెట్లు ఇచ్చే ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు, రాజమహేంద్రవరం, అనపర్తి ఆసుపత్రులకు మాత్రమే ప్రభుత్వ అనుమతులు ఉన్నాయన్నారు. గత నెలలో కూడా గ్రామ సచివాలయాలకు సూచించినప్పటికీ గోపాలపురం ఆసుపత్రికి పంపుతున్నారని తెలిపారు.


