ముగిసిన ‘వర్జీనియా’ అమ్మకాలు
దేవరపల్లి: అనేక ఒడుదొడుకులు, రైతుల ఆందోళనల నడుమ 2024–25 సంవత్సరం వర్జీనియా పొగాకు అమ్మకాలు లాభసాటిగా ముగిశాయి. రాజమహేంద్రవరం రీజియన్ పరిధిలోని ఐదు వేలం కేంద్రాల్లో పొగాకు వేలం ఈ ఏడాది మార్చి 24న ప్రారంభించారు. పొగాకు కొనుగోళ్లు శనివారంతో ముగిశాయని టుబాకో బోర్డు రీజినల్ మేనేజర్ జీఎల్‌కే ప్రసాద్ తెలిపారు. వేలం ప్రక్రియ పారంభించి సుమారు 255 రోజులు కాగా, 200 రోజుల పాటు కొనుగోళ్లు జరిగాయన్నారు. ఈ నెల 2న దేవరపల్లి, 8న గోపాలపురం, 21న కొయ్యలగూడెం, 28న జంగారెడ్డిగూడెం–1, 29న జంగారెడ్డిగూడెం–2 వేలం కేంద్రాల్లో పొగాకు కొనుగోళ్లు ముగిశాయని ఆయన వివరించారు.
83.88 మిలియన్ కిలోల విక్రయాలు
మొత్తం ఐదు వేలం కేంద్రాల్లో 2024–25 పంట కాలానికి 60 మిలియన్ కిలోల ఉత్పత్తికి బోర్డు అనుమతి ఇచ్చారు. అయితే, 83.62 మిలియన్ కిలోల మేర ఉత్పత్తి అవుతుందని అధికారులు అంచనా వేయగా, 83.88 మిలియన్ల కిలోల మేర ఉత్పత్తి జరిగింది. దీని విలువ సుమారు రూ.2,664 కోట్లు. మొత్తం 14,754 మంది రైతులు, 12,723 బ్యారన్లు కలిగి ఉండగా, 29,480 హెక్టార్లలో పంట సాగు చేశారు. కిలోకు గరిష్టంగా రూ.453, కనిష్టంగా రూ.250, సగటున రూ.297.50 చొప్పున రైతులకు ధర లభించింది. మొత్తం 6,79,450 బేళ్ల వేలం నిర్వహించారు.
45.13 మిలియన్ కిలోల బ్రైట్ గ్రేడ్
ఐదు వేలం కేంద్రాల పరిధిలో ఈ ఏడాది బ్రైట్ గ్రేడ్ పొగాకు 45.13, మీడియం గ్రేడ్ 31.19, లో గ్రేడ్ 7.56 మిలియన్ కిలోల చొప్పున ఉత్పత్తి జరిగింది. బ్రైట్ గ్రేడ్‌కు కిలో సగటు ధర రూ.347.93, మీడియం గ్రేడ్‌కు రూ.270.60, లో గ్రేడ్‌కు రూ.132 చొప్పున లభించింది. కిలో అత్యధిక సగటు ధర దేవరపల్లి వేలం కేంద్రంలో రూ.311 లభించింది. అత్యధిక ఉత్పత్తి జంగారెడ్డిగూడెం–2 వేలం కేంద్రంలో జరిగినట్టు అధికారులు తెలిపారు. జంగారెడ్డిగూడెం–1 కేంద్రంలో రూ.299, జంగారెడ్డిగూడెం–2 కేంద్రంలో రూ.300.66, కొయ్యలగూడెంలో రూ.296.60, గోపాలపురంలో రూ.296.57 చొప్పున కిలో సగటు ధర లభించింది.
ఫ 200 రోజుల పాటు వేలం
ఫ విక్రయించిన పొగాకు
విలువ రూ.2,664 కోట్లు
ఫ కిలో గరిష్ట ధర రూ.453
ఫ సగటు ధర రూ.297.50
దేవరపల్లి 13.18
జంగారెడ్డిగూడెం–1 18.56
జంగారెడ్డిగూడెం–2 19.18
కొయ్యలగూడెం 17.87
గోపాలపురం 15.06
వేలం కేంద్రాల వారీగా
పొగాకు ఉత్పత్తి (మిలియన్ కిలోలు)


