స్వధర్మం విడిచిపెట్టరాదు
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): స్వధర్మాన్ని విడచి పెట్టరాదని, ఎక్కడికి పోయినా ఆకాశం కిందనే ఎలా ఉంటారో, ఏది చేసినా స్వధర్మం నీడనే ఆచరించాలని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖశర్మ అన్నారు. ఋషిపీఠం ఛారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యాన హిందూ సమాజంలో జరుగుతున్న వేదవ్యాస భారత ప్రవచన యజ్ఞంలో ఆయన సోమవారం అయిదో రోజు ప్రవచనాన్ని కొనసాగించారు. వ్యామోహాలను విడిచి గృహస్థాశ్రమ విధులు నిర్వహించాలని, పుండును బలవంతంగా పెకలిస్తే, మరో పుండు తయారవుతుందని రామకృష్ణ పరమహంస అన్నారని చెప్పారు. ‘‘జరుత్కారుడు ఒక తపస్వి. ఆయనకు గృహస్థాశ్రమం మీద ఆసక్తి లేదు. ఆయన పితరులు ‘నీవు గృహస్థాశ్రమం స్వీకరిస్తేనే మాకు దుర్గతులు తొలగిపోయి, సద్గతులు కలుగుతాయ’ని చెబుతారు. జరుత్కారుడు కొన్ని నిబంధనలతో వివాహానికి అంగీకరిస్తాడు. నేను వివాహం చేసుకునే కన్య పేరు నా పేరే అయి ఉండాలి. నేను దరిద్రుడను, దుఃఖశీలుడను. నన్ను వివాహం చేసుకునే సీ్త్రని నేను పోషించను. నా నియమాలకు అంగీకరిస్తే, నేను కన్యాదానం స్వీకరిస్తానని ప్రకటిస్తాడు. ఆ నియమాలకు లోబడి, ఆయనకు వివాహంజరిగింది. జరుత్కారునికి జన్మించిన పుత్రుడే జనమేజయుని సర్పయాగాన్ని నిలుపుతాడు. దేవతలు గొప్పవారా, ఋషులు గొప్పవారా అంటే ఋషులే గొప్పవారు’’ అని సామవేదం వివరించారు. ప్రపంచ సాహిత్యంలో నాగవిజ్ఞాన సర్వస్వం భారతంలో కనపడినట్టు మరి ఏ ఇతర గ్రంథంలోనూ కనపడదన్నారు. సర్పయాగ వృత్తాంతం విన్నవారికి సర్పాల వలన భయం కలగదన్నారు. వేదంలో మంత్ర రూపంలో ఉన్న ఇతిహాసాలు, కథలూ వ్యాసుని భారతంలో శ్లోక రూపంలో మనకు అందుతున్నాయని చెప్పారు. ‘కద్రువ అన్న పేరుకు కుత్సిత స్వభావం కలదని అర్థం. ఆమె రజస్తమోగుణాలకు ప్రతీక. వినత వినమ్ర స్వభావం కలది. సత్వగుణానికి ప్రతీక’ అని అన్నారు. సృష్టిలోని ప్రతి ప్రాణినీ కాపాడుకోవాలని, ప్రకృతిలో ఏ శక్తినీ నిర్మూలించే హక్కు మనకు లేదని, అందరూ బతకాలని చెప్పారు. ఏ ప్రాణినీ నిర్మూలించకూడదని, నియంత్రించవచ్చునని సామవేదం అన్నారు. తొలుత భాగవత విరించి డాక్టర్ టీవీ నారాయణరావు శుభారంభం పలికారు.


