రాజమహేంద్రవరం రూరల్: ‘పులిరాజాకు ఎయిడ్స్ వస్తుందా..?’ ఈ మహమ్మారిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఒకప్పుడు చేసిన ప్రచారమిది. విస్తృత ప్రచారం, అవగాహన కార్యక్రమాల నేపథ్యంలో ఎయిడ్స్ కేసులు కాస్త తగ్గినట్లు కనిపించినా మళ్లీ పెరుగుతూండటం అధికారులను, ఈ వ్యాధి నియంత్రణకు కృషి చేస్తున్న వారిని కలవరపరుస్తోంది.
ఎయిడ్స్ అంటే..
ఎకై ్వర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్ (ఎయిడ్స్) వ్యాధి హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియెన్సీ వైరస్ (హెచ్‌ఐవీ) ద్వారా వ్యాప్తి చెందుతుంది. సురక్షితం కాని లైంగిక సంబంధాల వలన ఈ వైరస్ వ్యాప్తి ప్రధానంగా జరుగుతుంది. దీని బారిన పడిన వారిలో రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. జ్వరం, అలసట, గొంతు నొప్పి, కండరాల నొప్పులు, చర్మంపై దద్దుర్ల వంటి లక్షణాలు కనిపిస్తూంటాయి. అయితే, ఇటువంటి లక్షణాలున్న వారందరూ హెచ్‌ఐవీ బారిన పడినట్లు కాదు. వైద్యులను సంప్రదించి, అవసరమైన పరీక్షలు చేయించుకున్నాకే వ్యాధి నిర్ధారణ చేస్తారు.
వ్యాప్తి అందుకేనా..
ఇతర ప్రాంతాల నుంచి జిల్లాకు వస్తున్న కొంత మంది పట్టణాల్లోని పలు ప్రాంతాల్లో ఇళ్లు అద్దెకు తీసుకుని, గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి సైతం యువతులను ఇక్కడకు రప్పిస్తున్నారు. వీరిలో హెచ్‌ఐవీ బాధితులు కూడా ఉంటున్నారు. వీరి ద్వారానే ఎయిడ్స్ వ్యాప్తి జరుగుతోందని అధికారులు చెబుతున్నారు. అలాగే, జిల్లాలో కొత్తగా హెచ్‌ఐవీ పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వారు కూడా సమాజంపై కక్షతో.. ముఖ్యంగా యువతను లక్ష్యంగా చేసుకుని ఎయిడ్స్ వ్యాప్తికి కారకులవుతున్నారు. పోలీసులు వ్యభిచార గృహాలపై దాడులు చేస్తున్నా ఈ దందా ఆగడం లేదు. ఒక ప్రాంతంలో పోలీసులు పట్టుకుంటే వ్యభిచార ముఠాలు మరో ప్రాంతానికి మకాం మారుస్తున్నాయి. అలాగే, ఇటీవల డ్రగ్స్, గంజాయికి బానిసలవుతున్న యువత మత్తు ఇంజక్షన్లకు ఒకే సిరంజి వాడుతున్నారు. దీనివలన కూడా హెచ్‌ఐవీ వ్యాప్తి చెందే అవకాశాలున్నాయని వైద్యులు చెబుతున్నారు.
ఏటా వందల్లో కేసులు
జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏటా వందల్లో ఎయిడ్స్ బాధితులను గుర్తిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 2022–23 నుంచి 2025–26 (అక్టోబర్) వరకూ 1,57,623 మంది సీ్త్ర, పురుషులకు వైద్య పరీక్షలు చేయగా.. 1,342 మంది హెచ్‌ఐవీ బారిన పడినట్లు గుర్తించారు. అలాగే, 62,928 మంది గర్భిణులకు పరీక్షలు నిర్వహించగా 52 మందిని పాజిటివ్‌గా నిర్ధారించారు. గర్భిణుల భర్తలకు కూడా పరీక్షలు చేస్తే ఈ సంఖ్య మరింత పెరుగుతుంది. ఇక అనధికారికంగా ప్రైవేటు ఆసుపత్రుల్లో ఎయిడ్స్ నిర్ధారణ అయిన కేసులు ఇంకా ప్రభుత్వ లెక్కల్లోకి రాలేదు. అవన్నీ కలిపితే బాధితుల సంఖ్య వేలల్లో ఉంటుంది. ప్రస్తుతం రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రిలోని ఏఆర్‌టీ సెంటర్‌లో 10,762 హెచ్‌ఐవీ బాధితులు చికిత్స పొందుతున్నారు.
నివారణకు చర్యలు
జిల్లావ్యాప్తంగా హెచ్‌ఐవీని అదుపు చేసేందుకు పలు చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఎయిడ్స్ నియత్రణ సంస్థ, స్వచ్ఛంద సంస్థల ద్వారా ప్రతి నెలా లక్షల్లో కండోమ్‌లు అందించి, వారు హెచ్‌ఐవీ బారిన పడకుండా, వారి నుంచి మరొకరికి సుఖవ్యాధులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. క్రమం తప్పకుండా యాంటీ రిట్రోవైరల్ థెరపీ మందులు వాడితే హెచ్‌ఐవీ బాధితుల్లో వైరల్ లోడ్ తగ్గుతుంది. తద్వారా వారి నుంచి ఇంకొకరికి హెచ్‌ఐవీ వ్యాప్తి చెందే శాతం తగ్గుతుంది. ఈ క్రమంలోనే హెచ్‌ఐవీ నిర్ధారణ కాగానే బాధితులకు ఏఆర్‌టీ మందులు సిఫారసు చేస్తారు. వారిలో వైరల్ లోడ్ ఎక్కువగా ఉంటే తగ్గించేందుకు మందుల డోస్ పెంచుతారు. హెచ్‌ఐవీ బాధితులకు ఈ మందులు ప్రతి నెలా ఉచితంగా అందిస్తున్నారు. అయితే, తమ వివరాలు బయటకు తెలుస్తాయని, సమాజంలో పరువు పోతుందనే భయంతో చాలామంది ఏఆర్‌టీ సెంటర్‌కు వెళ్లేందుకు వెనుకాడుతున్నారు. మందులు వాడకుండా ప్రాణాల మీదకు తెచ్చుకోవడమే కాకుండా.. ఇతరులకు కూడా వైరస్ వ్యాప్తి చేస్తూ మరింత చేటు తెస్తున్నారు.
నేడు ర్యాలీ
ప్రపంచ ఎయిడ్స్ దినం సందర్భంగా సోమవారం ఉదయం 9 గంటలకు రాజమహేంద్రవరం వై.జంక్షన్ నుంచి అటానమస్ కళాశాల వరకూ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ‘హెచ్‌ఐవీ పరీక్ష చేయించుకోండి.. సమాచారం పొందండి.. సురక్షితంగా ఉండండి’ అనే థీమ్‌తో నిర్వహిస్తున్న ఈ ర్యాలీని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ప్రారంభిస్తారు. ఉదయం 10 గంటలకు కళాశాల సెమినార్ హాలులో అవగాహన సమావేశం నిర్వహిస్తారు.
ఫ చాప కింద నీరులా ఎయిడ్స్ విజృంభణ
ఫ అవగాహన లోపంతో పెరుగుతున్న బాధితులు
ఫ ప్రభుత్వ లెక్కల్లో లేని కేసులే అధికం
ఫ నేడు ప్రపంచ ఎయిడ్స్ దినం
వ్యాధి కట్టడికి చర్యలు
జిల్లాలో హెచ్‌ఐవీ అదుపులో ఉంది. దీని తీవ్రత గురించి తెలుసుకున్న చాలా మంది జాగ్రత్త పడుతున్నారు. హెచ్‌ఐవీ బాధితులకు నాణ్యమైన చికిత్స అందేలా చర్యలు చేపట్టాం. బాధితుల రక్షణకు ఎయిడ్స్ నియంత్రణ సంస్థ, వైద్య, ఆరోగ్య శాఖ చేస్తున్న కృషి ఫలిస్తోంది. కలెక్టర్, వైద్య, ఆరోగ్యంతో పాటు ఇతర శాఖలు, ప్రభుత్వేతర సంస్థల సహకారంతో ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నాం. ఎటువంటి పరిస్థితుల్లోనూ గర్భిణుల నుంచి పిల్లలకు ఈ వ్యాధి సోకకుండా కట్టడి చేస్తున్నాం.
– డాక్టర్ ఎన్.వసుంధర, జిల్లా ఎయిడ్స్, లెప్రసీ,
టీబీ నివారణాధికారి, రాజమహేంద్రవరం
పులిరాజా మళ్లీ వస్తున్నాడా?


