బ్యాంకుల ప్రైవేటీకరణను అడ్డుకోవాలి
రాజమహేంద్రవరం సిటీ: నూతన కార్మిక చట్టాల వల్ల కార్మికులకు తీవ్రమైన నష్టం పొంచి ఉందని యూనియన్ బ్యాంక్ ఉద్యోగుల సంఘం, ఆంధ్ర, తెలంగాణ బ్యాంక్ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి బీఎస్ రాంబాబు అన్నారు. నగరంలో ఆదివారం జరిగిన యూనియన్ బ్యాంక్ అవార్డు ఉద్యోగుల సంఘం ప్రాంతీయ మహాసభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, బ్యాంకుల ప్రైవేటీకరణను అన్ని విధాలా అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. కాలంతో పాటు బ్యాంకింగ్ రంగంలో వస్తున్న మార్పులను గుర్తించి, సమస్యలపై పోరాటం సాగించాలని సూచించారు. యూనియన్ బ్యాంకు ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.ఉదయ కుమార్ మాట్లాడుతూ, రోజువారీ బ్యాంకింగ్ వ్యవహారాల్లో ఉద్యోగులు జాగ్రత్తగా వ్యవహరించాలని అన్నారు. ఈ సందర్భంగా నూతన ప్రాంతీయ నాయకత్వాన్ని ఎన్నుకున్నారు. ప్రాంతీయ కార్యదర్శిగా యాళ్ల మురళీధర్, ఉప కార్యదర్శులుగా కిషోర్, స్వాతి, కోశాధికారిగా వెంకటేశ్వరరావు బాధ్యతలు స్వీకరించారు. సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కాలే శ్రీనివాసరావు, ఉప ప్రధాన కార్యదర్శి లక్ష్మీపతిరావు, కార్యదర్శి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
కోటసత్తెమ్మ సన్నిధిలో
భక్తుల సందడి
నిడదవోలు రూరల్: తిమ్మరాజుపాలెంలో వేంచేసియున్న కోటసత్తెమ్మ అమ్మవారి ఆలయానికి ఆదివారం అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి, ప్రత్యేక పూజలు చేశారు. ప్రధానార్చకుడు అప్పారావుశర్మ పర్యవేక్షణలో అమ్మవారికి ప్రత్యేక పుష్పాలంకరణ చేశారు. చిన్నాయిగూడేనికి చెందిన శ్రీ రాధేశ్యామ్ కల్యాణ భజన మండలి ఆధ్వర్యాన శ్రీరాముల కల్యాణంపై భజన నిర్వహించారు. అమ్మవారి దర్శనాలు, ప్రసాదం, పూజా టికెట్లు, ఫొటోల అమ్మకం ద్వారా దేవస్థానానికి రూ.1,13,255 ఆదాయం వచ్చిందని ఆలయ ఈఓ, అసిస్టెంట్ కమిషనర్ వి.హరిసూర్యప్రకాష్ తెలిపారు.
శాసీ్త్రయ అంశాలపై
5 నుంచి సదస్సు
రాజానగరం: శాసీ్త్రయ అంశాలపై డిసెంబర్ 5, 6 తేదీల్లో అంతర్జాతీయ సద స్సు నిర్వహిస్తున్నట్లు ఆది కవి నన్నయ యూనివర్సి టీ వైస్ చాన్సలర్ ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ‘భౌతిక, రసాయన, జీవ శాస్త్రాల్లో నూతన ఆవిష్కరణలు, వ్యవసాయ – ఆహార సాంకేతికత, ఔషధ ఆవిష్కరణ, పర్యావరణ స్థిరత్వం – ఉపయోగాలు’ అనే అంశంపై ఈ సదస్సు నిర్వహిస్తామని వివరించారు. అయోంకీ పబ్లిష్కో (హైదరాబాద్) సహకారంతో జరిగే ఈ సదస్సుకు సంబంధించిన పరిశోధన పత్రాలను మంగళవారంలోగా సమర్పించాలని కోరారు.
వైద్యుడి సస్పెన్షన్
ఫ విధుల నుంచి స్టాఫ్ నర్స్ తొలగింపు
తుని: స్థానిక ఏరియా ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేసిన అనంతరం ఓ యువకుడి కాలు లోపలే సర్జికల్ బ్లేడ్ ఉంచి కుట్లు వేసిన ఘటనపై ప్రభుత్వం స్పందించింది. ఈ సంఘటనపై ‘బోల్టు తొలగించమంటే.. బ్లేడు వదిలేసి కుట్టేశారు’ శీర్షికన ‘సాక్షి’ శనివారం ప్రచురించిన వార్తకు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పందించారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి, నివేదిక సమర్పించాలని జిల్లా వైద్యాధికారి చక్రధర్‌బాబును ఆదేశించారు. ఆ మేరకు చక్రధర్‌బాబు ఆసుపత్రిలో ఆదివారం విచారణ చేపట్టారు. ఆపరేషన్ సమయంలో ఆర్థోపెడిక్ వైద్యుడు సత్యసాగర్, స్టాఫ్ నర్స్ పద్మావతి నిర్లక్ష్యంగా వ్యవహరించారని నిర్ధారించారు. ఈ మేరకు ఇచ్చిన నివేదిక ఆధారంగా వారిద్దరినీ ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.
లోవకు పోటెత్తిన భక్తులు
తుని: లోవ దేవస్థానానికి ఆదివారం వివిధ ప్రాంతాల నుంచి 15 వేల మంది భక్తులు తరలివచ్చి తలుపులమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ కార్యనిర్వహణాధికారి విశ్వనాథరాజు ఈ వివరాలు తెలిపారు. ప్రసాదాల విక్రయం ద్వారా రూ.1,86,405, పూజా టికెట్ల ద్వారా రూ.2,06,550, కేశఖండన టికెట్లకు రూ.11,080, వాహన పూజల ద్వారా రూ.8,900, కాటేజీల ద్వారా రూ.65,150, ఇతరాలు రూ.52,525 కలిపి మొత్తం రూ.5,30,610 ఆదాయం సమకూరిందని వివరించారు.
బ్యాంకుల ప్రైవేటీకరణను అడ్డుకోవాలి
బ్యాంకుల ప్రైవేటీకరణను అడ్డుకోవాలి


