వరాలు, శాపాలు దేవతల ప్రణాళికలే.. | - | Sakshi
Sakshi News home page

వరాలు, శాపాలు దేవతల ప్రణాళికలే..

Dec 1 2025 9:40 AM | Updated on Dec 1 2025 9:40 AM

వరాలు, శాపాలు దేవతల ప్రణాళికలే..

వరాలు, శాపాలు దేవతల ప్రణాళికలే..

ఆల్కాట్‌ గార్డెన్స్‌ (రాజమహేంద్రవరం రూరల్‌): వరాలు, శాపాలు దేవతల ప్రణాళికలేనని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖ శర్మ అన్నారు. ఋషిపీఠం చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యాన స్థానిక హిందూ సమాజంలో నిర్వహిస్తున్న వ్యాస భారత ప్రవచనాల్లో భాగంగా నాలుగో రోజైన ఆదివారం ఆయన గరుత్మంతుని ఆవిర్భావం, మహిమలను వివరించారు. ‘ఉచ్చైశ్రవం అనే అశ్వం తోకకు చుట్టుకుని, నల్లగా కనపడేటట్లు చేయాలని కద్రువ తన సంతానమైన సర్పాలను ఆదేశించింది. అలా చేయడానికి తిరస్కరించిన కొన్ని సర్పాలను జనమేజయుడి సర్ప యా గంలో ఆహుతి కమ్మని శపించింది. అయితే, ఈ సర్పాలు అత్యంత తీవ్రమైన విషాన్ని, మానవ జాతిని నాశనం చేసే శక్తి కలిగినవి. వినత తొందరపాటుతనంతో ఒక అండాన్ని పగులగొట్టినందుకు, పూర్తి అంగాలు ఏర్పడని ఒక కుమారుడు కలిగాడు. అతనే సూర్యుని రథసారథిగా వెళ్లిపోయాడు. మరో అండం నుంచి గరుత్మంతుడు వెలువడ్డాడు. అతడు వేద స్వరూపుడు. వేదంలోని ఛందస్సులు ఆయన రెక్కలు. వేదంలో సౌపర్ణ సూక్తాలు కనపడతాయి. వీటిని చదవలేని వారి కోసం వేదవ్యాసుడు 12 శ్లోకాలతో దేవతలు చేసిన గరుడ స్తుతిని మనకు అందించారు. గరుత్మంతుని స్తోత్రంలో విష్ణుపరమైన నామాలు, విష్ణు సహస్రంలో ‘సుపర్ణ’ ఇత్యాది గరుత్మంతుని నామాలు కనబడతాయి’ అని సామవేదం వివరించారు. ‘తల్లి దాస్య విముక్తికి సుర లోకం నుంచి అమృతాన్ని తీసుకువచ్చిన గరుత్మంతుడు దర్భలపై ఆ కలశాన్ని ఉంచాడు. స్నానం చేసి రావడానికి సర్పాలు వెళ్లాక, ఇంద్రుడు వచ్చి అమృత కలశాన్ని తీసుకువెళ్లిపోయాడు. వచ్చిన సర్పాలు దర్భలను నాకడం వలన వాటి నాలికలు రెండుగా చీలిపోయాయి. దర్భలు పవిత్రమైనవిగా భావించడానికి కారణం– వాటిపై గరుత్మంతుడు అమృత కలశాన్ని ఉంచడమే. విషసర్పాలకు అమృతం ఇవ్వడం ప్రమాదకరమని భావించి, ఇంద్రుడు ఈ కార్యానికి పూనుకున్నాడు. గరుత్మంతుడు, ఆయన తల్లి దాస్యవిముక్తులయ్యారు’ అని వివరించారు. కష్టాన్ని సహించడమే తపస్సని చెప్పా రు. విద్య అంటే సమాచార సేకరణ కాదని, ఒక దివ్యమైన శక్తి అని, మనది విద్యల దేశమని, ఇక్కడున్నన్ని విద్యలు మరెక్కడా లేవని అన్నారు. నిలబడి ఆచమనం చేయరాదని, ఆచమనం చేసేటప్పుడు చప్పుడు చేయరాదని, ఆచమన జలం మీసాలకు తగలరాదని, వేడిగా ఉండరాదని చెప్పారు. చరిత్ర పుస్తకాలు చదివే మనం మహర్షులు రాసిన సత్యాలను నమ్మకపోతే ఎలాగని సామవేదం ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement