నేటి నుంచి ఫీజుల చెల్లింపులు
● ఓపెన్ స్కూల్ పరీక్షలకు షెడ్యూల్ విడుదల
● అపరాధ రుసుం లేకుండా 10 తుది గడువు
రాయవరం: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యా పీఠం (ఓపెన్ స్కూల్) ద్వారా పదో తరగతి, ఇంటర్ పబ్లిక్ పరీక్షలు రాసే అభ్యర్థులు సోమవారం నుంచి పరీక్ష ఫీజు చెల్లించేందుకు షెడ్యూల్ విడుదలైంది. దీనిని ఏపీ సార్వత్రిక విద్యాపీఠం డైరెక్టర్ ఆర్.నరసింహారావు గత నెల 24న విడుదల చేశారు. సోమవారం నుంచి పరీక్ష ఫీజు చెల్లింపు ప్రారంభమవుతుండగా, అపరాధ రుసుం లేకుండా డిసెంబర్ 10వ తేదీ లోపు చెల్లించవచ్చు. అపరాధ రుసుం లేకుండా పదో తరగతికి ఓ సబ్జెక్ట్‌కు రిజిస్ట్రేషన్ ఫీజుగా రూ.5, పరీక్ష ఫీజుగా రూ.95 వెరసి మొత్తం రూ.100లు, ఇంటర్‌కు ఓ సబ్జెక్ట్‌కు రిజిస్ట్రేషన్ ఫీజుగా రూ.5లు, పరీక్ష ఫీజుగా రూ.145లు వెరసి రూ.150 చెల్లించాల్సి ఉంది. ప్రాక్టికల్ ఒక్కో సబ్జెక్ట్‌కు రూ.100లు చెల్లించాలి. ఉత్తీర్ణత సాధించని ఇంటర్ విద్యార్థులు పాసైన సబ్జెక్టుల్లో ఇంప్రూవ్‌మెంట్‌కు థియరీ ఒక్కో సబ్జెక్టుకు రూ.250, ఫెయిలైన సబ్జెక్టుకు రూ.150 చొప్పున ఫీజు చెల్లించాలి. ప్రాక్టికల్ ఒక సబ్జెక్టుకు రూ.100 కట్టాలి. రూ.25 అపరాధ రుసుంతో ఈ నెల 11 నుంచి 12వ తేదీ వరకు, రూ.50 అపరాధ రుసుంతో ఈ నెల 13 నుంచి 15వ తేదీ వరకు చెల్లించాల్సి ఉంటుంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఓపెన్ స్కూల్‌లో ప్రవేశానికి 875 మంది, ఇంటర్‌లో చేరేందుకు 3,447 మంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో పదో తరగతిలో ప్రవేశానికి 1,708, ఇంటర్‌లో 3,415 మంది, కాకినాడ జిల్లాలో పదో తరగతి ప్రవేశానికి 1,642, ఇంటర్‌లో ప్రవేశానికి 5,213 మంది అడ్మిషన్ ఫీజు చెల్లించారు. వీరంతా పరీక్ష ఫీజును చెల్లించాల్సి ఉంది.
అదనపు ఫీజులు చెల్లించవద్దు
ఏపీ సార్వత్రిక విద్యాపీఠం ద్వారా పదో తరగతి, ఇంటర్ పరీక్ష ఫీజులు చెల్లించే విద్యార్థులు నిర్ణీత రుసుం మించి ఎవరూ అదనంగా పరీక్ష ఫీజును చెల్లించనవసరం లేదు. ఎవరైనా అధికంగా ఫీజులు వసూలు చేస్తే జిల్లా విద్యాశాఖ కార్యాలయం దృష్టికి తీసుకు రావాలి.
–షేక్ సలీం బాషా, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్
కోనసీమ జిల్లా విద్యాశాఖాధికారి
ఇబ్బందులుంటే ఫోన్ చేయండి..
ఓపెన్ స్కూల్ ద్వారా ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేయించుకున్న విద్యార్థులు పరీక్ష ఫీజును నిర్ణీత గడువులోగా చెల్లించాలి. ఆన్‌లైన్ ద్వారా గాని లేదా హైస్కూల్స్/కళాశాలల్లో ఉండే ఓపెన్ స్కూల్ కేంద్రాల కోఆర్డినేటర్ల వద్ద గాని పరీక్ష ఫీజును చెల్లించాలి. పరీక్ష ఫీజుల్లో ఎటువంటి సందేహాలు, ఇబ్బందులు తలెత్తినా 89776 45704 నంబర్‌కు ఫోన్ చేయవచ్చు.
– పి.సాయివెంకటరమణ, ఓపెన్ స్కూల్ జిల్లా కోఆర్డినేటర్, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా
నేటి నుంచి ఫీజుల చెల్లింపులు
నేటి నుంచి ఫీజుల చెల్లింపులు


