అప్పటి ధాన్యం రవాణాకు ఇప్పుడు చెల్లింపులా! | - | Sakshi
Sakshi News home page

అప్పటి ధాన్యం రవాణాకు ఇప్పుడు చెల్లింపులా!

Dec 1 2025 9:40 AM | Updated on Dec 1 2025 9:40 AM

అప్పటి ధాన్యం రవాణాకు ఇప్పుడు చెల్లింపులా!

అప్పటి ధాన్యం రవాణాకు ఇప్పుడు చెల్లింపులా!

బాక్ట్‌లిస్టులో పెట్టిన కాంట్రాక్టర్‌కు రూ. 3 కోట్లా!

వైఎస్సార్‌ సీపీ రైతు విభాగ అధ్యక్షుడు జున్నూరి రామారావు

అల్లవరం: పిఠాపురం మండలంలో 2017లో ఫేక్‌ నంబర్లతో ధాన్యం కొనుగోలు చేసి, రైస్‌ మిల్లులకు రవాణా చేసినట్లు బుక్‌లో నమోదు చేసిన స్కామ్‌లో కాంట్రాక్టర్‌ను అప్పటి చంద్రబాబు ప్రభుత్వం బ్లాక్‌ లిస్ట్‌లో పెట్టిందని వైఎస్సార్‌ సీపీ రైతు విభాగ అధ్యక్షుడు జున్నూరి రామారావు (బాబీ) ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇప్పుడు అదే ప్రభుత్వం ఆ కాంట్రాక్టర్‌కు రూ. 3 కోట్ల నిధులు ఎలా చెల్లిందని ప్రశ్నించారు. లారీలు, ట్రాక్టర్ల ద్వారా ధాన్యం రవాణా చేయాల్సిన కాంట్రాక్టర్‌ ఆటోలు, మోటారు సైకిల్‌ నంబర్లు బుక్‌లో ఎంటర్‌ చేసి అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. పిఠాపురం మండలంలో ఈ విషయం వెలుగులోకి వచ్చిందన్నారు. అప్పటి నుంచి చెల్లింపులు చేయకుండా నిలిపివేసిన రూ. 3 కోట్లను సివిల్‌ సప్లయిస్‌ మంత్రి సహకారంతో ఇప్పుడు విడుదల చేశారన్నారు. దీనికి పిఠాపురం మంత్రి, సివిల్‌ సప్లయిస్‌ మంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఇదే కాకుండా చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందన్నారు. సెంట్రల్‌ డెల్టా పరిధిలోని డ్రైనేజీ నిర్వహణ పనులకు రూ. 2 కోట్ల నిధులను ఒక వ్యక్తికి అప్పగించడం ద్వారా నిధులు దుర్వినియోగం అవుతున్నాయన్నారు. డ్రైనేజీ నిర్వహణ పనులు చేయకుండా బిల్లులు కాజేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం ప్రణాళిక రచించిందన్నారు. రైతు భరోసా కేంద్రాలు అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు పొందుతుంటే.. చంద్రబాబు ప్రభుత్వం వీటిని ఎలా నిర్వీర్యం చేయాలని ఆలోచన చేస్తుందన్నారు. ఈ ప్రభుత్వంలోని రైతు సేవా కేంద్రాల్లో ఎరువులు, విత్తనాలు లభ్యం కావడం లేదని తెలిపారు. ఖరీఫ్‌లో ఎరువుల కోసం రైతు సేవా కేంద్రాల వద్ద గంటలకొద్ది క్యూలో రైతులు నిలబడి నరకం చూశారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతుల పరిస్థితి అమ్మబోతే అడివి, కొనబోతే కొరివి అన్నమాదిరిగా ఉందని రామారావు అన్నారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక అయోమయ స్థితిలో ఉన్నారన్నారు.

రైతులు పండించిన పంటను దాళారులచే కొనుగోలు చేసి ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేసినట్లు రికార్డుల్లో నమోదు చేస్తున్నారన్నారు. రంగు మారిన ధాన్యం, తడిసిన ధాన్యానికి దిక్కు లేదన్నారు. మోంఽథా తుపానుకు రైతులు నష్టపోయినా ప్రభుత్వం పట్టించుకోలేదని దుయ్యబట్టారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో రూ. 3 వేల కోట్ల నిధులతో ధరల స్థిరీకరణ ఏర్పాటు చేసి పంటలకు గిట్టుబాటు ధర కల్పించారని, రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎరువులు, విత్తనాలు, పురుగు మందుల కొరతనేది లేకుండా చేశారని రామారావు తెలిపారు. రైతులకు వైఎస్సార్‌ సీపీ రైతు విభాగం భరోసాగా ఉంటుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement