దొంగతనం కేసులను ఛేదించిన పోలీసులు
● రూ. 59.60 లక్షల విలువైన
ఆభరణాల స్వాధీనం
● ఆరు కేసుల్లో 12 మంది అరెస్టు
ప్రత్తిపాడు: కాకినాడ జిల్లా పెద్దాపురం డివిజన్ పరిధిలో జరిగిన పలు చోరీ కేసుల్లో 12 మందిని అరెస్టు చేసి, సుమారు రూ.59.60 లక్షల చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నట్టు పెద్దాపురం డీఎస్పీ డి.శ్రీహరిరాజు శనివారం ప్రకటనలో తెలిపారు. బంగారం విలువ రూ.40 లక్షలు, వెండి విలువ రూ.19,60 లక్షలు ఉంటుందని పేర్కొన్నారు. గత సెప్టెంబర్ 24వ తేదీన ప్రత్తిపాడు మెయిన్‌రోడ్డులోని శ్రీసురేష్ జ్యూయలరీ షాపు షట్టర్ పగులగొట్టి గుర్తు తెలియని చోరులు సుమారు 11 కేజీల వెండి ఆభరణాలను దోచుకుపోయారు. దుకాణ యజమాని గొంతిన సురేష్ ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు నెల్లూరుకు చెందిన షేక్ ఫక్రుద్దీన్ బిషనై, అతని స్నేహితులైన మధ్యప్రదేశ్ రాష్ట్రం దాకాకు చెందిన దొంగల ముఠా సభ్యులు మొత్తం పది మంది కలిసి నగల దుకాణంలో చోరీకి పాల్పడ్డారు. ఇదే గ్యాంగ్ నల్లజర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా దొంగతనం చేసినట్లు గుర్తించారు. నల్లజర్ల పోలీసుల సమన్వయంతో ఈ కేసులో ప్రధాన నిందితుడైన షేక్ ఫక్రుద్ధీన్ బిషనై, మద్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కేషు మెహదా, బారిక్ సింగ్, రఘాన్ హాటియా, హీరు, మెహరు కల్లు మెహదాలను అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. ఫక్రుద్దీన్ బిషనై ఇచ్చిన వాగ్మూలం మేరకు ప్రత్తిపాడు నగల దుకాణంలో దొంగిలించిన వస్తువులన్నీ తాడేపల్లిగూడెం మండలం తాడేపల్లికి చెందిన కర్రీ సాయి చంద్రారెడ్డి అనే వ్యక్తికి కమీషన్ పద్ధతిలో అమ్మకానికి ఇచ్చాడు. అయితే దొంగతనం కేసులో తణుకు సబ్ జైలులో ఉన్న కర్రీ సాయి చంద్రారెడ్డిని పీటీ వారెంట్‌పై ప్రత్తిపాడు కోర్టులో హాజరుపరచి, రెండు రోజుల పోలీస్ కస్టడీకి తీసుకున్నారు. విచారణ అనంతరం చంద్రారెడ్డి ఇంటి నుంచి సుమారు 11 కేజీల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మధ్యప్రదేశ్‌కు చెందిన ఇద్దరిని, నెల్లూరుకు చెందిన ఇద్దరిని అరెస్టు చేయాల్సి ఉంది. గత నెల 4వ తేదీన అన్నవరం గాయత్రి కాలనీ మెట్టకు చెందిన గుత్తిన పవన్ హరిప్రసాద్ ఇంటికి వెనుక తలుపు పగులగొట్టి 16 తులాల బంగారు ఆభరణాలు, 1.4 కేజీల వెండి వస్తువులను దోచుకుపోయారు. ఈ కేసులో విశాఖ జిల్లా భీమిలి మండలం చేపలుప్పాడకు చెందిన చినమాన ఎల్లాజీ అనే రాజును అరెస్టు చేసి, చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఎల్లాజీపై 20 బైక్ దొంగతనాలు ఉన్నాయి. జగ్గంపేట పోలీసు స్టేషన్‌లో అన్నవరం నుంచి ప్రయాణం చేస్తున్న వి దేవి బ్యాగ్‌లో హారం, రెండు నెక్లస్‌లు వెరసి 95 గ్రాములు, జగ్గంపేట ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఆర్ కుమారి వద్ద 11 గ్రాముల విలువ గల బంగారు వస్తువులు చోరీకి గురయ్యాయి. తుని గొల్ల అప్పారావు సెంటర్ వద్ద 15 గ్రాముల బంగారు వస్తువుల చోరీ, ఎన్‌టీఆర్ జిల్లా గవర్నర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో లెనిన్ సెంటర్ బస్ స్టాప్ 55 బంగారు నగలను మాయం చేసిన అంతర్ జిల్లా మహిళా దొంగల గ్యాంగ్‌ను అరెస్టు చేశారు. ఈ కేసుల్లో 176 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుల్లో గేరక వరలక్ష్మి (తాడేపల్లిగూడెం), మరసాని సత్యవేణిని అరెస్ట్ చేశారు. కాగా స్వాధీనం చేసుకున్న సొత్తును ఎస్పీ బింధుమాధవ్ కాకినాడలో పరిశీలించి, ఆయా స్టేషన్ల పోలీసు సిబ్బందిని అభినందించినట్టు డీఎస్పీ శ్రీహరిరాజు తెలిపారు.
స్టెప్నీ టైర్ పేలి
ప్రయాణికుడికి గాయాలు
కాకినాడ క్రైం: సామర్లకోట – కాకినాడ మార్గం మధ్యలో వీకే రాయపురం సమీపంలో ఓ ఆర్‌టీసీ బస్‌లో ప్రమాదం చోటు చేసుకుంది. శుక్రవారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో ఏలేశ్వరం నుంచి కాకినాడకు వస్తున్న ఏలేశ్వరం డిపోకు చెందిన పల్లెవెలుగు ఆర్‌టీసీ బస్సులో స్టెప్నీ టైర్ భారీ శబ్దంతో ఒక్కసారిగా పేలిపోయింది. ఈ ఘటనలో సామర్లకోట సమీపంలోని విప్పనపాడు గ్రామానికి చెందిన 22 ఏళ్ల యువకుడి ఎడమ కాలికి తీవ్ర గాయమైంది. తోటి ప్రయాణికులు బాధిత యువకుడిని కాకినాడ జీజీహెచ్‌లో చేర్చారు. అక్కడి వైద్యులు పట్టించుకోలేదని విమర్శిస్తూ క్షతగాత్రుడు తన స్నేహితుడి ద్విచక్ర వాహనంపై జీజీహెచ్ నుంచి ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లాడు.


