మైనింగ్‌ లారీల అడ్డగింపు | - | Sakshi
Sakshi News home page

మైనింగ్‌ లారీల అడ్డగింపు

Nov 30 2025 7:18 AM | Updated on Nov 30 2025 7:18 AM

మైనింగ్‌ లారీల అడ్డగింపు

మైనింగ్‌ లారీల అడ్డగింపు

ఉదయం నుంచి రోడ్డుపై నిలిపివేసిన ఎస్‌.పైడిపాల గ్రామస్తులు

రోడ్ల ధ్వంసం, శబ్ద, వాయు కాలుష్యంతో ఇబ్బంది పడుతున్నామని ఆవేదన

రౌతులపూడి: కొన్ని నెలలుగా ఎడతెరిపి లేకుండా గ్రామం మీదుగా రవాణా సాగిస్తున్న లేటరైట్‌, నల్లరాయి వంటి మైనింగ్‌ లారీలను శనివారం మండలంలోని ఎస్‌.ౖపైడిపాల గ్రామస్తులు అడ్డుకున్నారు. రాత్రి, పగలు తేడా లేకుండా వందలాది భారీ లారీలు గ్రామం మధ్య నుంచి వెళ్లడం వల్ల దుమ్ము, ధూళి వ్యాపించి అనారోగ్యాలకు గురవుతున్నామని శబ్ద, వాయు కాలుష్యంతో ఇబ్బంది పడుతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాన రహదారిని పూర్తిగా ధ్వంసం చేశారని, మోటారు వాహనాలు అదుపు తప్పి తరచూ ప్రమాదాలకు గురువుతున్నామని చెప్పారు. ఉదయం ఆరుగంటల నుంచి గ్రామస్తులు అడ్డుకోవటంతో లారీలను రోడ్డుపై నిలిపివేశారు. దీంతో ఎస్సై వెంకటేశ్వరరావు తమ సిబ్బందిని పంపించి గ్రామస్తులతో చర్చలు జరిపారు. గ్రామం మధ్యలోనుంచి కాకుండా వేరే మార్గం గుండా రవాణా సాగించుకోవాలని ప్రజలు డిమాండ్‌ చేశారు. దీంతో ఎస్సై గ్రామ పెద్దలకు ఫోన్‌ చేసి ప్రస్తుతం లోడుతో వున్న లారీలను వదిలేయండి, ఆ తరువాత వస్తే ఆపుకోండి అని చెప్పగా లారీలను వదిలిపెట్టారు. మరో గంట తరువాత లోడు కోసం ఖాళీ లారీలు వెళ్లటానికి ప్రయత్నించగా గ్రామస్తులు అడ్డుకున్నారు. ఎస్సై వెంకటేశ్వరరావు ఎస్‌.పైడిపాల వచ్చి చట్టానికి వ్యతిరేకంగా ఎవరూ లారీలను అడ్డుకోరాదని, ఎవరైనా అడ్డుకుంటే చట్టపరమైన చర్యలుంటాయని చెప్పడంతో ఆయనతో గ్రామస్తులు వాగ్వాదానికి దిగారు. ప్రజలకు భద్రత కల్పించాల్సిన పోలీసులు ఇలా మైనింగ్‌ మాఫియాకు వత్తాసు పలకడం ఏమిటని అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామం మధ్యలోనుంచి రవాణా సాగించడానికి వీల్లేదని పట్టుబట్టారు. దీంతో చేసేది లేక లారీలను వెనక్కి తీసుకెళ్లారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement