పంట తరలింపునకు యత్నించిన వారిపై కేసు
తాళ్లరేవు: వరి పంటను అక్రమంగా తరలించేందుకు యత్నించిన ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు కోరంగి ఎస్‌ఐ పి.సత్యనారాయణ తెలిపారు. మండల పరిధిలోని పటవల గ్రామానికి చెందిన యన్నపు సత్తిరాజు 2010లో కాకినాడ ఏటిమొగ గ్రామానికి చెందిన దండుప్రోలు వెంకటలక్ష్మి, దండుప్రోలు సత్యవతి, దండుప్రోలు లక్ష్మణస్వామి వద్ద ఎకరా 95 సెంట్ల వ్యవసాయ భూమిని కొనుగోలు చేసి, సాగు చేసుకుంటున్నారు. అయితే దండ్రుప్రోలు లక్ష్మణస్వామికి చెందిన 65 సెంట్ల భూమిని సత్తిరాజు రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు. కానీ అగ్రిమెంట్ ప్రకారం ఆ భూమికి సత్తిరాజు పన్నులు చెల్లిస్తున్నారు. ఆయన స్వాధీనంలోనే ఆ భూమి కొనసాగుతోంది. శనివారం లక్ష్మణస్వామి కుమారుడు అగ్గిరాముడు, అతని కుటుంబ సభ్యులు ఆ పొలంలోకి ప్రవేశించి సత్తిరాజుపై దాడి చేయడంతోపాటు కోసి ఉన్న వరి పంటను తరలించేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో సత్తిరాజు కోరంగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోరంగి పోలీసులు ఘటనా స్థలానికి రాగా అగ్గిరాముడు పురుగు మందు డబ్బాను చేతితో పట్టుకుని ఆత్మహత్య చేసుకుంటానని పోలీసులను బెదిరించాడు. పోలీసులు అడ్డుకోవడంతో వారంతా అక్కడి నుంచి వెళి్ల్పోయారు. ఈ భూమికి సంబంధించి కాకినాడ రెండవ అదనపు సివిల్ జడ్జి కోర్టులో కేసు పెండింగ్‌లో ఉందని ఎస్‌ఐ తెలిపారు. సత్తిరాజు ఫిర్యాదు మేరకు ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సత్యనారాయణ తెలిపారు.
కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): భూ వివాదంలో న్యాయం కోసం వెళ్లిన తమపై కోరంగి పోలీసులు దాడి చేశారని ఆరోపిస్తూ దండుప్రోలు అగ్గిరాముడు, అతని కుటుంబ సభ్యులు శనివారం కలెక్టరేట్ వద్ద ఆత్మహత్యకు యత్నించడం ఉద్రిక్తతకు దారి తీసింది. కలెక్టరేట్ వద్ద ప్రధాన రహదారిపై వెళుతున్న లారీల కిందకు పడేందుకు ప్రయత్నించగా అక్కడ విధులు నిర్వహిస్తున్న కలెక్టరేట్ ఔట్‌పోస్ట్ హెడ్ కానిస్టేబుల్ రమణ స్థానికుల సాయంతో అడ్డుకున్నారు.
పంట తరలింపునకు యత్నించిన వారిపై కేసు


