అందరికీ చంద్ర గోల్డ్‌ టీ | - | Sakshi
Sakshi News home page

అందరికీ చంద్ర గోల్డ్‌ టీ

Nov 29 2025 7:35 AM | Updated on Nov 29 2025 7:35 AM

అందరి

అందరికీ చంద్ర గోల్డ్‌ టీ

జనసేన కీలక నేతకు నజరానా

రిటర్న్‌ గిఫ్ట్‌గా టీ టైమ్‌ మినీ మార్ట్‌లు

జనం కోరుతున్న కందిపప్పునకు

మంగళం

డిసెంబర్‌ కోటాలో టీ పొడి అమ్మకాలు

ఎవరూ అడగకపోయినా

ప్రభుత్వం వింతపోకడ

కాకినాడ, తూర్పు గోదావరి జిల్లాల్లో పైలట్‌ ప్రాజెక్టు

సాక్షి ప్రతినిధి, కాకినాడ: తల్లికి అన్నం పెట్టనోడు చిన్నమ్మకు చీర కొనిపెట్టాడనే సామెత చందాన చంద్రబాబు ప్రభుత్వం పాలన సాగుతోందనే విమర్శలు వస్తున్నాయి. బాబు గద్దెనెక్కి ఏడాదిన్నర అవుతోంది. చౌకధరల దుకాణాల ద్వారా కందిపప్పు పంపిణీ చేయాలని జనం నెత్తీనోరూ బాదుకుంటున్నా స్పందన లేదు. ప్రతి పేద కుటుంబానికీ అత్యవసరమైన కందిపప్పు సరఫరాకు మంగళం పాడేసిన సర్కార్‌.. ఏ ఒక్కరూ అడగని టీ పొడిని రేషన్‌ షాపుల ద్వారా ప్రజలకు సరఫరా చేసేందుకు సిద్ధమవుతూండటం విస్మయం కలిగిస్తోంది. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి కాకినాడ, తూర్పు గోదావరి జిల్లాల్లోని రేషన్‌ దుకాణాల ద్వారా టీ పొడి అమ్మకాలను పైలట్‌ ప్రాజెక్టుగా చేపడుతున్నారు.

సర్క్యులర్‌ విడుదల

ప్రజలపై ప్రేమతో రేషన్‌ షాపుల్లో టీ పొడి విక్రయాలు చేపడుతున్నారని అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఈ టీ పొడి సరఫరాకు టీ టైమ్‌ను వ్యాపార భాగస్వామిగా ఎంపిక చేసుకున్నారు. వాస్తవానికి రేషన్‌ షాపుల్లో ఏదైనా ఒక ఉత్పత్తి విక్రయం చేపట్టాలని అనుకుంటే ముందుగా సంబంధిత కంపెనీల నుంచి టెండర్లు ఆహ్వానించాలి. వాటిని మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర స్థాయి కమిటీ పారదర్శకంగా ఖరారు చేయాలి. ఇది ఎప్పటి నుంచో ఆనవాయితీగా ఉంది. టీ పొడి విక్రయాలకు సంబంధించి కూడా ప్రభుత్వం ఈవిధంగా బహిరంగ టెండర్లు ఆహ్వానించి ఉంటే తాజ్‌మహల్‌, టాటా చక్రా గోల్డ్‌, త్రీ రోజెస్‌ తదితర జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్‌ కలిగిన టీ ఉత్పత్తిదారులు పాల్గొనే అవకాశం ఉండేది. తద్వారా వారి మధ్య పోటీ నెలకొని నాణ్యమైన టీ పొడి సరసమైన ధరకే ప్రజలకు అందించే వీలు కలిగేది. కానీ, ఇవేవీ పట్టించుకోకుండా.. అధికారం చేతిలో ఉందనే ధైర్యంతో ఎటువంటి టెండర్లూ పిలవకుండానే టీ టైమ్‌ సంస్థకు ఏకపక్షంగా ఈ కాంట్రాక్ట్‌ అప్పగించేశారు. ఈ మేరకు ప్రభుత్వం ఇటీవల సర్క్యులర్‌ కూడా విడుదల చేసింది.

రిటర్న్‌ గిఫ్ట్‌!

ఎటువంటి టెండర్లూ లేకుండానే టీ టైమ్‌ సంస్థ ద్వారా టీ పొడి అమ్మకాలకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడం విస్మయానికి గురి చేస్తోంది. సార్వత్రిక ఎన్నికలప్పటి నుంచీ జనసేన పార్టీకి ఆర్థికంగా చేయూత ఇచ్చిన సంబంధిత నేతకు రిటర్న్‌ గిఫ్ట్‌గా ఈ భారీ నజరానా ఇచ్చారని అంటున్నారు. అనుకున్నదే తడవుగా.. కాకినాడ జిల్లాలో జనసేనకు అన్నీ తానై చక్రం తిప్పిన క్రియాశీలక నేతకు చెందిన కంపెనీకి అయాచిత లబ్ధి చేకూర్చేలా ఈ డీల్‌ కుదిరిందనే ఆరోపణలు వస్తున్నాయి. ఆ పార్టీ నుంచి రాష్ట్ర కేబినెట్‌లో పౌరసరఫరాల మంత్రిగా నాదెండ్ల మనోహర్‌ ఉన్నారు. దీంతో, అనుకున్న పని సులువైపోయిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

డీలర్లపై ఒత్తిళ్లు!

రాష్ట్రవ్యాప్తంగా అన్ని రేషన్‌ షాపుల్లోనూ దశల వారీగా టీ పొడి విక్రయాలు ప్రారంభించాలనే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఈ మేరకు కాకినాడ, తూర్పు గోదావరి జిల్లాల్లో ప్రయోగాత్మకంగా డిసెంబర్‌ 1న టీ పొడి అమ్మకాలకు శ్రీకారం చుడుతున్నారు. ఇప్పటికే కార్డుదారులకు టీ పొడి అమ్మాలంటూ డీలర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఈ జిల్లాల్లోని రేషన్‌ డీలర్లపై అధికారుల నుంచి ఇప్పటికే ఒత్తిళ్లు మొదలయ్యాయి. ప్రభుత్వం సర్క్యులర్‌ విడుదల చేసినప్పటి నుంచీ రేషన్‌ డీలర్లు రెండు రకాల టీ పొడి ప్యాకెట్లు విక్రయించాలని చెబుతున్నారు. ఈ నెల 30 లోగా ఏ రేషన్‌ షాపునకు ఎన్ని ప్యాకెట్లు కావాలనే ఇండెంట్‌ పంపించాలంటూ రెవెన్యూ, పౌర సరఫరాల అధికారుల నుంచి డీలర్లకు మౌఖిక ఆదేశాలు రావడం గమనార్హం.

రేషన్‌ దుకాణాల ద్వారా టీ పొడి విక్రయించే డీలర్లు సంబంధిత కంపెనీకి రూ.5 వేలు చెల్లించాలి. టీ పొడి అమ్మిన తరువాత కమీషన్‌ ఇస్తామని ఆ ఉతర్వుల్లో పేర్కొన్నారు. మండల స్థాయి స్టాక్‌ (ఎంఎల్‌ఎస్‌) పాయింట్‌ నుంచే బియ్యం ఇతర నిత్యావసరాలతో పాటు టీ పొడి కూడా కోటా ప్రకారం విడుదల చేసుకోవాలి. టీ టైం మినీ మార్టుల పేరుతో రేషన్‌ షాపులను మినీ మార్టులుగా మారుస్తామని, రేషన్‌ షాపుల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తామని చంద్రబాబు ప్రభుత్వం గొప్పగా చెబుతోంది. టీ టైం మినీ మార్టులకు ఆ కంపెనీ చంద్ర గోల్డ్‌ టీ మాత్రమే సరఫరా చేస్తుంది. 20 గ్రాముల ప్యాకెట్‌ రూ.10, 40 గ్రాముల ప్యాకెట్‌ ధర రూ.20గా నిర్ణయించారు. ఒక్కో రేషన్‌ షాపునకు 10 గ్రాముల ప్యాకెట్లు 276, 20 గ్రాముల ప్యాకెట్లు 144 సరఫరా చేయనున్నారు. 10 గ్రాముల ప్యాకెట్లు అమ్మితే రూ.339, 20 గ్రాముల ప్యాకెట్లపై రూ.354 డీలర్‌కు లాభం ఉంటుందని చెబుతున్నారు. రూ.5 వేల విలువైన ప్యాకెట్లు అమ్మితే డీలర్‌కు రూ.693 ఆదాయం వస్తుందని అంటున్నారు. వాస్తవానికి జాతీయ, అంతర్జాతీయ టీ బ్రాండ్‌ ఉత్పత్తుల ధర కంటే ఈ ధరలు ఎక్కువని పలువురు అంటున్నారు. ప్రస్తుతానికి 10 గ్రాములు, 20 గ్రాముల ప్యాకెట్లని చెబుతున్నా రాష్ట్రవ్యాప్తంగా రేషన్‌ దుకాణాల్లో కార్డుదారులందరికీ అమ్మడమంటే వ్యవహారం రూ.కోట్లలోనే ఉంటుంది. టీ టైమ్‌ మినీ మార్టుల పైలట్‌ ప్రాజెక్టును భవిష్యత్తులో రాష్ట్రమంతా విస్తరించాలనే వ్యూహం ఇందులో లేకపోలేదని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

అందరికీ చంద్ర గోల్డ్‌ టీ1
1/2

అందరికీ చంద్ర గోల్డ్‌ టీ

అందరికీ చంద్ర గోల్డ్‌ టీ2
2/2

అందరికీ చంద్ర గోల్డ్‌ టీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement