తొలి జీతానికి తకరారు! | - | Sakshi
Sakshi News home page

తొలి జీతానికి తకరారు!

Nov 29 2025 7:35 AM | Updated on Nov 29 2025 7:35 AM

తొలి జీతానికి తకరారు!

తొలి జీతానికి తకరారు!

● ప్రానం పెట్టి పని చేయొద్దా..

ఒకటిన జీతాలియ్యకుంటే ఎలా?

ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న కొత్త టీచర్లు

ఐడీల కేటాయింపులో తీవ్ర జాప్యం

ట్రెజరీ చుట్టూ ప్రదక్షిణలు

వచ్చే నెల 15 తరువాత వచ్చే అవకాశం

ఉమ్మడి తూర్పు గోదావరి

జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి

సాక్షి, అమలాపురం: మెగా డీఎస్సీ.. చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవం నాడు ఈ ఫైల్‌పై సంతకం చేసినప్పటి నుంచి నియామకాలు పూర్తయ్యి తొలి జీతం ఇచ్చే వరకూ అంతా గందరగోళమే. కొలువుల్లో చేరి రెండు నెలలు కావస్తున్నా ఇప్పటి వరకూ జీతమే లేదు. డిసెంబరు 1వ తేదీన జీతం అందే పరిస్థితీ కానరావడం లేదు. వచ్చే నెల 15వ తేదీ వరకూ వీరికి జీతాలు పడే అవకాశం కనిపించడం లేదు. ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడాలని డీఎడ్‌, బీఎడ్‌ చదివి, పూర్తిచేసి ఎన్నో ఏళ్ల నిరీక్షణ అనంతరం వీరు డీఎస్సీ పరీక్షలు రాశారు. మంచి ర్యాంకులు తెచ్చుకుని ఉద్యోగాలు సాధించిన టీచర్లకు తొలి జీతం అందుకోవడంలో తిప్పలు తప్పడం లేదు. ప్రతి నెలా వేతనం చెల్లించేందుకు ట్రెజరీలో ఉద్యోగి ఐడీతో పాటు పర్మినెంట్‌ రిటైర్మెంట్‌ అకౌంట్‌ నంబర్‌ (ప్రాన్‌) జనరేట్‌ చేస్తారు. ఈ సంఖ్య కోసం కొత్త టీచర్లు ఇప్పటికీ ట్రెజరీ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు.

ఉమ్మడి జిల్లాలో 1,351 మంది

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 1,349 మంది ఉపాధ్యాయులు కొత్తగా కొలువుల్లో చేరారు. అంతకు ముందు వారికి తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఐదు, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడలరేవు బీవీసీ ఇంజనీరింగ్‌ కాలేజీలోని ఒక కేంద్రంలో ఇండక్షన్‌ ట్రైనింగ్‌ ఇచ్చారు. లాంగ్వేజ్‌, సైన్స్‌, సోషల్‌, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌, ఎస్‌జీటీ.. ఇలా క్యాడర్ల వారీగా టీచర్లు శిక్షణ పొందారు. అక్టోబర్‌ 3 నుంచి 10వ తేదీ వరకూ శిక్షణ ఇచ్చిన అనంతరం 13న విధుల్లో చేరారు. కొంత తర్జనభర్జనల అనంతరం శిక్షణ తీసుకున్న రోజు నుంచి విధుల్లో చేరినట్లుగానే భావించాల్సి ఉంది. తొలుత 3వ తేదీనా లేక 13వ తేదీనా అనే విషయం తేల్చడానికి సమయం పట్టింది. సర్వీస్‌ రిజిస్టర్‌(ఎస్‌ఆర్‌)లో జాయినింగ్‌ తేదీ నిర్థారిస్తూ ప్రభుత్వం జీఓ ఇవ్వడానికి సమయం తీసుకోవడంలో ఏర్పడిన జాప్యంతో వేతనాల చెల్లింపులో కూడా ఆలస్యమైందని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి.

తప్పని ఎదురుచూపులు

కొత్త ఉపాధ్యాయులు వేతనం పొందాలంటే ఐడీ, ప్రాన్‌ తప్పనిసరి కావడంతో వాటిని క్రియేట్‌ చేయాల్సి ఉంది. ట్రెజరీ అధికారులు ఈ ప్రక్రియ పూర్తి చేస్తేనే వారికి డీడీఓలు వేతన బిల్లులు తయారు చేసి మళ్లీ ట్రెజరీకి పంపుతారు. అక్టోబర్‌ 3 నుంచి 10వ తేదీ వరకూ ఇండక్షన్‌ ట్రైనింగ్‌ పొందిన కొత్త టీచర్లు అదే నెల 13న విధుల్లో చేరారు. వారందరికీ మూడో తేదీ నుంచి వేతనాలివ్వడానికి ప్రభుత్వం అంగీకరించింది. విధుల్లో చేరే సమయానికి ట్రెజరీ ఐడీ, ప్రాన్‌ కేటాయించక పోవడంతో అక్టోబర్‌ నెల జీతం పొందలేకపోయారు. నవంబర్‌ 6 నుంచి 11వ తేదీ మధ్యలో సప్లిమెంటరీ బిల్లులు ట్రెజరీలో పొందుపరచే అవకాశం ఉన్నప్పటికీ అప్పటికి కూడా ట్రెజరీ ఐడీ, ప్రాన్‌ పూర్తి స్థాయిలో కేటాయింపు కాలేదు. ఈ నెల 15వ తేదీ నాటికి కొంతమందికి మాత్రం ఆయా నంబర్లు నమోదయ్యాయి. అయినప్పటికీ అక్టోబర్‌ నెల బకాయి బిల్లు తీసుకుంటేనే కానీ నవంబర్‌ నెల రెగ్యులర్‌ బిల్లు చేయడానికి వీలు కాదు. దీంతో, డిసెంబర్‌ 1వ తేదీన తొలి వేతనం పొందే అవకాశం కొత్త టీచర్లకు చిక్కలేదు. డిసెంబర్‌ 6 నుంచి 11వ తేదీ మధ్యలో అరియర్‌ బిల్లులు సబ్మిట్‌ చేస్తే డిసెంబర్‌ 15 తర్వాత రెండు నెలల వేతనాలూ పొందే అవకాశముంటుంది. కొత్త ఉద్యోగం మొదటి జీతం కళ్ల చూద్దామంటే ట్రెజరీలో ఏర్పడ్డ సాంకేతిక ఇబ్బందులతో ఆ కల దూరమవుతోందని నూతన ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement