మహిళా విద్యకుఫూలే మార్గదర్శకుడు
రాజమహేంద్రవరం రూరల్: దేశంలో మహిళా విద్యకు మహాత్మా జ్యోతిరావ్ ఫూలే మార్గదర్శకుడని, బాలికల విద్య కోసం జీవితాంతం పాటు పడ్డారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ కొనియాడారు. బొమ్మూరులోని పార్టీ కార్యాలయంలో ఫూలే వర్ధంతి శుక్రవారం నిర్వహించారు. ఫూలే చిత్రపటానికి వేణు పూలమాల వేసి, ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం పోరాడిన మహనీయుడు ఫూలే అని అన్నారు. అభాగ్యులైన పిల్లల కోసం అనాథాశ్రమాన్ని ప్రారంభించి, సామాజికాభివృద్ధికి కృషి చేశారని గుర్తు చేశారు. ఫూలే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి గిరజాల బాబు, పార్టీ నేత చెల్లుబోయిన నరేన్, బీసీ సెల్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కొండపల్లి దుర్గారావు, డాక్టర్ చొల్లంగి సత్యగిరి, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి విప్పర్తి ఫణికుమార్, యువజన విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి చాప రాజా, జిల్లా కార్యదర్శులు పాల్గొన్నారు.
సీనియర్ టీచర్లను టెట్
నుంచి మినహాయించాలి
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): సీనియర్ టీచర్లను టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) నుంచి మినహాయించాలని యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పి.జయకర్, ఎ.షరీఫ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు వారి నేతృత్వంలో యూటీఎఫ్ నాయకులు ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరికి స్థానిక పలుకు కేంద్రం వద్ద శుక్రవారం వినతిపత్రం సమర్పించారు. విద్య హక్కు చట్టం 23(2) నిబంధన ప్రకారం ఉపాధ్యాయులంతా విధిగా టెట్ పాసవ్వాలంటూ సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు ఇచ్చిందన్నారు. అయితే, 2011 నుంచి ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చే వారికి మాత్రమే టెట్ విధానం అమలులోకి వచ్చిందని గుర్తు చేశారు. చాలామంది ఉపాధ్యాయులు ఇప్పటికే 20 నుంచి 30 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేశారని, ఇప్పుడు టెట్ రాయాలనే నిబంధన వలన వారు చాలా ఇబ్బంది పడతారని వివరించారు. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేయాలని, అలాగే పార్లమెంటు, ప్రధాన మంత్రి దృష్టికి కూడా తీసుకెళ్లాలని కోరారు. విద్యా హక్కు చట్టంలోని 23(2) నిబంధన సవరణకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమస్యపై స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌టీఎఫ్‌ఐ) కూడా జాతీయ స్థాయిలో ఎంపీలకు విజ్ఞాపన చేస్తోందని చెప్పారు. ఎంపీ పురందేశ్వరి మాట్లాడుతూ, ఈ విషయంపై చర్చించి, పార్టీ నిర్ణయం మేరకు తగిన చర్య తీసుకుంటామని చెప్పారు. కార్యక్రమంలో యూటీఎఫ్ కోశాధికారి ఈవీఎస్‌ఆర్ ప్రసాద్, జిల్లా కార్యదర్శి చిలుకూరి శ్రీనివాసరావు, నాయకులు పాల్గొన్నారు.


