రామాయణ, భారతాలు మన రక్తంలో కలసిపోయాయి | - | Sakshi
Sakshi News home page

రామాయణ, భారతాలు మన రక్తంలో కలసిపోయాయి

Nov 29 2025 7:33 AM | Updated on Nov 29 2025 7:33 AM

రామాయణ, భారతాలు మన రక్తంలో కలసిపోయాయి

రామాయణ, భారతాలు మన రక్తంలో కలసిపోయాయి

ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్‌): చుప్పనాతి శూర్పణఖ, సైంధవుడిలా అడ్డుపడ్డాడు, ఉత్తర కుమార ప్రతిజ్ఞలు– తదితర జాతీయాలు మన జీవితాల్లోకి చొచ్చుకుని పోయాయని, రామాయణ, భారతాలు మన రక్తంలో కలసిపోయాయని ప్రవచన విరించి సామవేద షణ్ముఖశర్మ అన్నారు. వేదవ్యాస భారత ప్రవచనాల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం హిందూ సమాజంలో ఆయన మలి రోజు ప్రసంగం చేశారు. ‘‘పుస్తకాలు జీవితాన్ని నడుపుతాయని ప్రముఖ పండితులు జఠావల్లభుల పురుషోత్తం అన్నారు. అయితే, అసత్యం మీద ఆధారపడిన గ్రంథాలు కాలగర్భంలో కలిసిపోతాయి. సత్యాన్ని ప్రతిష్ట చేసే కావ్యాలు కాలానికి ఎదురొడ్డి నిలిచిపోతాయి. రామాయణ, భారత, భాగవతాలు ఇటువంటివే’’నని సామవేదం అన్నారు. మహాభారత విశిష్టతను వివరిస్తూ.. కావ్యాలకు పుట్టినిల్లు మహాభారతమని అన్నారు. హిమవత్పర్వత ప్రాంతంలో ఒక గుహలో, ఆచమనాది ప్రక్రియలతో దేహాన్ని శుద్ధి చేసుకుని, శాంతచిత్తంతో ఆశీనుడైన వ్యాస మహర్షికి సత్యం గోచరించిందని, అదే మహాభారతమైందని చెప్పారు. గ్రంథాన్ని విస్తారంగా చెప్పే ముందు అందులో కథనాన్ని సంక్షిప్తంగా చెప్పడం ప్రాచీన రుషుల నైజమని, అనుక్రమణిక పర్వం ఈ కోవకు చెందుతుందని అన్నారు. వ్యాసప్రోక్తమైన భారతం మానవులతోనే కాకుండా రుషులు, దేవతలతో సైతం పూజలందుకుంటోందని, ముల్లోకాల్లోని జ్ఞానమంతా భారతంలో ప్రతిష్టితమైనదని వివరించారు. మన దేశంలో నేడు చూస్తున్న పెక్కు నగరాలు, ప్రాంతాలు, వీటి ఆనవాళ్లు మహాభారతంలో కనబడతాయని, కొద్ది కాలం క్రితం తెలుగునాట జనమేజయుని శాసనాలు లభ్యమయ్యాయని అన్నారు. మనకు అసలైన, సిసలైన చరిత్ర చదువుకునే అలవాటు తక్కువని భారతంలో మానవులు, దేవతలు కూడా పాత్రలేనని, దీనిని నాస్తికవాదులు అంత సులభంగా అంగీకరించరని అన్నారు. అంతే కాకుండా రామాయణాన్ని రచించిన వాల్మీకి, భారతాన్ని అందించిన వ్యాస మహర్షి ఆయా గ్రంథాల్లో పాత్రలుగా కనపడతారని గుర్తు చేశారు. భారతీయ గ్రంథాలు దేవతలు, రుషులు, చక్రవర్తుల మీద ఆధారపడి ఉంటాయంటూ ఒక విదేశీ చరిత్రకారుడు అన్న మాటలను ఆయన గుర్తు చేశారు. ‘‘భారతంలో పరలోక గమన వృత్తాంతాలు కనపడతాయి. అర్జునుడు దేవలోకానికి వెళ్లడం.. దుర్యోధనుడు పాతాళానికి వెళ్లడం.. త్రిలోక సంచారులైన నారదాది మహర్షులు భూలోకానికి వచ్చిపోతూ ఉండటం భారతంలో కనిపిస్తుంది. అయితే దీనిని కాల్పనిక సాహిత్యంగా భావించరాదు. సాంకేతికంగా ఇప్పుడు మనం సాధించిన ప్రగతిని నాడు తపస్సు ద్వారా మునులు సాధించారు. ఇప్పుడు యంత్రాలు సాధిస్తున్న విజయాలు అప్పుడు మంత్రాలతో సాధ్యమయ్యాయి’’ అని సామవేదం అన్నారు. తొలుత భాగవత విరించి డాక్టర్‌ టీవీ నారాయణరావు కృష్ణస్మరణ పూర్వకమైన శ్లోకంతో సభకు శుభారంభం పలికారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement