నరసన్న ఆదాయం రూ.47.49 లక్షలు
సఖినేటిపల్లి: అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో శుక్రవారం దేవస్థానం అధికారులు నిర్వహించిన హుండీల లెక్కింపులో స్వామి వారికి మొత్తం రూ.47,48,862 ఆదాయం సమకూరింది. ఈ ఏడాది సెప్టెంబర్ 11వ తేదీ నుంచి ఈ నెల 28వ తేదీ వరకూ 78 రోజులకు ఈ ఆదాయం వచ్చింది. జిల్లా దేవదాయ శాఖ అధికారి వి.సత్యనారాయణ పర్యవేక్షణలో అమలాపురం తనిఖీదారు జె.రామలింగేశ్వరరావు సమక్షంలో దేవస్థానం సిబ్బంది లెక్కింపు చేపట్టారు. మొత్తం ఆదాయంలో ప్రధాన హుండీల ద్వారా రూ.46,61,265, గుర్రాలక్క అమ్మవారి హుండీ ద్వారా రూ.19,774 ఆదాయం, అన్నదానం హుండీల ద్వారా రూ.67,823 ఆదాయం లభించినట్టు అసిస్టెంట్ కమిషనర్ ఎంకేటీఎన్‌వీ ప్రసాద్ తెలిపారు. అలాగే రెండు గ్రాముల బంగారం, 23 గ్రాముల వెండి వస్తువులు, విదేశీ కరెన్సీ వచ్చినట్టు ఏసీ పేర్కొన్నారు. సర్పంచ్ కొండా జాన్‌బాబు, ఎంపీటీసీ బైరా నాగరాజు, సేవకులు పాల్గొన్నారు.
37 బడి బస్సుల తనిఖీ
అమలాపురం రూరల్: రహదారి భద్రత ప్రమాదాల నివారణ చర్యల్లో భాగంగా ఒక ప్రవేట్ పాఠశాలకు చెందిన 37 బస్సులను తనిఖీ చేసినట్లు జిల్లా రవాణా అధికారి దేవిశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. తనిఖీలు నిర్వహించిన బస్సుల్లో చిన్నపాటి సాంకేతిక లోపాలను గుర్తించామని ఈ లోపాలను వారం రోజుల్లోగా సరిచేయించుకోవాలని సూచించారు. అక్కడికక్కడే స్కూల్ యజమాన్యానికి నోటీసులు జారీ చేశామని డీటీఓ పేర్కొన్నారు. ఈ ప్రత్యేక తనిఖీలు డిసెంబర్ 4 వరకూ కొనసాగుతాయని, ఇందుకు ప్రతి పాఠశాల, కళాశాల యాజమాన్యం తమకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ తనిఖీల్లో మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్లు రవికుమార్, జ్యోతి, సురేష్, కౌశిక్ పాల్గొన్నారు.
నరసన్న ఆదాయం రూ.47.49 లక్షలు


