వలస జీవుల సాపాట్లు
రాయవరం: ఆకలికి రుచి తెలియదు, నిద్ర సుఖమెరగదు అన్నది సామెత. ఈ సామెత శ్రామిక జీవులకు అక్షరాలా సరిపోతుంది. కనీసం నిలువ నీడ లేని ఆ కుటుంబాలు ఉపాధిని వెదుక్కుంటూ జిల్లాకు వలస వచ్చాయి. కుటుంబ పోషణలో భాగంగా రాష్ట్రాలు దాటి జీవనం సాగిస్తున్నాయి. మధ్యప్రదేశ్‌కు చెందిన పలువురు వ్యవసాయ పరికరాల తయారీ దారులు జిల్లాకు తరలి వచ్చారు. ఇక్కడే గ్రామాల్లో ఉంటూ, పరికరాలను తయారు చేసి విక్రయిస్తున్నారు.
సుమారు వంద కుటుంబాలు
వ్యవసాయ పనుల్లో నిత్యం ఉపయోగించే కత్తి, కొడవలి, గొడ్డలి, గునపం తదితర పనిముట్లతో పాటు ఇంట్లో ఉపయోగించే కత్తి పీటలను మధ్యప్రదేశ్ వాసులు తయారు చేస్తున్నారు. ఆ రాష్ట్రంలోని సాగర్, భోపాల్ తదితర ప్రాంతాలకు చెందిన సుమారు 100 కుటుంబాలు జిల్లాకు తరలివచ్చాయి. గ్రామాల్లో రహదారి పక్కనే తాత్కాలికంగా నివాసముంటూ, అక్కడే వ్యవసాయ పరికరాలు తయారు చేసి విక్రయాలు సాగిస్తున్నాయి. ఆయా వస్తువులకు ఉన్న డిమాండ్‌ను బట్టి రెండు, మూడు రోజులు గ్రామంలో ఉంటాయి. అనంతరం మరో గ్రామానికి పయనమవుతాయి.
కళ్లెదుటే తయారీ
మధ్యప్రదేశ్ వాసులు తమతో తీసుకువచ్చిన ఇనుప రాడ్లను రైతుల ముందే కొలిమిలో కాల్చి, వారు కోరిన విధంగా పనిముట్లు తయారు చేస్తారు. ఒక్కో పనిముట్టును దాని బరువు ఆధారంగా రూ.100 నుంచి రూ.500 వరకూ విక్రయిస్తారు. షాపుల్లో ఇటువంటి వస్తువులు లభించినా, తమ కళ్ల ఎదురుగానే తయారు చేసే పనిముట్లను కొనుగోలుకు మన రైతులు ఆసక్తి చూపుతున్నారు. వీరందరూ ఏడాదిలో పని నెలల పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో వ్యవసాయ పరికరాలు తయారీ కోసం సంచార జీవితం గడుపుతారు. ప్రస్తుతం నవంబర్ నుంచి మన రాష్ట్రంలో తిరుగుతున్నారు. తాము తయారు చేసే పరికరాలు మన్నికతో ఉంటాయని, అందుకే తమ వస్తువులను కొనేందుకు ఆసక్తి చూపుతారని శివరాజ్‌సింగ్ అనే కార్మికుడు తెలిపాడు.
మగవారితో సమానంగా..
వ్యవసాయ పరికరాల తయారీలో పురుషులతో సమానంగా మహిళలు, పెద్దవారితో సమానంగా బాలలు చెమటోడుస్తున్నారు. ఇనుమును కటింగ్ చేసే సమయంలో మగవారితో సమానంగా సమ్మెట దెబ్బలు వేస్తున్నారు. కొలిమిని మండించడం, తయారు చేసిన వస్తువులను విక్రయించడం వంటి పనులు చేస్తూ పురుషులకు తామేమి తీసిపోమని నిరూపిస్తున్నారు.
చదువుకు పిల్లలు దూరం
పదేళ్ల వయసున్న చిన్నారులు కూడా సమ్మెట దెబ్బలు వేస్తూ పరికరాల తయారీలో తల్లిదండ్రులకు సాయం చేస్తున్నారు. నిత్యం తల్లిదండ్రులతో పాటే వలస జీవితం సాగించే చిన్నారులు పూర్తిగా చదువుకు దూరమవుతున్నారు. పాఠశాలకు వెళ్లడం లేదా అని ‘సాక్షి’ ప్రశ్నిస్తే..ముందు పొట్ట గడవాలి కదా అని తల్లిదండ్రులు సమాధానమిచ్చారు. భోపాల్ పరిసర ప్రాంతాల్లో టెంట్లు వేసుకుని జీవనం సాగిస్తామని, తమకు నిలువ నీడలేదని, అటువంటప్పుడు చదువు ఎలా సాగుతుందని ప్రశ్నిస్తున్నారు.
పొట్టకూటి కోసం రాష్ట్రాలు దాటి రాక
వ్యవసాయ పరికరాల తయారీ
పనిలో మగవారికి
సాయంగా మహిళలు, పిల్లలు
మధ్యప్రదేశ్ వాసుల అవస్థలు
పొట్టకూటి కోసం
పొట్టకూటి కోసం ప్రతి ఏటా ఇలా వస్తున్నాం. చలైనా, ఎండైనా సాపాటు కోసం పాట్లు తప్పవు. రహదారి పక్కనే జీవిస్తున్న సమయంలో ప్రమాదాలకు కూడా గురవుతుంటాం.
– రాజేష్, వ్యవసాయ పనిముట్ల తయారీ దారుడు, భోపాల్
ఏటా వస్తున్నారు
వ్యవసాయ పనిముట్లు తయారీ చేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచి కార్మికులు ఏటా మన ప్రాంతానికి వస్తున్నారు. ప్రస్తుతం వ్యవసాయ పనులు జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలో వీరు తయారు చేసే పనిముట్లకు డిమాండ్ ఏర్పడింది.
– చేవా సత్యనారాయణ, రైతు, లొల్ల, రాయవరం మండలం.
వలస జీవుల సాపాట్లు
వలస జీవుల సాపాట్లు
వలస జీవుల సాపాట్లు


