గృహ నిర్మాణ పనుల అడ్డగింపు
కాజులూరు: గొల్లపాలెం శివాలయం సమీపంలోని స్థలాల్లో ఇళ్ల నిర్మాణ పనులు చేపట్టిన లబ్ధిదారులను పంచాయతీ, రెవెన్యూ సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో వివాదం రేగడంతో గొల్లపాలెం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గృహ నిర్మాణాలు నిలుపుదల చేయాలని హెచ్చరించారు. దానికి లబ్ధిదారులు అంగీకరించకపోవడంతో తహసీల్దార్ రవీంద్రనాథ్ ఠాగూర్, ఎస్సై ఎం. మోహన్‌కుమార్ రంగప్రవేశం చేసి, లబ్ధిదారులను శాంతిపచేయటంతో వివాదం తాత్కాలికంగా సద్దుమణిగింది. వివరాల్లోకి వెళితే.. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఆ గ్రామంలోని సర్వే నెంబరు 113/2లో పలువురికి ఇళ్ల స్థలాలు కేటాయించి, పట్టాలు మంజూరు చేశారు. లబ్ధిదారులు ఇటీవల తమకు కేటాయించిన స్థలాల్లో గృహ నిర్మాణాలు చేపడుతుండగా పంచాయతీ, రెవెన్యూ సిబ్బంది అడ్డుపడ్డారు. దీనిపై బీఎస్సీ, పలు కుల సంఘాల నాయకులు కల్పించుకుని లబ్ధిదారులకు పట్టాలు ఉన్నప్పటికీ, పలువురు స్థానిక నాయకులు రాజకీయ పలుకుబడి ని ఉపయోగించి ఆ భూమి ప్రభుత్వ స్థలమని స్థానిక పంచాయతీ సిబ్బందితో ఫ్లెక్సీలు పెట్టించి పనులు అడ్డుకుంటున్నారని ఆందోళనలు చేపట్టారు. తాజాగా గురువారం ఆ గ్రామ సర్పంచ్ పోతురాజు ప్రసన్న మౌనిక, బీఎస్పీ నాయకులు మాత సుబ్రహ్మణ్యం, ప్రత్తిపాటి పుల్లారావు, పండు అశోక్ కుమార్ ఆధ్వర్యంలో లబ్ధిదారులు తమకు కేటాయించిన స్థలాల్లో గృహ నిర్మాణాలకు చర్యలు చేపట్టారు. విషయం తెలుసుకున్న పంచా యతీ, రెవెన్యూ సిబ్బంది అక్కడకు చేరుకుని పనులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. వారికి లబ్ధిదారులు ఎదురు తిరగటంతో వివాదం తలెత్తింది. కొద్దిసేపటికి తహసీల్దార్ రవీంద్రనాథ్ ఠాగూర్ వచ్చి ఆ భూమి ప్రభుత్వ స్థలమని, డూప్లికేట్ పట్టాలతో కొందరు ఆక్రమించుకుంటున్నారని తమ ఫిర్యాదులు వచ్చాయన్నారు. లబ్ధిదారులకు నోటీసులు ఇచ్చి సోమవారం కాజులూరు తహశీల్దార్ కార్యాలయానికి వస్తే పట్టాలు పరిశీలించి బాధితులకు న్యాయం చేస్తామని హమీ ఇచ్చారు.


