పుట్టిన రోజు వేడుకలో వివాదం
పిఠాపురం: పుట్టిన రోజు వేడుక ఏర్పాట్ల సందర్భంగా చెలరేగిన వివాదంలో ఒక వ్యక్తి కుప్పకూలి మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. గొల్లప్రోలు మండలం తాటిపర్తి గ్రామంలో శ్రీమంతుల దయ మనవరాలు యశస్విని పుట్టిన రోజు సందర్భంగా గురువారం రోడ్డుకు అడ్డంగా బల్లలు పెట్టి వేడుకలకు ఏర్పాట్లు చేశారు. అదే గ్రామానికి చెందిన వెంపల సూరిబాబు పెద్ద కోడలు కృష్ణవేణి అటుగా వెళుతూ దారికి అడ్డుగా ఉన్న బల్లను కొంచెం పక్కగా పెట్టడంతో ఆ బల్ల పడిపోయింది. దీంతో కావాలనే బల్లను తోసేశారంటూ కృష్ణవేణి, ఆమె మావ వెంపల సూరిబాబుపై శ్రీమంతుల దయ కుటుంబ సభ్యులు దాడికి యత్నించారు. దీంతో వారి మధ్య తీవ్ర వివాదం చెలరేగింది. ఈ గొడవలో వెంపల సూరిబాబు (59) కుప్పకూలిపోయాడు. వెంటనే అతడిని పిఠాపురంలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్‌కు తీసుకు వెళ్లగా, అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై గొల్లప్రోలు ఎస్సై రామకృష్ణ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. రెండు కుటుంబాల మధ్య గత కొన్నేళ్లుగా వివాదాలు జరుగుతున్నాయి. సూరిబాబును దయ కుటుంబ సభ్యులు భయభ్రాంతులకు గురి చేసి ఆయన మృతికి కారణమయ్యారని బాధితులు ఆరోపిస్తున్నారు.
రాష్ట్ర స్థాయి సంఘంగా
అయోధ్య సొసైటీ
రాజమహేంద్రవరం సిటీ: ఆర్థిక రంగంలో 35 ఏళ్ల అనుభవం ఉన్న నల్లమిల్లి మధుసూదనరెడ్డి రాష్ట్ర స్థాయి సంఘంగా అయోధ్య సొసైటీ స్థాపించడం అభినందనీయమని జిల్లా సహకార ఆడిట్ అధికారి ఎం.జగన్నాథరెడ్డి అన్నారు. కంబాలచెరువులోని రామచంద్రరావుపేటలో ఏర్పాటు చేసిన అయోధ్య సొసైటీని గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేద, మధ్య తరగతి ప్రజల ఆర్థిక అభ్యున్నతికి ఈ సంఘం చేయూతనందిస్తుందన్నారు. చైర్మన్ మధుసూదనరెడ్డి మాట్లాడుతూ అయోధ్య సొసైటీ సభ్యుల ఆర్థిక అవసరాలకు సకాలంలో రుణాలు అందించి, వారి అభ్యున్నతికి సొసైటీ సహకరిస్తుందన్నారు. కార్యక్రమంలో యర్రా వేణుగోపాల రాయుడు, కొల్లేపల్లి శేషయ్య, తేతల ఆనందరెడ్డి, సీహెచ్ సత్యనారాయణరెడ్డి, అయోధ్య సీఈఓ బి.చిరంజీవులు, సిబ్బంది పాల్గొన్నారు.
కుప్పకూలి ఒకరి మృతి


