ఆరని కుంపట్లు
సాక్షి, రాజమహేంద్రవరం: కూటమిలో కయ్యాల కాపురం సాగుతోందా? జిల్లాలో జనసేన, టీడీపీ నేతల మధ్య రేగిన అసమ్మతి జ్వాలలు చల్లారడం లేదా? టీడీపీ నేతలు రెండు వర్గాలుగా విడిపోయారా? ఆధిపత్యం కోసం నువ్వా.. నేనా అన్నట్లు తలపడుతున్నారా? తాజాగా పవన్ కల్యాణ్ పర్యటనలో సైతం వైషమ్యాలు బహిర్గతమయ్యాయా? నిడదవోలులో జరిగిన మున్సిపల్ వజ్రోత్సవంలో టీడీపీ, జనసేన వర్గ విభేదాలు మరోసారి బహిర్గతం అయ్యాయా? అంటే అవుననే సమాధానం వస్తోంది రాజకీయ విశ్లేషకుల నుంచి.
రాజానగరంలో గరం.. గరం..!
రాజానగరం నియోజకవర్గంలో స్వపక్ష శ్రేణులే టీ‘ఢీ’పీ అంటూ తలపడుతున్నాయి. పార్టీ ప్రస్తుత నియోజకవర్గ ఇన్‌చార్జి బొడ్డు వెంకటరమణ చౌదరి, సీఎం పర్యటన వ్యవహారాల పరిశీలకుడు, మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్, ఆయన తనయుడు పెందుర్తి అభిరామ్ వర్గాల మధ్య వర్గపోరు తారస్థాయికి చేరింది. ఎంతగా అంటే.. ఇరువర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఒకరిపై మరొక వర్గం విమర్శలు చేసుకోవడం.. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకోవడం పరిపాటిగా మారుతోంది. ఈ పరిణామం ఆ పార్టీ నేతలనే విస్మయానికి గురి చేస్తోంది. ఇంత జరుగుతున్నా టీడీపీ అధిష్టానం ఏ మాత్రం పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పవన్ పర్యటనలో కొట్లాట
డిప్యూటీ సీఎం పవన్ ఏలూరు పర్యటన సందర్భంగా సోమవారం మధురపూడి ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. ఎయిర్‌పోర్ట్ కేంద్రంగా పెందుర్తి వెంకటేష్, బొడ్డు వెంకటరమణ చౌదరి వర్గాల మధ్య వర్గ విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. ముఖ్యమంత్రి కార్యక్రమాల కోఆర్డినేటర్ పెందుర్తి వెంకటేష్ కుమారుడు పెందుర్తి అభిరామ్ విమానాశ్రయం టెర్మినల్ లోపలికి వెళ్లడం వివాదానికి కారణమైంది. అభిరామ్‌ను లోపలకు పంపి మమ్మల్నిను ఎందుకు పంపించడం లేదంటూ బొడ్డు వర్గీయులు ఎస్‌పీఎఫ్ సిబ్బంది, పోలీసులను ప్రశ్నించారు. తమ ఆత్మగౌరవం దెబ్బతిందంటూ గొడవకు దిగారు. ఎయిర్‌పోర్ట్ టెర్మినల్ ఎదుటే ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. బూతులు తిట్టుకుంటూ కొట్లాటకు దిగారు. బొడ్డు వర్గీయులు పోలీసులను నిలదీయడం, పెందుర్తి అభిరామ్‌పై బూతుల దండకం అందుకోవడంతో కొద్దిసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది. చివరికి పోలీసుల జోక్యంతో వివాదం సద్దుమణిగింది.
స్పందించని అధిష్టానం
పెందుర్తి అభిరామ్, బొడ్డు వర్గీయుల మధ్య నెలకొన్న వర్గ విభేదాలు ఇప్పటికే టీడీపీ అధిష్టానం దృష్టికి వెళ్లాయి. టీడీపీలోని కొందరు నేతలను టార్గెట్‌గా చేసుకుని అభిరామ్ వేధింపులకు పాల్పడుతున్నారని రాజానగరం, సీతానగరం, కోరుకొండకు చెందిన నాయకులు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడికి ఫిర్యాదు చేశారు. అభిరామ్ తమను దూషించిన వీడియోలు సైతం అందించారు. దీని వెనుక బొడ్డు వర్గంలోని కొందరి పాత్ర ఉందని అభిరామ్ వర్గం భావిస్తోంది. ఈ విషయమై ఇరు వర్గాల నేతలు సోషల్ మీడియా వేదికగా పరస్పరం విమర్శనాస్త్రాలు సంధించుకున్నారు. ఇంత జరుగుతున్నా టీడీపీ అధిష్టానం ఏ మాత్రం స్పందించకపోవడంతో ఆ పార్టీ నేతలను విస్మయానికి గురిచేస్తోంది. ఏడాది నుంచి విభేదాలు ఉన్నా.. టీడీపీ అధిష్టానానికి ఫిర్యాదులు అందినా.. పరిస్థితిని చక్కదిద్దేందుకు ఎందుకు ముందుకు రావడం లేదన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
ఈ నేపథ్యంలో ఇరువర్గాల మధ్య
ఆధిపత్య పోరు పెరిగిపోయింది.
అభిరామ్ ఎంట్రీతో..
పెందుర్తి వెంకటేష్‌ను సీఎం పర్యటన వ్యవహారాల ఇన్‌చార్జిగా నియమించడంతో ఆయన తనయుడు పెందుర్తి అభిరామ్ రంగంలోకి దిగారు. నియోజకవర్గంలో యాక్టివ్‌గా పర్యటిస్తున్నారు. నియోజకవర్గ ఇన్‌చార్జి పదవి దక్కించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్టు తెలిసింది. తనకు మంత్రి లోకేష్ అండదండలు ఉన్నాయని, తనకే దక్కుతుందన్న ధీమా వ్యక్తం చేస్తున్నట్టు వినికిడి. పెందుర్తి వెంకటేష్ సైతం సీఎం చంద్రబాబు వద్ద తన కుమారుడి పదవికి కోసం పట్టుబడుతున్నట్లు తెలిసింది. ఈ పరిణామం వెంకటరమణ చౌదరి వర్గంలో ఆగ్రహావేశాలు నింపుతోంది. కష్టకాలంలో పార్టీకి సేవ చేసిన తమ వర్గానికి ప్రాధాన్యం ఇవ్వకపోవడం ఏంటని ఆయన వర్గీయులు ప్రశ్నిస్తున్నారు.
నిడవోలులో జనసేన,
టీడీపీ నేతల మధ్య కుంపటి
నిడదవోలులో టీడీపీ, జనసేన నేతల మధ్య నెలకొన్న వర్గ విభేదాలు సమసిపోవడం లేదు. 2024 ఎన్నికల్లో కందుల దుర్గేష్‌కు ఎమ్మెల్యే అభ్యర్థిత్వం ఇవ్వడంతో ఈ విభేదాలు మొగ్గ తొడిగాయి. అప్పటి నుంచీ టీడీపీ సీనియర్ నేత, స్కిల్ డెవలప్‌మెంట్ చైర్మన్ బూరుగు పల్లి శేషారావు, మంత్రి కందుల దుర్గేష్ మధ్య సయో ధ్య కుదరడం లేదు. కేవలం అధికారిక సమావేశాల్లో నామ్‌కే వాస్తే అన్నట్లు కలుస్తున్నారనే తప్ప.. అంతర్గతంగా మాత్రం వైషమ్యాలు చల్లారడం లేదు. ఇటీవల జనసేన నేతలకే నామినేటెడ్ పోస్టుల భర్తీలో ప్రా ధాన్యం ఇచ్చారన్న విమర్శలు ఉన్నాయి. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తమకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని టీడీపీ నేతలు గుర్రుగా ఉన్నారు. తాజాగా నిడదవోలు మున్సిపాలిటీ 60 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన వజ్రోత్స వాల్లో సైతం విభేదాలు మరోసారి బహిర్గతమయ్యా యి. ఈ కార్యక్రమానికి టీడీపీ ముఖ్య నేతలు, కార్యకర్తలు గైర్హాజరయ్యారు. కార్యక్రమానికి టీడీపీ మంత్రి పొంగూరి నారాయణ హాజరైనా టీడీపీ నేతలు, స్కిల్ డెవలప్‌మెంట్ చైర్మన్ శేషారావు హాజరుకాకపోవడం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది.
పెరిగిన ఆధిపత్య పోరు
మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ గతంలో రాజానగరం నియోజకవర్గానికి టీడీపీ ఇన్‌చార్జ్‌గా పనిచేశారు. అప్పట్లో సీఎం చంద్రబాబును విమర్శిస్తూ ఇన్‌చార్జి పదవికి రాజీనామా చేశారు. ఆ సమయంలో బొడ్డు వెంకటరమణ చౌదరికి అవకాశం కల్పించారు. అప్పటి నుంచి ఆయనే కొనసాగుతున్నారు. రాజానగరం నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్ ఆశించిన వెంకటరమణ చౌదరి పొత్తులో భాగంగా జనసేనకు పోవడంతో భంగపడ్డారు. పార్టీ ఆదేశాలకు కట్టుబడి జనసేన విజయానికి కృషి చేశారు. ప్రస్తుతం ఆయన టీడీపీ జిల్లా అధ్యక్ష రేసులో ఉన్నారు. పదవి వరిస్తే.. నియోజకవర్గ పదవి ఎవరికి దక్కుతుందన్న మీమాంస నెలకొంది.
ఒకరిపై మరొకరు కేసులు
ఇరువర్గాలు ఒకరిపై మరొకరు కేసులు పెట్టుకునే పరిస్థితి నిత్యకృత్యంగా మారుతోంది. ఇటీవల సీతానగరం మండలం రఘుదేవపురం గ్రామంలో పేకాట స్థావరంపై ఓ వర్గం దాడులు నిర్వహించి పట్టించి తమపై కేసు నమోదు చేయడానికి ప్రయత్నించిందని మరో వర్గం ఆరోపించింది. కోరుకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో కోడిపందేలపై పోలీసులు దాడి నిర్వహించి పలువురిని అదుపులోకి తీసుకొని కోర్టుకు తరలించిన వ్యవహారంలో కూడా ఈ వర్గాల ఆధిపత్య పోరు బహిర్గతమైంది. ఇరు వర్గాల మధ్య తలెత్తుతున్న వర్గ విభేధాలతో అధికారులు నలిగిపోతున్నారు.
కూటమి నేతల మధ్య చల్లారని
వర్గ విభేదాలు
జనసేన ఆధిపత్యాన్ని
జీర్ణించుకోలేకపోతున్న టీడీపీ నేతలు
రాజానగరం నియోజకవర్గ
టీడీపీలో రెండు వర్గాలు
పెందుర్తి వెంకటేష్, బొడ్డు వెంకటరమణ
మధ్య ఆధిపత్య పోరు
తాజాగా పవన్ పర్యటనలోనూ
వర్గ విభేదాలు బట్టబయలు
నిడదవోలులో కొనసాగుతున్న
జనసేన, టీడీపీ నేతల విభేదాలు


