మూలగ్రంథాలే సర్వదా ప్రామాణికం
● సమన్వయ సరస్వతి
సామవేదం షణ్ముఖ శర్మ
● సంపూర్ణ మహాభారత
ప్రవచన యజ్ఞం ఆరంభం
రాజమహేంద్రవరం రూరల్: మూలగ్రంథాలే మనకు సర్వదా ప్రామాణికం, ధర్మాధర్మాల విచక్షణలో, వివేచనలో మూలగ్రంఽథాలనే అధ్యయనం చేయాలి. అనువాద రచనలలో సాహితీ సౌరభాలు ఉండవచ్చును, కానీ మూలగ్రంథాలే మనకు శిరోధార్యమని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖశర్మ అన్నారు. ఋషిపీఠం చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో గురువారం హిందూ సమాజంలో వేదవ్యాస భారత ప్రచవన యజ్ఞం ప్రారంభమైంది. ఈ సందర్భంగా సామవేదం మాట్లాడుతూ ‘సంప్రదాయ విరుద్ధమైన మాట నా నోట రాకూడదని జగన్మాతను ప్రార్థిస్తున్నాను’’ అని చెప్పారు. భారతంతో తనకు ఉన్న అనుబంధాన్ని వివరిస్తూ, శాంత్యనుశాసన పర్వాలపై గతంలో 18 రోజులు ప్రవచనాలు అందించానని, సంపూర్ణ భారతంపై హైదరాబాద్‌లో 18 రోజులు ప్రవచించానని అన్నారు. పండిత వరేణ్యులు వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి, మల్లాది చంద్రశేఖరశాస్త్రి తదితరులు భారతానికి చక్కటి వ్యాఖ్యానాలు చేశారు. కొందరు కవులు, కొన్ని సినిమాల్లో అవగాహనా లోపంతో కువ్యాఖ్యానాలు చేశారు. వేద పురాణేతి హాసాలను కలిపి చూడాలి, అప్పుడే మనకు రామాయణ, భారత, భాగవతాదుల పట్ల సరి అయిన అవగాహన కలుగుతుందని సామవేదం అన్నారు. భారతంపై కొందరు కవుల రచనలలో అపోహలు, అపార్థాలతో పాటు నిందలు కూడా చోటు చేసుకోవడం శోచనీయమని అన్నారు. ప్రపంచ వాజ్ఞ్మయంలో ‘ఇలియట్’, ఒడిస్సీ వంటి అతి పెద్ద గ్రంథాలు లేకపోలేదు. కానీ భారతానికి వచ్చినన్ని వ్యాఖ్యానాలు ఇతర ప్రపంచ సాహిత్యంలో కానరావు. తెలుగు వారికి కవిత్రయ భారతంతో ఆత్మీయతానుబంధం ఉన్నదని సామవేదం అన్నారు. ప్రపంచ సాహిత్యంలో భారతం వంటి మరో గ్రంథం లేదని సామవేదం స్పష్టం చేశారు. మహామహోపాధ్యాయ, శాస్త్రనిధి విశ్వనాథ గోపాలకృష్ణ మాట్లాడుతూ ఒంటి చేత్తో రామాయణ, భారత, భాగవతాలను రచించిన కవిసార్వభౌమ శ్రీపాద కృష్ణమూర్తిశాస్త్రి రాజమహేంద్రనగరానికి చెందిన వారే. అలాగే, రామాయణ, భారత, భాగవతాలను రాజమహేంద్రవరంలో ప్రవచనం చేసిన ఖ్యాతి సామవేదానికే దక్కిందన్నారు. కంచి, శృంగేరీ పీఠాల నుంచి ఆశీస్సులను, మంత్రాక్షతలను ఆయన అందజేశారు. భారతభారతి శలాక రఘునాథ శర్మ మాట్లాడుతూ వేదవ్యాసమహర్షి మూడు సంవత్సరాల కాలంలో భారతాన్ని నిర్మించారని, అధర్మం ఏదో తెలుసుకుని దానిని వదిలిపెట్టాలని భారతం మనకు చెబుతోందన్నారు. మహామహోపాధ్యాయ దోర్బల ప్రభాకరశర్మ, ప్రవచన రాజహంస డాక్టర్ ధూళిపాళ మహాదేవమణి, ఘన సమ్రాట్ గుళ్ళపల్లి సీతారామచంద్ర ఘనపాఠీ, హిందు సమాజం ట్రస్టీ న్యాపతి సుబ్బారావు తదితర ప్రముఖులు ప్రసంగించారు. భాగవత విరించి డాక్టర్ టీవీ నారాయణరావు సభను నిర్వహించారు.
మూలగ్రంథాలే సర్వదా ప్రామాణికం


