ధాన్యం సేకరణ ఫిర్యాదులకు కంట్రోల్ రూమ్
రాజమహేంద్రవరం సిటీ: ధాన్యం కొనుగోలు సంబంధిత ఫిర్యాదులు, సందేహాల పరిష్కారం కోసం కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్టు జేసీ మేఘా స్వరూప్ గురువారం తెలిపారు. ఇది ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు పనిచేస్తుందని రైతులు 83094 87151 నంబర్‌లో సంప్రదించవచ్చని తెలిపారు. జిల్లాలో 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం కాగా 18 మండలాల్లో ఏర్పాటు చేసిన 201 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 21,794 రైతుల నుంచి 1,61,611.920 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. రైతులు తమ ధాన్యాన్ని 17 శాతం తేమ వరకు ఆరబెట్టుకోవాలని సూచించారు.
జాతీయ స్థాయి టెన్నికాయిట్
పోటీలకు ఎంపిక
దేవరపల్లి: మండలంలోని రామన్నపాలెం జిల్లా పరిషత్ హైస్కూలు విద్యార్థిని మిరియాల ప్రియదర్శిని రాష్ట్ర స్థాయి టెన్నికాయిట్ పోటీల్లో ప్రతిభ చూపి జాతీయస్థాయికి ఎంపికై నట్టు ప్రధానోపాధ్యాయుడు పేరం రవీంద్రనాథ్ గురువారం ప్రకటనలో తెలిపారు. ఈ నెల 21, 22 తేదీల్లో శ్రీకాకుళం జిల్లా సోంపేటలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని ఎంపికయింది. డిసెంబర్ 22 నుంచి 26 వరకు కేరళలో జరుగనున్న జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటున్నట్టు ఆయన తెలిపారు. ఆమె 9వ తరగతి చదువుతోందని, ఫిజికల్ డైరెక్టర్ టి.సరస్వతి విద్యార్థినికి శిక్షణ ఇచ్చినట్టు హెచ్‌ఎం చెప్పారు.
ఒడిశా ప్రజాప్రతినిధులకు,
అధికారులకు శిక్షణ
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): రాజమహేంద్రవరంలోని జాతీయ వాణిజ్య పరిశోధన సంస్థ(నిర్కా)లో ఒడిశా రాష్ట్రానికి చెందిన పంచాయతీరాజ్ ప్రతినిధులకు, అధికారులకు సూక్ష్మ వ్యవసాయ పద్ధతులపై శిక్షణ కార్యక్రమం శనివారం వరకు నిర్వహిస్తారు.
గురువారం జరిగిన కార్యక్రమంలో నిర్కా డైరెక్టర్ డాక్టర్ మాగంటి శేషుమాధవ్ మాట్లాడుతూ పంచాయతీరాజ్ సంస్థలు, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం దేశ ప్రగతికి పునాది అని పేర్కొన్నారు. వ్యవసాయ సమాజంతో నిత్యం పనిచేసే పంచాయతీరాజ్ ప్రతినిధులు తాజా వ్యవసాయ సాంకేతికతలు, గ్రామీణ అవసరాలు, అభివృద్ధి అవకాశాలపై అవగాహన పెంపొందించుకోవడంలో ఇటువంటి కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. నిర్కా శాస్త్రవేత్తలు, ఎంపీడీవోలు ఆర్మ్‌స్ట్రాంగ్, కె.రమేష్ పాల్గొన్నారు.
భీమేశ్వరస్వామి ఆదాయం
రూ.43.95 లక్షలు
రామచంద్రపురం రూరల్: ద్రాక్షారామ మాణిక్యాంబా సమేత భీమేశ్వరస్వామి వారి హుండీల ఆదాయాన్ని గురువారం లెక్కించారు. అక్టోబర్ 15 నుంచి నవంబర్ 27 వరకూ 43 రోజులకు గాను ఆలయ హుండీల ద్వారా రూ.43,95,359 వచ్చినట్లు దేవస్థాన సహాయ కమిషనర్ అల్లు వెంకట దుర్గా భవాని తెలిపారు. అన్నదానం హుండీ ద్వారా రూ.52,682 వచ్చిందన్నారు. ఈ కార్యక్రమన్ని జిల్లా అసిస్టెంట్ కమిషనర్ వి.సత్యనారాయణ పర్యవేక్షించారు. ఓదురు గ్రూప్ టెంపుల్స్ కార్యనిర్వాహణాధికారి విత్తనాల శ్రీనివాస్, కె.గంగవరం గ్రూప్ టెంపుల్స్ కార్యనిర్వాహణాధికారి వి.బాలకృష్ణ, అర్చకులు, ద్రాక్షారామ, పోలీస్ శాఖ,సిబ్బంది సేవా సిబ్బంది, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
ధాన్యం సేకరణ ఫిర్యాదులకు కంట్రోల్ రూమ్
ధాన్యం సేకరణ ఫిర్యాదులకు కంట్రోల్ రూమ్


