మోసపూరిత పాలనకు చరమ గీతం
● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు వేణు పిలుపు
● గోపవరంలో రచ్చబండ
కోటి సంతకాల కార్యక్రమం
గోపాలపురం: రాష్ట్రంలో సాగుతున్న మోసపూరిత పాలనకు జనం చరమగీతం పాడాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పిలుపునిచ్చారు. గోపాలపురం మండలం గోపవరంలో గురువారం రచ్చబండ, కోటి సంతకాల కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రయివేటు పరం చేయడానికి చంద్రబాబు సర్కార్ కుట్రలు చేయడం సిగ్గుచేటన్నారు. గోపాలపురం నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ తానేటి వనిత మాట్లాడుతూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ రాష్ట్ర ప్రయోజనాలను గాలికి వదిలి పాలన సాగిస్తున్నారని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను గాలికి వదిలి ప్రజాసంక్షేమాన్ని పట్టించుకోవడం లేదని చంద్రబాబు వైఖరిపై మండిపడ్డారు. యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, రాజమహేంద్రవరం పార్లమెంటరీ ఇన్‌చార్జి గూడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పేదవానికి వైద్యం అందుబాటులో ఉండేలా ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టి ఆదుకున్నారని గుర్తు చేశారు. తండ్రి అడుగు జాడల్లో నడిచిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విద్య, వైద్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకొని రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు నిర్మిస్తే చంద్రబాబు సర్కార్ వాటిని ప్రయివేటు పరం చేయాలని చూడటాన్ని ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని సూచించారు. రాబో యే ఎన్నికల్లో ఓటు అనే ఆయుధం ద్వారా ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని కార్యకర్తలకు సూచించారు. ఎంపీపీ వుండవల్లి సత్యనారాయణ, జెడ్పీటీసీ సభ్యురాలు కాకులపాటి లలిత, మండల పార్టీ అధ్యక్షుడు వెలగా శ్రీరామమూర్తి, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు సాలి వేణు, పఠాన్ అన్సర్‌బాషా, గోపవరం గ్రామ కమిటీ అధ్యక్షుడు ఉక్కుసూరి సురేష్, ఎంపీటీసీ సభ్యుడు మేడ్ని రామచంద్రరావు, నాయకులు దుగ్గిరాల రమేష్‌బాబు, మల్లిపూడి సలీం, కాకులపాటి శ్రీను, ముచ్చికర్ల రవి, నల్లజర్ల పార్టీ సుబ్రహ్మణ్యం, పీతల ప్రసాద్‌బాబు పాల్గొన్నారు.


