చంద్రబాబు ప్రభుత్వంలో దిగజారిన పోలీస్ పనితీరు
దేవరపల్లి: చంద్రబాబు ప్రభుత్వంలో పోలీస్ శాఖ పనితీరు దిగజారి పోయిందని మాజీ హోంమంత్రి తానేటి వనిత అన్నారు. గోపాలపురం మండలం గోపవరంలో గురువారం రాత్రి ఆమె మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో పోలీస్ శాఖ పనితీరుకు కేంద్ర ప్రభుత్వం ప్రథమ స్థానం ప్రకటించి 83 అవార్డులు అందజేసినట్టు ఆమె తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వంలో 16 నెలల పాలనలో 29 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలు మొత్తం 36 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన ర్యాంకింగ్ 36 అని పేర్కొన్నారు. దీని బట్టి రాష్ట్రంలో పోలీస్ శాఖ పనితీరు ఏ విధంగా దిగజారిందో అర్థమవుతుందన్నారు. ప్రజల రక్షణ కోసం పోలీస్ శాఖను వినియోగించడం లేదని, వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై బనాయించిన కేసులతో పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పి ఇబ్బంది పెట్టడం తప్ప ఎక్కడా శాంతి భద్రతలకు వినియోగించట్లేదని ఆమె ఆరోపించారు. ఇంత జరుగుతున్నా హోంశాఖ మంత్రి స్పందించే పరిస్థితి లేదన్నారు. దిశా యాప్‌ను ఉపయోగించుకొని మహిళలు, యువతులు, విదేశాల్లో ఉన్న మహిళలు కూడా పోలీస్‌ల సహాయంతో ఇబ్బందుల నుంచి బయటపడ్డారని గుర్తు చేశారు. చంద్రబాబు ప్రభుత్వం అఽధికారంలోకి వచ్చినప్పటి నుంచి మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు చేసి హత్యలు చేసిన నాయకులు ఎవరైనా ఉన్నారంటే టీడీపీ, జనసేన నాయకులేన ని ఆరోపించారు. మనం ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఉన్నామా? లేక చంద్రబాబు ప్రభుత్వం సొంత రాజ్యాంగ ప్రభుత్వంలో బతుకున్నామా? అనేది తెలియని పరిస్థితిలో ఉన్నామన్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వారి స్వప్రయోజనాల కోసమే అధికారాన్ని ఉపయోగించుకుంటున్నారని, పేద ప్రజలకు, సామాన్య ప్రజలకు గాని మేలు చేసిందేమి లేదని, త్వరలోనే చంద్రబాబు ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యురాలు కాకులపాటి లలిత, వైఎస్సార్ సీపీ జిల్లా ఎస్సీ విభాగం అధ్యక్షుడు సాలి వేణు, నియోజకవర్గ అధ్యక్షుడు కాకులపాటి శ్రీనివాస్ పాల్గొన్నారు.
మాజీ హోంమంత్రి తానేటి వనిత


