కొత్తగా 217 పోలింగ్ కేంద్రాలు
కలెక్టర్ కీర్తి చేకూరి
రాజమహేంద్రవరం సిటీ: జిల్లాలో కొత్తగా 217 పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. చీఫ్ ఎలక్టోరల్ అధికారి వివేక్ యాదవ్ గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టరేట్ నుంచి ఆమె పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుతం జిల్లాలో 1,581 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయన్నారు. కొత్తవాటితో కలిపి మొత్తం 1,798 పోలింగ్ కేంద్రాలు అవుతాయన్నారు. నియోజవర్గాల వారీగా అనపర్తి 40, రాజానగరం 49, రాజమహేంద్రవరం సిటీ 50, రాజమహేంద్రవరం రూరల్ 51 , కొవ్వూరు 54, నిడదవోలు 55, గోపాలపురంలో 66 పెరగనున్నట్టు తెలిపారు. నవంబర్ 26న ఎన్నికల సిబ్బందికి ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్‌పై శిక్షణ నిర్వహించామన్నారు. జిల్లాలోని మొత్తం 16,23,741 ఓటర్లలో 4,19,204 మంది ఓటర్లు బీఎల్‌ఓ ద్వారా మ్యాప్ చేశామన్నారు. కొత్తగా 12,696 మంది వివరాలు కూడా బీఎల్‌ఓలు నమోదు చేశారన్నారు. జేసీ మేఘ స్వరూప్, డీఆర్‌ఓ సీతారామ్మూర్తి పాల్గొన్నారు.
స్కూల్ బస్సుల
తనిఖీకి ప్రత్యేక డ్రైవ్
కంబాలచెరువు(రాజమహేంద్రవరం): జిల్లాలోని విద్యాసంస్థల స్కూల్ బస్సుల భద్రతా ప్రమాణాలను తనిఖీ చేయడానికి రవాణా శాఖ శుక్రవారం నుంచి డిసెంబర్ 4 వరకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా రవాణా అధికారి ఆర్.సురేష్ గురువారం ప్రకటనలో తెలిపారు. ఈ ప్రత్యేక డ్రైవ్‌లో రెండు వేలకు పైగా బస్సులను నాలుగు ప్రత్యేక బృందాలు ఉదయం, సాయంత్రం సమయంలో క్షేత్ర స్థాయిలో తనిఖీ చేస్తాయని పేర్కొన్నారు. వాహన రిజిస్ట్రేషన్, సీటింగ్ కెపాసిటీ, అనుమతులు, అత్యవసర నిష్క్రమణలు, ఎస్‌కేఫ్ హాచ్, అత్యవసర విండోలు, ఫైర్ డిటెక్షన్, అగ్ని నిరోధక వ్యవస్థలు, అగ్నిమాపక పరికరాలు, స్పీడ్ గవర్నర్ పనితీరు పరిశీలిస్తామని తెలిపారు. విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ, లోపాలు కనిపిస్తే వెంటనే సరి చేయాలని, నియమాలు పాటించని వాహనాలపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.


