కర్షకుల్లో కలవరం!
● మరో తుపాను హెచ్చరికతో రైతుల్లో ఆందోళన
● ఇప్పటికే మోంథాతో తీవ్ర నష్టం
● బంగాళాఖాతంలో రెండు అల్పపీడనాలు
● తుపానుగా మారే అవకాశం ఉందన్న
వాతావరణ శాఖ
సాక్షి, రాజమహేంద్రవరం: మోంథా తుపాను ఇప్పటికే రైతులను ముంచేసింది. భారీ వర్షాలు, ఈదురుగాలుల ప్రభావంతో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వెరసి రైతులకు కోలుకోలేని దెబ్బతగిలింది. మోంథా మిగిల్చిన నష్టంతో కర్షకులు ఆర్థికంగా అతలాకుతలం అయ్యారు. నష్టపోయిన రైతులకు ఇంకా పరిహారం మంజూరు కాలేదు.. రైతులు కుదుటపడకముందే.. మరో తుపాను ప్రభావం జిల్లాపై ఉండవచ్చన్న వాతావరణ శాఖ హెచ్చరికలు రైతులను భయాందోళనకు గురి చేస్తున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి, తుపానుగా మారే అవకాశం ఉందని సూచిస్తోంది. ఈ పరిణామం రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఇప్పటికే పీకల్లోతు నష్టాల్లో మునిగిన తమకు రాబోయే తుపానుతో మరింతగా నష్టపోవాల్సి వస్తుందని ఆవేదన చెందుతున్నారు.
అల్పపీడనంతో ఆందోళన
రైతులను ‘అల్పపీడన’ కలవరం వెంటాడుతోంది. దీని ప్రభావంతో శనివారం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. తుపాను ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా రాయలసీమతో పాటు తూర్పుగోదావరి జిల్లాలో సైతం ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే పంట చేతికొచ్చే సమయంలో మోంథా తుపాను ప్రభావంతో కురిసిన వర్షం దిగుబడిపై ప్రభావం చూపింది. ఎకరానికి 40 బస్తాలు రావాల్సిన దిగుబడి 30 బస్తాలు దాటే పరిస్థితి లేదు.
‘తూర్పు’లో ఇలా...
జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్ సీజన్‌లో 79,966 హెక్టార్లలో వరి సాగు చేపట్టినట్లు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతం వరి కోతలు విస్తృతంగా సాగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఈనెల 25వ తేదీ నాటికి 36,375 హెకార్లలో కోతలు పూర్తయినట్లు వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. మిగిలిన ప్రాంతాల్లో సైతం కోతలకు సిద్ధంగా ఉన్నాయి. ప్రస్తుతం అనపర్తి, బిక్కవోలు, చాగల్లు, దేవరపల్లి, గోపాలపురం, కొవ్వూరు, నల్లజర్ల, నిడదవోలు, రాజమండ్రి రూరల్ మండలాల్లో వరి కోతలు విస్తృతంగా జరుగుతున్నాయి. ఈ నెలాఖరు నుంచి మరింతగా ఊపందుకోనున్నాయి. ఇలాంటి సమయంలో తుపాను హెచ్చరికలు రైతుల్లో ఆందోళన నెలకొంది.
పంట చేతికొచ్చే సమయంలో..
ఖరీఫ్ వరి కోతలు విస్తృతంగా జరుగుతున్నాయి. ఇప్పటికే 50 శాతానికి పైగా పూర్తయ్యాయి. కొన్ని చోట్ల నూర్పులు పూర్తవగా, మరి కొన్ని ప్రాంతాల్లో కంకులు పొలాల్లో ఉన్నాయి. కొన్ని చోట్ల వరి పనలపై ఉండగా, మరికొన్ని చోట్ల కుప్పలు వేసి నూర్పిళ్లు చేస్తున్నారు. యుద్ధప్రాతిపదికన కోతలు పూర్తి చేయాలన్న ఉద్దేశంతో యంత్రాలతో కోతలు చేపడుతున్నారు. ధాన్యాన్ని రహదారుల అంచులపై ఆరబెడుతున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో టార్పాలిన్ కవర్లు కప్పి భద్రపరిచే పనుల్లో రైతులు తలమునకలవుతున్నారు.
కొనుగోళ్లపై చిత్తశుద్ధి ఏదీ?
ధాన్యం కొనుగోళ్లలో చంద్రబాబు ప్రభుత్వానికి చిత్తశుద్ధి కరువైంది. కోతలు ప్రారంభించిన వెంటనే కొనుగోలు ప్రక్రియ ప్రారంభించకుండా ఆలస్యం చేయడంతో రైతులు తక్కువ ధరకు దళారులకు అమ్ముకుని నష్టపోయారు.జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్ సీజన్‌లో 79,966 హెక్టార్లలో వరి సాగు చేపట్టారు. సుమారు 6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేశారు. 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఇందుకు గాను 212 ప్రభుత్వ ధాన్యం సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ–పంట నమోదు చేసుకున్న రైతుల నుంచి కొనుగోలు చేస్తామని ప్రకటించారు. గ్రేడ్–ఏ రకం ధాన్యం క్వింటాకు రూ.2,389, సాధారణ రకానికి రూ.2,369గా ధర నిర్ణయించారు. కొనుగోలు కేంద్రాలు ఆలస్యంగా ప్రారంభించారు. కానీ నేటికీ జిల్లా వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కొనుగోళ్లు జరుగుతున్న దాఖలాలు లేవు. కేంద్రం వారి టార్గెట్ పూర్తయిందని మిన్నకుండిపోతున్నారు. దీంతో ధాన్యం కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్లిన రైతు తిరిగి మరుసటి రోజు కోసం నిరీక్షించాల్సి వస్తోంది.
అందని మోంథా సాయం
మోంథా తుపాను రైతులకు కోలుకోలేని దెబ్బతీసింది. జిల్లా వ్యాప్తంగా మోంథా తుపాను నష్టాలపై అధికారులు తుది నివేదిక ప్రభుత్వానికి పంపారు. వ్యవసాయ, ఉద్యాన పంటలకు సంబంధించి 18 మండలాల పరిధిలో 33,262 మంది రైతులు నష్టపోయినట్లు నివేదిక రూపొందించారు. మొత్తం 16,540 హెక్టార్లలో వివిధ రకాల పంటలు నష్టపోగా.. వాటి విలువ రూ.40.96 కోట్లుగా నిర్ధారించారు. 31,074 మంది రైతులకు చెందిన వరి, మినుముకు సంబంధించి 15,738.607 హెక్టార్లలో పంట నష్టం వాటిల్లింది. దీని విలువ రూ.38,21,07,405 కోట్లుగా పేర్కొన్నారు. ఈ ప్రక్రియ జరిగి నెల రోజులు గడుస్తున్నా.. నేటికీ ప్రభుత్వం పరిహారం అందజేసిన దాఖలాలు లేవు. ఎప్పుడు విడుదల చేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది.
జిల్లాలో వరి కోతలు ఇలా...
మండలం వరి సాగు(హెక్టార్లలో) కోతలు(హెక్టార్లలో)
అనపర్తి 3,669 4,050
బిక్కవోలు 6,369 4,130
చాగల్లు 3,373 1,926
దేవరపల్లి 3,719 1,658
గోకవరం 6,251 320
కొవ్వూరు 4,810 3,310
నల్లజర్ల 3,944 2,462
నిడదవోలు 7,370 4,392
రాజానగరం 4,789 3,457
తాళ్లపూడి 4,172 2,247
కర్షకుల్లో కలవరం!


