నిడదవోలు మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి
● హామీ ఇచ్చిన మంత్రి నారాయణ
● ఘనంగా పురపాలక సంఘ వజ్రోత్సవం
నిడదవోలు: నిడదవోలును స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా అభివృద్ధి చేస్తామని మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ హామీ ఇచ్చారు. బుధవారం జరిగిన నిడదవోలు పురపాలక సంఘం వజ్రోత్సవ వేడుకల్లో మంత్రి కందుల దుర్గేష్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. ముందుగా పట్టణంలోని ఐ లవ్ నిడదవోలు పార్కులో ఏర్పాటు చేసిన వజ్రోత్సవ స్థూపాన్ని ఆవిష్కరించారు. నిడదవోలు నియోజకవర్గానికి గోదావరి జలాలు రప్పించే ప్రాజెక్టు, మాలకోడు చెరువు ఆధునికీకరణ, ప్రధాన రహదారులు తదితర రూ.131 కోట్ల అభివృద్ధికి సంబంధించిన శిలాఫలకాలను ఆవిష్కరించారు. స్థానిక లయన్స్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన సభలో మంత్రి కందుల దుర్గేష్ వినతి మేరకు నిడదవోలును స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా అభివృద్ధి చేస్తామని మంత్రి నారాయణ హామీ ఇచ్చారు. నిడదవోలు డైమండ్ జూబ్లీ వేడుకల పోస్టర్ ఆవిష్కరించారు. చాళుక్య, కాకతీయులు ఏలిన పురాతన పట్టణం నిరవద్యపురం గొప్పతనాన్ని, ప్రాశస్త్యాన్ని, భౌగోళిక స్వరూపాన్ని తెలిపేలా సాంస్తృతిక శాఖ సంచాలకులు రేగుళ్ల మల్లికార్జునరావు రచించిన నిడదవోలు చరిత్ర అనే పుస్తకాన్ని మంత్రులు ఆవిష్కరించారు. అనంతరం మున్సిపాలిటీ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు పనిచేసిన చైర్మన్లు, కౌన్సిలర్లు, అభివృద్ధిలో భాగమైన సేవా సంస్థలను, పౌరులను సన్మానించారు. కార్యక్రమంలో కలెక్టర్ కీర్తి చేకూరి, ప్రభుత్వ విప్, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, కొవ్వూరు ఆర్డీవో రాణి సుస్మిత, మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, మున్సిపల్ కమిషనర్ టి.కృష్ణవేణి, మున్సిపల్ వైస్ చైర్మన్ ఎస్‌కే వజీరుద్దీన్ పాల్గొన్నారు.


