సాగునీటి ప్రణాళికలపై సమీక్ష
ధవళేశ్వరం: గోదావరి డెల్టా పరిధిలో నీటి లభ్యత, ఆయకట్టు, సాగు ప్రణాళికలు, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై బుధవారం కలెక్టరేట్‌లో జిల్లా నీటిపారుదల సలహా మండలి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి అధ్యక్షత వహించారు. గోదావరి తూర్పు, మధ్య , పశ్చిమ డెల్టాల పరిధిలోని మొత్తం 8,96,533 ఎకరాలకు అవసరమయ్యే 93.26 టీఎంసీల నీటి లభ్యత, సీలేరు, పోలవరం నిల్వలు, డిసెంబర్ – మార్చిలో అంచనా ఇన్‌ఫ్లోపై సమీక్షించారు. కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ రబీ 2025–26 పంట సాగు సమయానికి అవసరమైన నీటి పంపిణీ, కాలువల సంరక్షణ, ఇంజినీరింగ్ పనులకు సంబంధించిన ప్రాథమిక వివరాల నివేదికను శనివారానికి సమర్పించాలని అధికారులను ఆదేశించా రు. జాయింట్ కలెక్టర్ వై.మేఘా స్వరూప్ ఆధ్వ ర్యంలో రెవెన్యూ, సర్వే, ఇంజినీరింగ్ సిబ్బందిని సమన్వయం చేసి 60 రోజుల్లో సమగ్ర నివేదిక సిద్ధం చేయాలన్నారు. షట్టర్ల మరమ్మతులు, బండ్ల పటిష్టత, కాటన్ మ్యూజియం నిర్వహణ వంటి అంశాల్లో ప్రత్యేక నివేదికలు సిద్ధం చేయా లన్నారు. ఇరిగేషన్ సూపరింటెండింగ్ ఇంజినీర్ కె.గోపీనాథ్ మాట్లాడుతూ గోదావరి డెల్టాకు సంబంధించిన ఆయకట్టు, నీటి అవసరత, లభ్యత వివరించారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యేలు బత్తుల బలరామకృష్ణ, నల్లమిల్లి రామకృష్ణ రెడ్డి, ముప్పిడి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
నేటి నుంచి ప్రవచనయజ్ఞం
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): రుషిపీఠం చారిటబుల్ ట్రస్టు, రుషిపీఠం సత్సంగం సంయుక్త ఆధ్వర్యంలో టి.నగర్‌లోని హిందూ సమాజంలో గురువారం నుంచి 2026 జనవరి 25 వరకు 60 రోజుల పాటు సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖ శర్మ వేదవ్యాస భారతంపై ప్రవచనాలను అందజేస్తారు. ఈ విషయాన్ని భాగవత విరించి డాక్టర్ టీవీ నారాయణరావు ప్రకటనలో తెలిపారు. నిత్యం సాయంత్రం 6.30 నుంచి 8.30 గంటల వరకు ప్రవచనాలు కొనసాగుతాయన్నారు.


