శుభాలకు విరామం! | - | Sakshi
Sakshi News home page

శుభాలకు విరామం!

Nov 26 2025 6:43 AM | Updated on Nov 26 2025 6:43 AM

శుభాల

శుభాలకు విరామం!

ఈ నెల 28 నుంచి ఫిబ్రవరి 15 వరకు శుక్ర మూఢం

80 రోజుల పాటు పెళ్లిళ్లు,

ఇతర శుభ కార్యక్రమాలకు బ్రేక్‌

ఐ.పోలవరం: ఒకటి, రెండు రోజులు కాదు.. ఏకంగా రెండున్నర నెలలకు పైగా... ఇంచుమించు పదకొండు వారాల పాటు శుభ కార్యక్రమాలకు బ్రేక్‌ పడనుంది. శుక్ర మూఢం కారణంగా 80 రోజుల పాటు శుభ కార్యక్రమాలు నిలిచిపోనున్నాయి. సంవత్సరంలో కొన్ని రోజులు శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాగా, మరికొన్ని రోజులు అందుకు పనికిరావు. ప్రత్యేకించి మూఢం రోజుల్లో శుభకార్యాలు నిర్వహించకూడదని పండితులు చెబుతుంటారు. ఈ క్రమంలో జ్యోతిష్య శాస్త్ర ప్రకారం.. ఈ ఏడాది నవంబర్‌ 28వ తేదీ నుంచి శుక్ర మూఢం ఏర్పడనుంది. 2026 ఫిబ్రవరి 15వ తేదీ వరకు ఈ శుక్ర మూఢం కొనసాగుతుంది. అయితే ఆయా ప్రాంతాలు, అనుసరిస్తున్న సంప్రదాయాలు, కొన్ని పంచాంగాల ప్రకారం తేదీలలో స్వల్ప మార్పులు ఉంటాయని పండితులు చెబుతున్నారు.

పలువురి ఉపాధికి గండి

ఈ మూఢం సమయంలో పెళ్లిచూపులు, నిశ్చితార్థం, వివాహం, ఉపనయనం, నూతన గృహ ప్రవేశాలు, ఇంటికి శంకుస్థాపనలు ఉండవు. యజ్ఞాలు, దేవతా విగ్రహాల ప్రతిష్ఠలు, వాహనం, ఇల్లు వంటివి కొనడం, బోర్లు వేయించడం, పుట్టు వెంట్రుకలు తీయించడం, చెవులు కుట్టించడం, కొత్త వ్యాపారాలు ప్రారంభించడం వంటివి చేయరు. 80 రోజుల పాటు జిల్లాలో శుభ కార్యక్రమాలు లేకపోతే వాటి మీద ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడి జీవిస్తున్న వేలాది మంది ఉపాధికి ఇబ్బంది ఏర్పడనుంది.

ముఖ్యంగా వివాహాలకు బ్రేకులు పడితే బ్రాహ్మణులు, వంటవారు, వడ్డించేవారు, బాజాభజంత్రీలు, వీడియో, ఫొటోగ్రాఫర్లు, టెంట్‌ హౌస్‌లు, కల్యాణ మండపాల నిర్వాహకులు ఇలా ఎంతోమందికి పనులు ఉండవు. ఇటీవల పెళ్లిళ్లలో వచ్చిన ఆధునిక పోకడల వల్ల వీటి మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇంచుమించు రెండున్నర నెలల పాటు పెళ్లిళ్లు జరగకపోవడం వల్ల వీరు ఆర్థికంగా గడ్డుకాలం ఎదుర్కోవలసి ఉంది.

పూర్వం నుంచి వస్తున్న

సంప్రదాయం

మూఢంలో శుభకార్యాల్ని చేయకపోవడం అనేది పూర్వం నుంచి వస్తున్న సంప్రదాయం. కాబట్టి మాఘ మాసం వచ్చే వరకు వివాహాది కార్యక్రమాలకు శుభ ముహుర్తాలు లేనట్టే. అయితే ఆయా ప్రాంతాలు, అనుసరిస్తున్న సంప్రదాయాల ప్రకారం తేదీలలో మార్పులు ఉంటాయి.

– నాగాభట్ల రవిప్రసాద్‌ శర్మ, పురోహితుడు,

మురమళ్ల,

ఐ.పోలవరం మండలం

గ్రహాలు బలహీనం

మూఢం అంటే శూన్యం లేదా చీకటి అని అర్థం. గురుడు లేదా శుక్రుడు సూర్యుడితో కలిసి ఉండే కాలాన్ని మూఢం అంటారు. నవగ్రహాల్లోని గురుడు, శుక్రుడు గమనం చేస్తున్న క్రమంలో సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు అవి తమ కాంతిని కోల్పోవడం ద్వారా చీకటి లేదా మూఢం సంభవిస్తుంది. అయితే మూఢం సమయంలో ఈ రెండు గ్రహాలు బలహీనంగా తేజస్సు కోల్పోయి ఉంటాయి. కాబట్టి ఎలాంటి శుభకారా్యాలు నిర్వహించకూడదు అని పండితులు చెబుతుంటారు.

శుభాలకు విరామం!1
1/1

శుభాలకు విరామం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement