వయసు డిగ్రీలు
73
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరవం): నిరంతరం చదువుతూ, జ్ఞానవృద్ధిని జీవన విధానంగా మార్చుకున్న సరస్వతీ పుత్రుడు, ప్రముఖ మానసిక వైద్య నిపుణుడు డాక్టర్ కర్రి రామారెడ్డి తన చదువుల మార్గంలో మరో అరుదైన మైలురాయిని అధిగమించారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన ఆయన ఇప్పటికే పలు భిన్నమైన డిగ్రీలు సాధించారు. ఈ క్రమంలో తాజాగా దేశంలోనే పేరొందిన ఐఐటీలు నిర్వహించే ఎన్‌పీటీఈఎల్ కోర్సులు ఒకే సెమిస్టర్‌లో 12 పూర్తి చేసి రికార్డు సృష్టించారు. వీటిలో 8 పరమ విశిష్ట శ్రేణిలోను (ఎలైట్ ప్లస్ గోల్డ్), 4 కోర్సులు విశిష్ట శ్రేణిలోను (ఎలైట్ ప్లస్ సిల్వర్) ఉత్తీర్ణులై, వరుసగా మూడోసారి మెగాస్టార్ సాధించి, హ్యాట్రిక్ కొట్టారు. డాక్టర్ రామారెడ్డి వాస్తవ వయస్సు 71 ఏళ్లు అయినప్పటికీ సరిఫికెట్ల ప్రకారం 73 సంవత్సరాలు. ఇన్నేళ్లలో ఒకవైపు వైద్య వృత్తి కొనసాగిస్తూనే సైకియాట్రీ, సైకాలజీ, ఇంజినీరింగ్, మేనేజ్‌మెంట్, న్యాయశాస్త్రం, ఎడ్యుకేషన్, ఆంగ్ల సాహిత్యం, లైబ్రరీ సైన్స్, యోగా థెరపీ, జర్నలిజం, కామర్స్, పొలిటికల్ సైన్స్ వంటి అనేక విభాగాల్లో ఆయన సాధించిన మొత్తం డాక్టరేట్లు, పీజీలు, డిగ్రీలు, డిప్లొమాలు, సర్టిఫికెట్ కోర్సులు, తాజాగా సాధించిన 12 సర్టిఫికెట్ కోర్సులతో కలిపి మొత్తం 73కు చేరడం విశేషం.
ఇవి నా కష్టార్జితం, ఇష్టార్జితం
ఈ సందర్భంగా రాజమహేంద్రవరంలోని మానస ఆస్పత్రిలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో డాక్టర్ రామారెడ్డి మాట్లాడారు. తానూ పూర్తి చేసిన డిగ్రీలు, పీజీలు, సర్టిఫికెట్ కోర్సుల్లో ఏదీ అయాచితంగానో, గౌరవపూర్వకమైన నామమాత్రపు అర్హతతోనో రాలేదని, ప్రతి సర్టిఫికేషన్ పూర్తిగా పరీక్షల ఆధారంగా సాధించనదేనని స్పష్టం చేశారు. ఇవన్నీ తన కష్టార్జితం, ఇష్టార్జితమని చెప్పారు. కాన్పూర్, రూర్కెలా, ఖరగ్‌పూర్ ఐఐటీల నుంచి మూడేసి కోర్సులు, గౌహతి ఐఐటీ నుంచి రెండు, మద్రాస్ ఐఐటీ నుంచి 1 కలిపి ఈ ఏడాది జూలై – డిసెంబర్ సెమిస్టర్‌లో 12 ఎన్‌పీటీఈఎల్ కోర్సులు పూర్తి చేశానని వివరించారు. ఇప్పటికే రెండుసార్లు మెగాస్టార్ అర్హత సాధించగా వరుసగా మూడో సెమిస్టర్‌కు కూడా మెగాస్టార్ అర్హత వచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు. అన్ని పరీక్షలూ రాజమహేంద్రవరంలోని రాజీవ్‌గాంధీ కళాశాల కేంద్రంలో జరిగాయని, చాలా కఠిన నిబంధనల నడుమ ఈ పరీక్షలు రాసి ఉత్తమ ఫలితాలతో ఉత్తీర్ణత సాధించడం ఆనందంగా ఉందని డాక్టర్ రామారెడ్డి అన్నారు. వచ్చే సెమిస్టర్‌లో 16 కోర్సులు పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు చెప్పారు. చదువుకు వయస్సు సంఖ్య మాత్రమేనని, నేర్చుకోవడం జీవితాంతం కొనసాగించవచ్చని అన్నారు. ఇలా కోర్సులు చేయడం ద్వారా యంగ్ లైఫ్ పొందుతున్నానన్నారు.
ఫ ఒకే సెమిస్టర్‌లో 12 ఎన్‌పీటీఈఎల్ కోర్సులు పూర్తి
ఫ 9 కోర్సులలో టాపర్
ఫ వరుసగా మూడోసారి మెగాస్టార్ అర్హత
ఫ డాక్టర్ కర్రి రామారెడ్డి ఘనత
భావితరాలకు స్ఫూర్తి
రాజీవ్‌గాంధీ కళాశాల నిర్వాహకుడు, అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ మాట్లాడుతూ, 70 ఏళ్లు నిండిన తరువాత కూడా డాక్టర్ రామారెడ్డి ఇంతటి తీవ్ర అధ్యయనం చేయడం అరుదైన విషయమని, ఇది ప్రజలకు, భావితరాలకు స్ఫూర్తి అని అన్నారు. ఇప్పటికే రామారెడ్డికి డాక్టర్ బీసీ రాయ్ అవార్డు వచ్చిందని గుర్తు చేస్తూ, వంద డిగ్రీలు పూర్తయ్యే సమయానికి కేంద్ర పురస్కారాలు కూడా వస్తాయని అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ సీనియర్ నాయకుడు ఓలేటి సత్యనారాయణ, మాట్లాడుతూ, అందరిలానే డాక్టర్ రామారెడ్డికి కూడా రోజుకు 24 గంటలే ఉన్నాయని, అయినప్పటికీ ప్రణాళికాబద్ధంగా పనులు చేసుకుంటూ, వృత్తి నిర్వహిస్తూ, అధ్యయనం సాగిస్తున్నారని అన్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నగర కార్యదర్శి డాక్టర్ దాట్ల సతీష్‌రాజు మాట్లాడుతూ, ఇన్ని డిగ్రీలు వచ్చే తరంలో ఎవరూ చేయలేరని, అందుకే డాక్టర్ రామారెడ్డి తమకు స్ఫూర్తిదాయకమని అన్నారు. విలేకర్ల సమావేశంలో భారత్ వికాస్ పరిషత్ రాష్ట్ర పూర్వాధ్యక్షుడు పీవీఎస్ కృష్ణారావు కూడా మాట్లాడారు.


