నారికేళం ఢమాల్
పెరవలి: కార్తికం, పండగల ప్రభావం.. దక్షిణాది రాష్ట్రాల్లో దిగుబడి లేకపోవడంతో మంచి ధర పలికి.. ఇటు రైతులకు, అటు వ్యాపారులకు లాభాలు పంచిన కొబ్బరి ఇప్పుడు నేలచూపులు చూస్తోంది. నెల రోజుల కిందటి వరకూ వెయ్యి కాయల ధర ఏకంగా రూ.32 వేలు పలికింది. అటువంటిది ఇప్పుడు ఏకంగా రూ.10 వేలకు పడిపోయింది. వెయ్యి కాయలకు నాణ్యతను బట్టి రైతుకు రూ.7 వేల నుంచి రూ.8 వేలు మాత్రమే దక్కుతోంది. దీంతో, వారు గగ్గోలు పెడుతున్నారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో సుమారు 70 వేల హెక్టార్లలో కొబ్బరి తోటలుండగా.. నవ్య తూర్పు గోదావరి జిల్లాలో 8,979 హెక్టార్లలో దీని సాగు జరుగుతోంది. దీంతో పాటు చేలు, పుంత, చెరువు గట్ల పైన, లంక భూముల్లోను మరో 2 వేల హెక్టార్ల వరకూ రైతులు కొబ్బరి సాగు చేస్తున్నారు.
అందుకే ధరల పతనం
ఈ ఏడాది ఉత్తర ప్రదేశ్‌లో జరిగిన కుంభమేళా నుంచి కొబ్బరి ధరల పెరుగుదల ప్రారంభమైంది. ఇదిలానే కొనసాగుతూ, గత సెప్టెంబర్ నెలఖారులో ఏకంగా రూ.32 వేలకు చేరింది. అక్టోబర్ నుంచి కొద్దికొద్దిగా తగ్గుతూ నెలాఖరుకు రూ.21 వేలకు పడిపోయింది. నవంబర్ ప్రారంభం నుంచీ ఈ ధర మరింత పతనమవుతూ వస్తోంది. మొన్నటి వరకూ దేవీ శరన్నవరాత్ర ఉత్సవాలు, దీపావళి, కార్తిక మాసం వంటి కారణాలతో కొబ్బరికి మంచి డిమాండ్ వచ్చింది. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలకు కూడా గణనీయంగా ఎగుమతులు జరిగేవి. అదే సమయంలో తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో కొబ్బరి ఉత్పత్తి భారీగా పడిపోయింది. దీంతో, మన రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే కొబ్బరికి ఎక్కడ లేని డిమాండూ వచ్చింది. ఫలితంగా ధరలు భారీగా పెరిగాయి. ఇప్పుడు పండగల సీజన్, కార్తిక మాసం ముగియడం.. ఇదే సమయంలో తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో కొబ్బరి ఉత్పత్తి పెరగడం, అక్కడి నుంచి నాణ్యమైన కాయలు మార్కెట్‌ను ముంచెత్తడం వంటి కారణాలతో మన కొబ్బరికి డిమాండ్ పడిపోయింది. మరోవైపు శుక్ర మూఢం రావడం, సంక్రాంతి వరకూ శుభకార్యాలు పెద్దగా లేకపోవడం వంటి కారణాలతో ఎగుమతులు, ధరలు పడిపోయాయని వ్యాపారులు చెబుతున్నారు. మూడు నెలల క్రితం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి నిత్యం 400 నుంచి 500 లారీల్లో ఇతర రాష్ట్రాలకు కొబ్బరి ఎగుమతులు జరిగేవి. నేడు 20 లారీలకు మించి వెళ్లడం లేదని వ్యాపారులు చెబుతున్నారు. తూర్పు గోదావరి జిల్లా నుంచైతే రోజుకు పది పన్నెండు లారీలకు మించి ఎగుమతులు జరగడం లేదని అంటున్నారు.
దిక్కు తోచని స్థితిలో..
ప్రస్తుతం మార్కెట్లో వెయ్యి కాయలు రూ.10 వేలు పలుకుతున్నా.. దింపు, మోత, ఒలుపు, రవాణా వంటి పేర్లతో వ్యాపారులు రైతులకు ధరలో కోత పెడుతున్నారు. ధరలు పడిపోతూండటంతో ఇటు రైతులు, అటు వ్యాపారులు దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటున్నారు. ధర లేదని చెట్టు నుంచి దించకపోతే కొబ్బరి కాయలు నేల రాలిపోతున్నాయని రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఎంతో కొంత వస్తుందని సరిపెట్టుకుని దింపు తీద్దామన్నా వ్యాపారులెవ్వరూ రావడం లేదని వాపోతున్నారు. గతంలో ధర ఉన్నప్పుడు తోటల్లో ఎకరానికి దింపునకు వెయ్యి కాయల దిగుబడి వచ్చేదని, నేడు తీతకు 1,500 నుంచి 1,700 కాయలు వస్తున్నా కొనుగోలు చేసేవారే కనిపించడం లేదని అంటున్నారు. అయితే, దింపు తీస్తే ధర ఎక్కడ మరింతగా తగ్గిపోతుందోనని భయపడుతున్న వ్యాపారులు కొనుగోళ్ల జోలికి వెళ్లడం లేదు. తోటల వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు.
ఫ దారుణంగా
పడిపోయిన కొబ్బరి ధరలు
ఫ గతంలో వెయ్యి కాయలు
రూ.32 వేలు
ఫ నేడు రూ.10 వేలు
ఫ రైతుకు దక్కుతున్నది
రూ.7 వేల నుంచి రూ.8 వేలు
ఫ 10–12 లారీలు
మాత్రమే ఎగుమతులు
ఫ కేరళ, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల కొబ్బరి భారీగా దిగుమతులు
ఫ అందువల్లనే ధర
తగ్గిందంటున్న వ్యాపారులు


