‘షష్ఠి’ వేడుకలకు సర్వం సిద్ధం
బిక్కవోలు: దేవ సేనాని అయిన సుబ్రహ్మణ్యేశ్వరుని షష్ఠి ఉత్సవాలకు ఆ స్వామి క్షేత్రమైన బిక్కవోలు సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఇక్కడి శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయాన్ని, విద్యుద్దీప తోరణాలతో అంగరంగ వైభవంగా అలంకరించారు. ఆలయంలో స్వామివారి షష్ఠి ఉత్సవాలు మంగవారం రాత్రి 1.10 గంటలకు (తెల్లవారితే బుధవారం) తీర్థపు బిందె సేవతో ప్రారంభమవుతాయి. బుధవారం ఉదయం నుంచి ఉమ్మలాడ, భీమవరం, దువ్వ, బిక్కవోలు గ్రామాల కళాకారులతో బ్యాండ్ కచేరీలు, అనంతరం సాయంత్రం 4 గంటల వరకూ బాణసంచా కాల్పులు నిర్వహిస్తారు. 4.30 నుంచి రాత్రి 9 గంటల వరకూ సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. రాత్రి 9 గంటలకు భారీ బ్యాండ్ మేళాలు, కోయ డ్యాన్సులు, గరగ నృత్యాలు, శక్తివేషధారులు, గారడీ విన్యాసాల నడుమ స్వామివారి గ్రామోత్సవం కోలాహలంగా నిర్వహిస్తారు. రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజాము వరకూ బాణసంచా ప్రదర్శన చేస్తారు. భక్తుల రధ్దీ దృష్ట్యా అన్ని జాగ్రత్తలూ తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇతర గ్రామాల నుంచి 50 మంది పారిశుధ్య సిబ్బందిని తీసుకు వచ్చారు. స్నాన ఘట్టాల్లో విద్యుద్దీపాలు, ఆలయం వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు.
‘షష్ఠి’ వేడుకలకు సర్వం సిద్ధం


