షష్ఠి ఉత్సవాలకు వేళాయె | - | Sakshi
Sakshi News home page

షష్ఠి ఉత్సవాలకు వేళాయె

Nov 25 2025 10:30 AM | Updated on Nov 25 2025 10:30 AM

షష్ఠి

షష్ఠి ఉత్సవాలకు వేళాయె

బిక్కవోలులో పూర్తయిన ఏర్పాట్లు

రాష్ట్రం నలుమూలల నుంచీ

రానున్న భక్తులు

బిక్కవోలు: రాష్ట్రవ్యాప్తంగా ఖ్యాతిగాంచిన బిక్కవోలు శ్రీకుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో షష్ఠి ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. డిసెంబర్‌ 2వ తేదీ వరకు జరిగే ఈ ఉత్సవాలకు బుధవారం తెల్లవారుజామున 1.10 గంటలకు స్వామివారి తీర్థపు బిందె సేవతో శ్రీకారం చూడతారు. షష్ఠి ఉత్సవాలకు ఆలయ పరిసరాలు విద్యుత్‌ దీపకాంతులతో దేదీప్యమానంగా వెలుగుతున్నాయి. ప్రధాన రహదారిలో సినిమా సెంటర్‌ నుంచి రావిచెట్టు వరకు రోడ్డుకు ఇరువైపులా ఎల్‌ఈడీ దీపాలను ఏర్పాటు చేశారు. ప్రధాన కూడళ్లలో దేవతామూర్తులు, వివిధ అంశాలతో కూడిన ఎల్‌ఈడీ బోర్డులు ఆకర్షణీయంగా ఉన్నాయి. చలువ పందిళ్లను రంగు,రంగుల వస్త్రాలతో అలంకరించారు.

ఆలయ చరిత్ర

1,100 ఏళ్ల చర్రిత కలిగిన బిక్కవోలులో వేంచేసియున్న శ్రీగోలింగేశ్వరస్వామి ఆలయం ఆంధ్రప్రదేశ్‌లో ప్రాచీన శివక్షేత్రాలలో ఒకటి. రాజహేంద్రవరం నుంచి కాకినాడ వెళ్లే రోడ్డులో ఉన్న ఈ ఆలయం తూర్పు చాళుక్యుల శిల్పాకళా వైభవంతో భాసిల్లుతోంది. ఈ క్షేత్రం మొదట చాళుక్య విక్రమాదిత్యుని పేరిట విక్రమపురంగాను మూడవ విజయాదిత్యునిగా పేరుగాంచిన గుణగవిజయాదిత్యుని కాలం క్రీ.శ. 849–892లో బిరుదాంకినవోలుగాను వినుతికెక్కింది. కాలగమనంలో బిక్కవోలుగా నామాంతరం చెందింది. తూర్పు చాళుక్య రాజులలో గుణగ విజయాదిత్యుడు, చాళుక్యభీముడు (క్రీ.శ.892–921) సుప్రసిద్ధులు. గుణగవిజయాదిత్యుడు పశ్చిమ గంగులు, రాష్ట్రకూటులు, కళింగులతో యుద్ధాలు చేసి విజయం సాధించి, శుత్రు సంహార పాప పరిహారం నిమిత్తం 108 శివాలయాలు నిర్మించగా చాళుక్య భీముడు తన పరిపాలనా కాలంలో 360 శివాలయాలు నిర్మించారు. తురుష్కుల దండయాత్రలు, మరాఠీ యుద్ధాల వల్ల చాలా దేవాలయాల్లో విగ్రహాలు ధ్వంసం అయ్యాయి. నేడు బిక్కవోలులో ఆరు దేవాలయాలు చాళుక్యుల శిల్పాకళా వైభావానికి సాక్షీభూతంగా నిలుస్తున్నాయి. తూర్పుచాళుక్యుల తరువాత బిక్కవోలును రాజధానిగా పరిపాలించిన వారిలో ముఖ్యులు కొండవీటి రెడ్లు. వీరి కాలంలో సంగీత, సాహిత్య కళా సంగమ ప్రదేశంగా బిక్కవోలు పేరుగాంచింది. తర్వాత ఈ ప్రాంతం పెద్దాపురం సంస్థాఽనాధీశుల ఏలుబడిలోకి వచ్చింది. శ్రీ వత్సవాయి సూర్యనారాయణ తిమ్మ జగపతి మహారాజు 234 ఎకరాల చెరువును తవ్వించగా ఆ ప్రదేశంలో అనేక శివలింగాలు, శిథిలమైన దేవాలయాలు బయట పడటంతో నేటికీ లింగాల చెరువుగా పిలుస్తారు. రాజుగారి గోవులు దేవాలయ శిథిలాల పైకి వెళ్లి, అక్కడ వున్న పుట్టలో పాలు విడిచేవి. ఆ విషయం రాజుగారికి తెలిసి అక్కడ మట్టిని తవ్వించగా మూడు శివాలయాలు బయటపడ్డాయి. ఆ ప్రదేశాన్ని త్రిలింగ క్షేత్రంగా పిలుస్తున్నారు. గోవు పాదాలతో తొక్కడం వల్ల, గోవు పాలతో అభిషేకించడం వల్ల అప్పటి వరకు విజయేశురునిగా పిలిచిన స్వామిని నేడు గోలింగేశ్వరస్వామిగా పూజిస్తున్నారు. ఆలయంలో శ్రీ పార్వతి అమ్మవారు – శ్రీకుమార సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారు దక్షిణ ముఖంగాను, శ్రీ విజయ గణపతి, శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రేశ్వరస్వామి ఉత్తర ముఖంగా కొలువుదీరి ఉన్నారు. ఈ ఆలయానికి ఇరుపక్కలా శ్రీ చంద్రశేఖరస్వామి, శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయాలు ఒకే ప్రాకారంలో ఉన్నాయి.

సాంస్కృతిక కార్యక్రమాలు

25వ తేదీ రాత్రి 6 గంటకు భజన, 9 గంటలకు గొర్రెల బ్రదర్స్‌ రామచంద్రపురం వారి బుర్రకథ, 1.10 గంటలకు తీర్థపు బిందె సేవ అనంతరం ఏలూరు వారి నాబత్‌ ఖానా కచేరీ, 26న 7.20 గంటలకు స్వామివారి గ్రామోత్సవం, ఉమ్మలాడ, భీమవరం, దువ్వ, బిక్కవోలు గ్రామాల బ్యాండ్‌ కచేరీ, 4.30 గంటలకు బాణసంచా 7.35కు గంటలకు వివిధ రకాల బ్యాండ్‌ మేళాలు, కోయ డాన్సులతో సంబరం, రాత్రి 10 గంటలకు బాణ సంచా పోటీలు. 27న కొలాటం, చండీమేళం, కేరళ వాయిద్యాలతో రథోత్సవం, 27న తాపేశ్వరం వారి కూచిపూడి నృత్య ప్రదర్శన, సినీ మ్యూజికల్‌ నైట్‌, 28న బిక్కవోలువారి కూచిపూడి నృత్య ప్రదర్శన, 29న అనపర్తి వారి కూచిపూడి నృత్య ప్రదర్శన, సినీ మ్యూజికల్‌ నైట్‌, 30న రాజమహేంద్రవరం కూచిపూడి నృత్య ప్రదర్శన, సత్య హరిశ్చంద్ర నాటకం, డిసెంబర్‌ 1న ఏకాహం ప్రారంభం, 2న ఉదయం ఏకాహం ముగింపు, రాత్రి అన్న సమారాధనతో షష్ఠి ఉత్సవాలు పూర్తవుతాయి.

బిక్కవోలు సంతానం కోసం ఆలయంలో నిద్రిస్తున్న మహిళలు (ఫైల్‌)

బిక్కవోలు శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయం

అభయ ముద్రలో దర్శనం

ఆలయంలో శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బ్రహ్మచారిగా పూజలందుకుంటున్నారు. చతుర్బుజుడై అభయ ముద్రలో దర్శనం ఇస్తారు. పై రెండు చేతులలో దండం, పాశం ఉన్నాయి. కింద కుడిచేతితో అభయమిస్తున్న స్వామి ఎడమ చేతిని తన నెమలి వాహనంపై ఉంచారు. స్వామివారికి కుడి వైపున సహజ సిద్దమైన పుట్ట ఉంది. రోజూ రాత్రి పళ్లెంలో పాలు పోసి ఈ పుట్ట వద్ద ఉంచడం ఈ ఆలయ సంప్రదాయం. అంగారక క్షేత్రంగా పిలిచే ఈ దేవాలయంలో భక్తులు దోష నివారణ పూజలు చేయించుకుంటారు. మార్గశిర శుద్ధ షష్ఠి రోజున సంతానం లేని మహిళలు పుట్ట పై ఉంచిన నాగుల చీరను ధరించి ఆలయం వెనుక నిద్రిస్తే స్వామి కలలో సాక్షాత్కరించి సంతాన ప్రాప్తి కలుగజేస్తాడని భక్తుల నమ్మకం.

అందరికీ స్వామి దర్శనం కల్పిస్తాం

గత ఏడాది 2 లక్షల మంది భక్తులు వచ్చారు. ఈ ఏడాది అంతకంటే ఎక్కువగా వస్తారని భావిస్తున్నాం. సుమారు రు.55 లక్షలకు పైగా ఖర్చు అవుతుంది. అధికారులు, గ్రామస్తులు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అందరికీ స్వామి దర్శనం కల్పించేలా చర్యలు తీసుకుంటున్నాం.

– పల్లె శ్రీనివాసరెడ్డి(వాసు),

షష్ఠి ఉత్సవ కమిటీ చైర్మన్‌, బిక్కవోలు

షష్ఠి ఉత్సవాలకు వేళాయె1
1/3

షష్ఠి ఉత్సవాలకు వేళాయె

షష్ఠి ఉత్సవాలకు వేళాయె2
2/3

షష్ఠి ఉత్సవాలకు వేళాయె

షష్ఠి ఉత్సవాలకు వేళాయె3
3/3

షష్ఠి ఉత్సవాలకు వేళాయె

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement