వజ్రోత్సవ సంరంభం | - | Sakshi
Sakshi News home page

వజ్రోత్సవ సంరంభం

Nov 25 2025 10:12 AM | Updated on Nov 25 2025 10:12 AM

వజ్రో

వజ్రోత్సవ సంరంభం

నిడదవోలు: మహత్తర చరితకు నెలవైన నేల ఇది.. చాళుక్య, కాకతీయ రాజవంశాలు ఏలిన జలదుర్గ పురమిది.. ఈ చారిత్రక పట్టణం నిడదవోలు.. పురపాలక సంఘం ఏర్పడి అరవై వసంతాలు పూర్తవుతున్న సందర్భంగా.. వజ్రోత్సవానికి సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా ఈ నెల బుధ, గురు, శుక్రవారాల్లో పురపాలక సంఘ వజ్రోత్సవాల నిర్వహణకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

పురపాలక సంఘంగా ఆవిర్భావం :

నిడదవోలు 1964 నవంబర్‌ వరకూ గ్రామంగా ఉండేది. అనంతరం 1964 డిసెంబర్‌ 1న తృతీయ శ్రేణి పురపాలక సంఘంగా ఆవిర్భవించింది. క్రమంగా అభివృద్ధి చెందుతూ కొన్నాళ్ల తరువాత ద్వితీయ శ్రేణి మున్సిపాలిటీ మారింది. ఈ అరవై వసంతాల కాలంలో నిడదవోలు పురపాలక సంఘానికి 12 మంది చైర్మన్లుగా పని చేశారు. దీనబంధు బిరుదు పొంది, పేదల డాక్టర్‌గా గుర్తింపు పొందిన బీవీఎన్‌ రాజు పట్టణ తొలి చైర్మన్‌గా ప్రజలకు విశేష సేవలందించారు. చేసిన సేవలకు గుర్తింపుగా ప్రభుత్వ బాలుర జూనియర్‌ కళాశాల ఆవరణలో ఆయన విగ్రహం ఏర్పాటు చేశారు. చైర్మన్లలో చిన్నం వెంకన్న, బొబ్బా కృష్ణమూర్తి రెండేసిసార్లు పదవి చేపట్టారు. ఇద్దరు డాక్టర్లు చైర్మన్లుగా సేవలు అందించారు. వారిలో బీవీఎన్‌ రాజు, తోపరాల శ్రీరామలక్ష్మి ఉన్నారు. చైర్మన్‌ కొత్తపల్లి శ్రీరాములు హయాంలో 1972లో పురపాలక సంఘ కార్యాలయం నిర్మించారు. ఆ తరువాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో నూతన మున్సిపల్‌ కార్యాలయం నిర్మించి, దానికి ఆయన పేరే పెట్టారు. ఈ మున్సిపాలిటీలో ఇప్పటి వరకూ 41 మంది కమిషనర్లు పని చేశారు. ప్రస్తుతం మున్సిపల్‌ చైర్మన్‌గా భూపతి ఆదినారాయణ, కమిషనర్‌గా టి.కృష్ణవేణి ఉన్నారు.

ఖరారవని షెడ్యూల్‌ :

ఓ పురపాలక సంఘం వజ్రోత్సవాల సమయం సమీపిస్తున్నా ఇప్పటికీ వజ్రోత్సవాల షెడ్యూల్‌ ఖరారు కాకపోవడంతో పట్టణ ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. వివిధ పనులు ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. వేడుకల్లో భాగంగా ఆటల పోటీలు, సినీ మ్యూజికల్‌ నైట్‌ తదితర సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. అయితే, వేడుకలను హాజరయ్యే ప్రజాప్రతినిధులు, కార్యక్రమాల షెడ్యూల్‌ ఇంకా ఖరారు చేయలేదు. మంగళవారం సాయంత్రానికి పూర్తి షెడ్యూల్‌ ఖరారవుతందని కమిషనర్‌ కృష్ణవేణి తెలిపారు.

శైవ క్షేత్రాలకు ప్రసిద్ధి

క్రీస్తుశకం 16, 17 శతాబ్దాల్లో చేసిన దండయాత్రల్లో నిడదవోలులోని అనేక పురాతన దేవాలయాలను మహమ్మదీయులు కొల్లగొట్టారని చెబుతారు. ఆ సందర్భంగా హిందూ సంప్రదాయాలకు సంబంధించిన దైవారాధన విగ్రహాలన్నీ చిన్నాభిన్నం చేశారని, ఈ క్రమంలోనే నిడదవోలులో శైవారాధనకు సంబంధించిన అనేక శిథిల విగ్రహాలు నేటికీ ఉన్నాయని అంటారు. మహమ్మదీయులకు భయపడి నాటి ప్రజలు మరికొన్ని సుందర విగ్రహాలను భూమిలో దాచేవారని నానుడి. గతంలో జరిగిన తవ్వకాల్లో అనేక ఏకశిలా విగ్రహాలు బయటపడటం గమనార్హం. ఆ తరువాత నిడదవోలు అన్ని మతాలు, సంప్రదాయాలకు నెలవైంది. చారిత్రక పరిశోధనల ప్రకారం నిడదవోలు పూర్వం గొప్ప శైవరక్షేత్రం. దీనికి నిదర్శంగా ఇక్కడ అనేక శివాలయాలు, శైవారాధనకు సంబంధించిన అనేక శిలా విగ్రహాలు బయటపడ్డాయి. ముఖ్యంగా వినాయకుడు, నంది, శక్తి విగ్రహాలు అనేకం ఈ ప్రాంతంలో నేటికీ కనిపిస్తూంటాయి. పట్టణంలోని చినకాశిరేవులో అనేక దేవాలయాలు ఉన్నాయి. అలాగే, ఇక్కడి పురాతన గోలింగేశ్వరస్వామి, సోమేశ్వరస్వామి, నంగాలమ్మ పూరి గుడి ప్రసిద్ధి చెందాయి. మండలంలోని తిమ్మరాజుపాలెంలో వెలసిన శ్రీ కోటసత్తెమ్మ అమ్మవారు భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతున్నారు. ఇక్కడి అమ్మవారి విగ్రహం 11వ శతాబ్దంలో తూర్పు చాళుక్యుల కాలానికి చెందినదని పరిశోధనలు చెబుతున్నాయి.

24ఎన్‌డీడీ02:

నిడదవోలు పురపాలక సంఘ కార్యాలయం

పట్టణ స్వరూపం

వార్డులు 28

విస్తీర్ణం 14.15 చదరపు కిలోమీటర్లు

జనాభా 43,809

మహిళలు 22,528

పురుషులు 21,281

గృహాలు 10,873

పార్కులు 6

వార్డు సచివాలయాలు 13

సచివాలయ ఉద్యోగులు 111

ప్రభుత్వాస్పత్రులు 3

మున్సిపల్‌ పాఠశాలలు 15

విద్యార్థులు 1,113

ఘన చరిత్ర

ఫ నిడదవోలు పట్టణాన్ని పూర్వం నిరవద్యపురం, నిరవద్యప్రోలు అనే పేర్లతో పిలిచేవారు. తూర్పు చాళుక్యులకు, రాష్ట్రకూటులకు మధ్య నిరవద్యపురం, పెరువంగూరు గ్రామాల్లో యుద్ధాలు జరిగినట్లు చరిత్ర చెబుతోంది. నిరవధ్య అనేది క్రీస్తు శకం 699 – 729 మధ్య పరిపాలించిన తూర్పు చాళుక్య రాజు రెండో విజయాదిత్యుని బిరుదు. ఆయన పేరుతోనే ఈ పట్టణం నిర్మించారని చెబుతారు. విజయాదిత్యుడు ఏకంగా పన్నెండేళ్ల పాటు 108 స్థలాల్లో రాష్ట్రకూటులతో యుద్ధం చేశాడని, అన్నింటిలోనూ ఇతడే విజయం సాధించాడని అంటారు. ఈ యుద్ధం వల్ల వచ్చిన పాపం తనకు అంటకుండా విజయాదిత్యుడు 108 శివాలయాలు నిర్మించాడు.

ఫ తూర్పు చాళుక్యుల్లో 10వ శతాబ్దంలో మొదటి భీమరాజు ఉండేవాడు. క్రీస్తుశకం 918లో రాష్ట్రకూటులు వేంగీ దేశంపై దండెత్తారు. భీమరాజు నిడదవోలు దుర్గాన్ని ఆధారంగా చేసుకుని రాష్ట్రకూటులను పారదోలాడు. మొదటి భీమరాజే సామర్లకోట, ద్రాక్షారామ, భీమవరం గ్రామాల్లో భీమేశ్వరరాలయాలు, పాలకొల్లులో క్షీరారామ దేవాలయాన్ని నిర్మించాడని చెబుతారు.

ఫ చాళుక్యుల అనంతరం నిరవద్యపురాన్ని కాకతీయులు పాలించారు. వీరి కాలంలో శిల్పకళ ప్రసిద్ధి చెందింది. ఇప్పటికీ ఈ నేల నుంచి బయట పడుతున్న అనేక సుందర విగ్రహాలు కాకతీయుల కాలం నాటివనే చెబుతారు. 13వ శతాబ్దంలో కాకతీయ గణపతి దేవుడు కోస్తాంధ్రను జయించడానికి వచ్చాడు. తాను జయించిన ప్రాంతాల్లో తన పాలనను బలపరచుకోవడానికి ఆ ప్రాంత రాజులతో వివాహ సంబంధాలు ఏర్పరచుకున్నాడు. ఆవిధంగా గణపతి దేవుడు తన కుమార్తె వీర రుద్రమదేవిని నాటి నిరవద్యప్రోలు పరిపాలకుడు వీరభద్ర చాళుక్యునికి ఇచ్చి వివాహం చేశాడు. అయితే, వీరభద్ర చాళుక్యుడు నడి వయసులోనే మరణించడంతో రుద్రమదేవి సంసార జీవితం మధ్యలోనే విచ్ఛిన్నమైందని అంటారు.

వైఎస్సార్‌ సీపీ పాలనలో ప్రగతి జోరు

ఫ గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో నిడదవోలు మున్సిపాలిటీ ప్రగతి జోరందుకుంది. మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఏకంగా రూ.371.33 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపట్టారు.

ఫ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ప్రజల చిరకాల కోరిక అయిన నిడదవోలు రోడ్‌ ఓవర్‌ బ్రిడ్జి (ఆర్‌ఓబీ) నిర్మాణానికి వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో సీఆర్‌ఐఎఫ్‌ నిధులు రూ.185 కోట్లు మంజూరు చేశారు. ప్రస్తుతం ఆ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి.

ఫ పట్టణంలోని వైఎస్సార్‌ కాలనీలో రూ.91.16 లక్షలతో ప్రతిష్టాత్మకంగా వైఎస్సార్‌ అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌ నిర్మించారు. దీని ద్వారా ప్రజలకు కార్పొరేట్‌ స్థాయి వైద్య సేవలందుతున్నాయి.

ఫ పట్టణంలోని పాటి మీద సెంటర్‌ నుంచి గణపతి సెంటర్‌ వరకూ నాలుగు లేన్ల రోడ్డు విస్తరణతో పాటు గణపతి జంక్షన్‌ అభివృద్ధి పనులను రూ.5.50 కోట్లతో చేపట్టారు. గణపతి జంక్షన్‌ అభివృద్ధిలో భాగంగా విశాలమైన నాలుగు లేన్ల రోడ్లు, వాటర్‌ ఫౌంటెయిన్‌, సుందరమైన ‘ఐ లవ్‌ నిడదవోలు’ పార్కు, మంచినీటి పైప్‌లైన్‌, డ్రైనేజీ, పచ్చదనంతో కూడిన ఆహ్లాదకరమైన సుందరీకణ పనులు చేపట్టారు.

ఫ వివిధ సంక్షేమ పథకాల ద్వారా ఐదేళ్లలో రూ.352.85 కోట్ల మేర లబ్ధి చేకూర్చారు.

ఫ 60 వసంతాల నిడదవోలు

ఫ వజ్రోత్సవాలకు సిద్ధమైన పురపాలక సంఘం

ఫ రేపటి నుంచి 28 వరకూ వేడుకలు

వజ్రోత్సవ సంరంభం1
1/4

వజ్రోత్సవ సంరంభం

వజ్రోత్సవ సంరంభం2
2/4

వజ్రోత్సవ సంరంభం

వజ్రోత్సవ సంరంభం3
3/4

వజ్రోత్సవ సంరంభం

వజ్రోత్సవ సంరంభం4
4/4

వజ్రోత్సవ సంరంభం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement