వ్యాసహృదయావిష్కరణే లక్ష్యం
ఫ వాస్తవాలను కల్పనలు కప్పివేస్తున్నాయి
ఫ 60 రోజుల ప్రవచనాల్లో అన్ని ప్రశ్నలకూ సమాధానాలు
ఫ సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖశర్మ
ఫ 27 నుంచి వేదవ్యాస భారత ప్రవచనాలు
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): శతాబ్దాల చరిత గల సుందర నగరం.. రాజమహేంద్రవరం ఆధ్యాత్మిక జగత్తులో నవశకావిష్కరణకు సిద్ధమవుతోంది. ఆదికవి నన్నయ భట్టారకుడు తెలుగు భాషలో ఆంధ్ర భారత రచనకు శ్రీకారం చుట్టిన ఈ నగరి.. వేదవ్యాస భారత ప్రవచన యజ్ఞానికి వేదిక కానుంది. ‘మాసానాం మార్గశీర్షోహమ్’ అని గీతలో శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా ప్రకటించిన.. భగవద్గీత లోకానికి వెల్లడైన మార్గశిర మాసంలో.. ఆస్తిక లోకం ఎదురు చూపులు ఫలించే తరుణం ఆసన్నమవుతోంది. ఈ నెల 17 నుంచి జనవరి 25వ తేదీ వరకూ వరుసగా 60 రోజుల పాటు రాజమహేద్రవరం హిందూ సమాజంలో వేదవ్యాస భారతాన్ని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖశర్మ ప్రవచించనున్నారు. ఏకబిగిన ఇన్ని రోజుల పాటు ఈ ప్రవచన మహాయజ్ఞం జరగడం విశేషం. ఈ ప్రవచన విశేషాలు.. వేదవ్యాస భారతంలోని కొన్ని అంశాల గురించి తనను సోమవారం మర్యాదపూర్వకంగా కలసిన ‘సాక్షి’కి సామవేదం వివరించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
● అదే ఆశయం
బహుళ జనాదరణ పొందిన భారత కథలో కవుల ఊహలు.. అధ్యయన రాహిత్యంతో రూపొందించిన నాటకాలు, సినిమాల ప్రభావంతో అనేక కట్టుకథలు, పిట్టకథలు వచ్చి చేరిపోయాయి. అసలు కథ ఏమిటో తెలియని పరిస్థితి ఏర్పడింది, వాస్తవాలను కల్పనలు కప్పివేస్తున్న ఈ తరుణంలో వ్యాస మహర్షి అందించిన విజ్ఞాన భాండాగారాన్ని యథాతథంగా స్మరించుకోవడమే ఈ ప్రవచనాల ఆశయం. వ్యాస హృదయావిష్కరణే లక్ష్యం.
● భారతేతిహాసానికి కథానాయకుడు ఎవరంటే..
శ్రీమద్రామాయణం పేరు చెప్పగానే రామచంద్రుడు కథానాయకుడని ముక్తకంఠంతో సమాధానం వినవస్తుంది. భారత కథకు నాయకుడు, కథను నడిపించిన వాడు శ్రీకృష్ణుడే. ఈ విషయాన్ని గ్రంథారంభంలోనే వ్యాసుడు స్వయంగా స్పష్టం చేశారు. యుధిష్ఠిరుడు ధర్మమయమైన వృక్షం అనుకుంటే, ఆ వృక్షానికి కాండం అర్జునుడు, శాఖ భీమసేనుడు, నకుల సహదేవులు ఫలపుష్పాలు. దీనికి మూలాలు మూడు కృష్ణుడు, వేదం, వేదవిహిత జీవనం గడిపేవారు.
● నిఘంటు అర్థాలు చూసి
అధ్యయనం చేయరాదు
వేద వాజ్ఞ్మయాన్ని, ఆర్ష సాహిత్యాన్ని కేవలం నిఘంటు అర్థాలతో అధ్యయనం చేయరాదు. శాస్త్రమర్యాదలు తెలుసుకోవాలి. లౌకికమైన అర్థాలు వేరు, శాస్త్రపదాలు వేరు. ఉదాహరణకు.. కృష్ణుడు రాయబారం పూర్తయ్యాక, కర్ణుని ఏకాంతంలో కలుసుకుని, అతని జన్మరహస్యం చెబుతాడు, పాండవ పక్షానికి రమ్మని ఆహ్వానిస్తాడు. ఇక్కడ ‘ద్రౌపది ఆరో భర్తగా నిన్ను స్వీకరిస్తుంద’నే అపవ్యాఖ్యానం ఒకటి వచ్చింది. ఈ సందర్భంలో వ్యాసుని శ్లోకం ఈవిధంగా ఉంటుంది.
● రాజన్యా రాజకన్యాశ్చ అనయంత్యభిషేచనం షష్ఠే చ త్వాం తథాకాలే ద్రౌపద్యుపగమిష్యతి
ఈ శ్లోకానికి అనువాదం చేస్తూ, కొందరు పండితులు సైతం ‘ద్రౌపది నిన్ను ఆరవ వానిగా వరిస్తుంద’ని అర్థం చెబుతున్నారు. వేదభాషలో ఈ ‘కాలం’ అనే మాటకు అర్థం కనపడుతుంది. ‘చతుర్థకాల పాన భక్తస్యాత్..’ అని అధర్వణ వేదంలో ఉన్నది. అంటే రోజును నాలుగు భాగాలు చేసి, నాలుగో కాలం వచ్చేసరికి భోజనం చేయాలి. రామాయణంలో పేర్కొన్న పంచమ కాలం అనే మాటకు సంధ్యా సమయమని అర్థం. జ్యోతిష శాస్త్రం ప్రకారం షష్ఠే కాలే అంటే పట్టాభిషేక సమయమని అర్థం. అంటే, పట్టాభిషేక సమయంలో మిగతా వారితో పాటు ద్రౌపది నిన్ను కూడా సేవిస్తుంది అని అన్వయించుకోవాలి.
● కర్ణుడు పాల్పడిన ఘోర పాతకం
సినిమాల ధర్మమా అని కర్ణుడు దాన వీర శూర కర్ణుడయ్యాడు. నిండు సభలో ద్రౌపదిని వివస్త్ర చేయమని ఆదేశించినది కర్ణుడు. దుశ్శాసనునితో కర్ణుడు ‘‘పాణ్డవానాం చ వాసాంసి ద్రౌపద్యాశ్చాప్యుపాహర’’ అని ఆదేశిస్తాడు. అంటే దాని అర్థం పాండవులవి, ద్రౌపదివి బట్టలను ఊడదీయుము’’ అని ఈ శ్లోకపాదానికి అర్థం. ఒక్క పాపం చాలు– అనేక పుణ్యాలను దహించివేయడానికి.
● వాటిల్లో నిజం ఉందా?
మయసభలో ద్రౌపది దుర్యోధనుని భంగపాటు చూసి నవ్విందా.. సభాపర్వంలో భీముడు అన్నగారి చేతులు కాలుస్తానని అన్నాడని తెలుగు సాహిత్యంలో జరుగుతున్న ప్రచారంలో నిజం ఉందా.. కర్ణుడిని ఇంద్రుడు మోసగించి సహజ కుండలాలు తీసుకుపోయాడన్న కథనంలో సత్యం ఉందా.. శకుని పాచికలు మాయ పాచికలని సినిమాలు చెబుతున్నది నిజమా.. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానంగా వ్యాసహృదయాన్ని ప్రవచనాల్లో ఆవిష్కరిస్తాం.
● పంచమవేదం ఎలా?
వేదం నుంచి వచ్చింది సనాతన ధర్మం. ఆ ధర్మాన్ని విస్తరించి చెప్పినవి పురాణేతిహాసాలు. సనాతన ధర్మాన్ని అతి విస్తారంగా భారతం చెబుతోంది. కర్మ, ఉపాసన, జ్ఞాన కాండలు మహాభారతంలో ఉన్నంత విస్తారంగా మరి ఏ ఇతర గ్రంథంలోనూ కనపడవు. అందుకే భారతాన్ని పంచమ వేదంగా పరిగణిస్తున్నారు.
వ్యాసహృదయావిష్కరణే లక్ష్యం


