ఏం చేశారని మాకోసం?
సాక్షి, రాజమహేంద్రవరం: ఇల్లు కాలి ఒకడు ఏడుస్తూంటే.. చుట్ట కాల్చుకునేందుకు నిప్పు కావాలన్నాడట మరొకడు. చంద్రబాబు ప్రభుత్వం తీరు ఇదే చందంగా ఉందనే విమర్శలు సర్వత్రా వస్తున్నాయి. ఓవైపు ప్రకృతి విపత్తులతో వ్యవసాయం అతలాకుతలమైంది. తుపాను ప్రభావంతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. అష్టకష్టాలు పడుతున్న రైతులకు ఇటువంటి సమయంలో అండగా ఉండాల్సిన ప్రభుత్వం ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తోంది. పైగా రైతులకు ఎంతో చేసేసినట్లు కలరింగ్ ఇచ్చే ప్రయత్నాలకు నాంది పలికింది. ఇందులో భాగంగానే సోమవారం నుంచి 30వ తేదీ వరకూ ‘రైతన్నా మీకోసం’ పేరిట ప్రచారార్భాటానికి శ్రీకారం చుడుతోంది. ఇందులో భాగంగా ప్రభుత్వ అధికారులు, సిబ్బంది ప్రతి రైతు ఇంటికీ వెళ్లి వారి జీవనోపాధి, ఆర్థిక స్థితి, నైపుణ్యాభివృద్ధిలో శాశ్వత మార్పు తదితర అంశాలపై వివరాలు సేకరిస్తారు. ఆ వివరాలను ఈ నెల 30 నుంచి వచ్చే నెల మూడో తేదీ వరకూ పరిశీలిస్తారు. అదే రోజు రైతు సేవా కేంద్రాల్లో వర్క్‌షాపులు పెట్టి, రానున్న రబీ, వచ్చే ఏడాది ఖరీఫ్, రబీ పంటలపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని నిర్ణయించారు. అయితే, దాదాపు ఏడాదిన్నరగా ‘ప్రచారార్భాటం పీక్.. ఆచరణ వీక్’ అనే రీతిలో వ్యవహరిస్తున్న ప్రభుత్వాధినేతలు, అధికారులు.. తమకు చేసిందేమీ లేకున్నా, ఇప్పుడు ఈ ప్రచారార్భాటమేమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు సమస్యలపై రైతులు నిలదీస్తే ఏం సమాధానం చెప్పాలోననే మీమాంస ప్రజాప్రతినిధుల్లో నెలకొంది.
‘సుఖీభవ’ అంటూ దుఃఖపెడుతున్నారు
అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు ఏటా రూ.20 వేలు అందిస్తామని గత సార్వత్రిక ఎన్నికల్లో కూటమి నేతలు డప్పేసి చెప్పారు. తీరా అధికారం చేపట్టిన తొలి ఏడాది ఈ పథకాన్ని ఎగ్గొట్టి రైతులకు జెల్ల కొట్టారు. రెండో ఏడాది జిల్లావ్యాప్తంగా 18,511 మంది రైతులకు మొండిచేయి చూపారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏటా సగటున 1,33,502 మందికి రైతుభరోసా నిధులు అందించేది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తరువాత ఆ సంఖ్య 1,14,991కు తగ్గిపోయింది. మరోవైపు సుమారు 1.10 లక్షల మంది కౌలు రైతులకు నయాపైసా కూడా ఇవ్వకుండా వారికి దుఃఖాన్నే మిగిల్చారు. గత నాలుగేళ్లలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం 1,33,502 మంది రైతులకు రూ.584.64 కోట్ల మేర రైతుభరోసా సాయం అందించింది.
వ్యవసాయ విద్యుత్‌కు కోతలు
వ్యవసాయానికి పగటి పూట 9 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నామని సర్కారు గొప్పగా చెప్పింది. కొన్ని రోజులకే విద్యుత్ సరఫరాను 7 గంటలకు కుదించింది. దీంతో, రైతులు పంటల సాగుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ధాన్యం సొమ్ము ఏదీ?
ధాన్యం విక్రయించిన 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం నెల రోజులు గడుస్తున్నా నగదు ఇవ్వడం లేదు. జిల్లావ్యాప్తంగా గత రబీలో 3.39 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు. దీనికి గాను రూ.781.08 కోట్లు చెల్లించాల్సి ఉండగా.. రూ.632.6 కోట్లు మాత్రమే ఇచ్చారు. మిగిలిన రూ.148.48 కోట్లు నెలలు గడుస్తున్నా చెల్లించిన దాఖలాలు లేవు.
ధాన్యం సేకరణలో నిబంధనలు
ఖరీఫ్ ధాన్యం సేకరణలో అనేక నిబంధనలు విధించింది. తడిసి, రంగు మారి, మొలకెత్తిన ధాన్యం కొనుగోలు చేయడం లేదు. మిల్లర్లకు నచ్చి, వాళ్లు ఇచ్చే ధరకే విక్రయించుకోవాలంటూ చేతులెత్తేసింది. ముంపునకు గురైన పంటలో తేమ శాతం అధికంగా ఉంటుందని, రంగు మారి, మొలకలొచ్చే అవకాశం ఉంటుందని, దీనికి మద్దతు ధర ఇచ్చే ప్రసక్తే లేదని మిల్లర్లు, దళారులు చెబుతూండటంతో రైతులు దారణంగా నష్టపోతున్నారు.
వైఎస్సార్ సీపీ పాలనలో రైతులకు పెద్దపీట
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్ద పీట వేసింది. మిచాంగ్ తుపాను ప్రభావంతో పంట నష్టపోయిన రైతుల కన్నీళ్లు తుడిచింది. తుపాను ప్రభావంతో కూరిసిన భారీ వర్షాలకు దెబ్బ తిన్న పంటల లెక్క వెంటవెంటనే తేల్చింది. నెలల వ్యవధిలోనే పెట్టుబడి సాయంగా రూ.14.80 కోట్లు అందించింది.
● వైఎస్సార్ యంత్ర సేవ పథకం కింద గత ప్రభుత్వం రైతులకు అత్యాధునిక యంత్ర పరికరాలను అందుబాటులోకి తెచ్చింది. ప్రతి మండలంలో మూడు ఆర్‌బీకేలకు డ్రోన్లు మంజూరు చేసింది. జిల్లాకు మొత్తం 91 డ్రోన్లు అందుబాటులోకి తెచ్చి వ్యవసాయ పనులకు వినియోగించుకునేలా చర్యలు తీసుకుంది.
తొలి ఏడాది అన్నదాత
సుఖీభవకు మంగళం
రెండో ఏడాది ఇచ్చింది కొంత మందికే..
తుపాను బాధిత రైతులకు
అందని పరిహారం
పుట్టెడు కష్టాల్లో అన్నదాతలు
ఈ పరిస్థితుల్లో ‘రైతన్నా మీకోసం’
పేరిట ప్రభుత్వ కార్యక్రమం
నేడు ప్రారంభం
రైతులు నిలదీస్తే ఏం చెప్పాలన్న
మీమాంసలో ప్రజాప్రతినిధులు
గత ప్రభుత్వం పంటల వారీగా హెక్టారుకు మంజూరు చేసిన ఇన్‌పుట్ సబ్సిడీ (రూ.)
పంట ఇన్‌పుట్ సబ్సిడీ
వరి, వేరుశనగ, పత్తి, చెరకు రూ.17,000
మొక్కజొన్న 12,500
మినుములు, పెసలు, శనగలు, 10,000
ప్రొద్దుతిరుగుడు, పొగాకు
జొన్న 8500
ఉచిత బీమాకు మంగళం
ఉచిత పంటల బీమా పథకానికి చంద్రబాబు ప్రభుత్వం మంగళం పాడింది. ప్రీమియం చెల్లింపు భారాన్ని రైతుల పైనే మోపింది. 2024–25 రబీకి సంబంధించి ప్రభుత్వం గుర్తించిన పంటలకు బీమా ప్రీమియం చెల్లింపు ఉత్తర్వులు వెలువరించింది. దీని ప్రకారం హెక్టారు వరికి రూ.1.05 లక్షలుగా విలువ నిర్ధారించి రైతు వాటాగా 1.50 శాతం అంటే రూ.1,575 ప్రీమియం చెల్లించాలని పేర్కొంది. పంట భూమి విస్తీర్ణం పెరిగేకొద్దీ ప్రీమియం కూడా పెరుగుతుంది. ఇంత మొత్తం చెల్లించడం భారం కావడంతో వేలాదిగా రైతులు పంటల బీమాకు దూరమయ్యారు. ఫలితంగా గత నెలలో మోంథా తుపానుకు పంట నష్టపోయిన రైతులు పరిహారం పొందలేని దుస్థితి తలెత్తింది.
ఆర్‌బీకేలు నిర్వీర్యం
విత్తు నుంచి విక్రయాల వరకూ రైతులకు అడుగడుగునా తోడుగా నిలిచే లక్ష్యంతో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం 367 ఆర్‌బీకేలు (రైతు భరోసా కేంద్రాలు) ఏర్పాటు చేసింది. వీటి ద్వారా నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులతో పాటు రైతులకు సాగులో సలహాలు సైతం అందించింది. ఉద్యాన పంటలకు సైతం ప్రోత్సాహం అందించేది. ఇటువంటి రైతుహిత వ్యవస్థను చంద్రబాబు ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. ఎరువుల పంపిణీ బాధ్యతను పీఏసీఎస్‌లకు అప్పగించింది. తద్వారా రైతులు అదునుకు యూరియా వంటి ఎరువులు పొందేందుకు రైతులు నానా అగచాట్లూ పడాల్సి వచ్చింది
‘మోంథా’ సాయమేదీ?
మోంథా తుపాను జిల్లా రైతులను కోలుకోలేని దెబ్బ తీసింది. అధికారుల తుది నివేదిక ప్రకారం జిల్లాలోని 18 మండలాల్లో వ్యవసాయ, ఉద్యాన పంటలకు సంబంధించి 33,262 మంది రైతులు ఈ తుపాను వలన నష్టపోయారు. మొత్తం 16,540 హెక్టార్లలో వివిధ పంటలకు రూ.40.96 కోట్ల మేర నష్టం వాటిల్లింది. 31,074 మంది రైతులకు చెందిన వరి, మినుముకు సంబంధించి 15,738.607 హెక్టార్లలో పంట నష్టం వాటిల్లింది. దీని విలువ రూ.38,21,07,405 కోట్లుగా పేర్కొన్నారు. తుపాను వచ్చి నెల రోజులవుతున్నా ప్రభుత్వం నేటికీ పరిహారం అందజేసిన దాఖలాలు లేవు. ఎప్పుడు విడుదల చేస్తారో తెలియని పరిస్థితి.


