ఉచిత పంటల బీమా ప్రవేశపెటా్టలి
● రైతుల పాలిట శాపంగా
చంద్రబాబు ప్రభుత్వం
● ఇన్‌పుట్ సబ్సిడీకి మంగళం
● బ్లాక్ మార్కెట్‌లో విత్తనాలు, ఎరువులు
● గిట్టుబాటు ధర ఎక్కడ?
● వైఎస్సార్ సీపీ రైతు విభాగం
రాష్ట్ర నేత ధ్వజం
నిడదవోలు: రైతులపై ఎటువంటి ఆర్థిక భారం లేకుండా గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉచిత పంటల బీమా పథకం ప్రవేశపెట్టారని వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బూరుగుపల్లి సుబ్బారావు అన్నారు. ఈ పథకానికి చంద్రబాబు సర్కారు మంగళం పాడిందని, రైతులపై భారం లేకుండా ప్రభుత్వమే ఉచిత పంటల బీమా ప్రీమియం చెల్లించాలని డిమాండ్ చేశారు. మండల కేంద్రమైన ఉండ్రాజవరంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులకు పెట్టుబడి సాయం ఇవ్వకుండా చంద్రబాబు ప్రభుత్వం మరోసారి మోసం చేసిందని విమర్శించారు. అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతుకూ పెట్టుబడి సాయంగా ఏటా రూ.20 వేలు ఇస్తామని ఎన్నికల ముందు చెప్పిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక తొలి ఏడాది ఈ పథకాన్ని పూర్తిగా ఎగ్గొట్టారని అన్నారు. రెండో ఏడాది అమలు చేసినా, 7 లక్షల మంది రైతులకు ఎగ్గొట్టారని చెప్పారు. ఇప్పుడు రెండో విడత పెట్టుబడి సాయం చేస్తున్నట్లు ఆర్భాటంగా ప్రచారం చేసుకుంటున్నారని, వాస్తవానికి ఈ పథకం కింద ఇస్తామన్నదెంత, ఇస్తున్నది ఎంత అని ప్రశ్నించారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో వైఎస్సార్ రైతు భరోసా పథకం కింద 53.58 లక్షల మందికి రూ.34,288 కోట్ల సాయం అందించామన్నారు. నాటి జగన్ ప్రభుత్వం కౌలు రైతులకు కూడా పెట్టుబడి సాయం అందించిందని చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వం పెట్టుబడి సాయంలో కౌలు రైతులకు మొండి చేయి చూపించిందని దుయ్యబట్టారు. ఎన్నికల ముందు చంద్రబాబు హామీ ఇచ్చిన ప్రకారం.. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో మాదిరిగా 53,58,366 మంది రైతులకు ఏటా రూ.20 వేల చొప్పున రెండేళ్లలో ప్రతి రైతుకు రూ.40 వేల పెట్టుబడి సాయం ఇవ్వాల్సి ఉందని అన్నారు.
రైతులను మోసగిస్తున్నారు
చంద్రబాబు ప్రభుత్వం రైతులకు అందాల్సిన సాయం చేస్తామని చెబుతూ మోసం చేస్తోందని సుబ్బారావు విమర్శించారు. ఇప్పటికే ఉచిత పంటల బీమా, సున్నా వడ్డీ పంట రుణాలు, కనీస మద్దతు ధర కల్పన కోసం ధరల స్థిరీకరణ నిధి, ఈ–క్రాప్ విధానం, సబ్సిడీ వంటి అన్ని సంక్షేమ పథకాలకు చంద్రబాబు ప్రభుత్వం మంగళం పాడి, రైతుల పాలిట శాపంగా మారిందని దుయ్యబట్టారు. అన్ని వర్గాల మాదిరిగానే రైతులను కూడా చంద్రబాబు ప్రభుత్వం దారుణంగా దగా చేసిందని ధ్వజమెత్తారు. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని నూరు శాతం కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. విత్తు నుంచి పంట అమ్మకం వరకూ రైతన్నకు తోడుగా నిలిచేలా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు భరోసా కేంద్రాల పేరును రైతు సేవా కేంద్రాలుగా మార్చి, పూర్తిగా నిర్వీర్యం చేసే స్థితికి తీసుకు వచ్చారన్నారు. తద్వారా విత్తనాలు, యూరియా వంటి ఎరువుల కోసం రైతులు రోజుల తరబడి క్యూలో నిలబడే దుస్థితి తీసుకువచ్చారన్నారు. బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టాలని డిమాండ్ చేశారు. వరి పంట వద్దని సీఎం చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రజలకు ఆరోగ్యకరమైన పంట ఏదో సీఎం సూచించాలని ఎద్దేవా చేశారు. గత తుపాను వల్ల నష్టపోయిన రైతులకు తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఏ ఒక్క రైతూ ఆత్మహత్య చేసుకోలేదని, చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిన్నర కాలంలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 400 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. పండించిన పంటలకు ధరలు పతనమై కష్టాల్లో రైతులుంటే పట్టించుకోకుండా చంద్రబాబు ప్రభుత్వం కేవలం ప్రచారానికే ప్రాధాన్యం ఇస్తూ పాలనను, రైతులను పక్కన పెట్టిందని సుబ్బారావు మండిపడ్డారు. కార్యక్రమంలో ఉండ్రాజవరం సొసైటీ అధ్యక్షుడు సంకురాత్రి సుబ్బారావు, సర్పంచ్ మెంటే వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.


