సారథిపై సస్పెన్స్
సాక్షి, రాజమహేంద్రవరం: జిల్లా టీడీపీ సారథి కోసం అభిప్రాయ సేకరణ పేరుతో హడావుడి చేశారు. నెలలు గడుస్తున్నా అతీగతి లేదు. ఇప్పటి వరకూ ఎవ్వరినీ ఎంపిక చేయకపోగా.. ఎప్పుడు చేస్తారు.. చేస్తారా.. లేదా.. అనే మీమాంస ఆ పార్టీ శ్రేణుల్లో నెలకొంది. పార్టీ జిల్లా అధ్యక్షుడి ఎంపికపై ఆరు నెలలుగా ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. అధిష్టానం నాన్చివేత ధోరణితో ఆశావహులకు నిరీక్షణ తప్పడం లేదు. మరోవైపు నియామకానికి గ్రీన్ సిగ్నల్ వస్తే ఎవరికి పదవి వస్తుందా అనే ఉత్కంఠ నెలకొంది. అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటిపోయినా పార్టీ పదవుల భర్తీపై కనీసంగా కూడా దృష్టి పెట్టకపోవడమేమిటంటూ పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
6 నెలలుగా..
టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా మాజీ మంత్రి కేఎస్ జవహర్ ఉండే వారు. ఆయనకు ఎస్సీ కమిషన్ చైర్మన్ పదవి కట్టబెట్టారు. దీంతో, పార్టీ జిల్లా అధ్యక్షుడి మార్పు అనివార్యమైంది. ఆరు నెలలుగా ఈ పదవి ఖాళీగానే ఉంది. కేవలం వైఎస్సార్ సీపీ నేతలపై కేసులు పెట్టడం, వేధించడం, అక్రమాలకు ఆజ్యం పోయడం ద్వారానే కాలం వెళ్లదీస్తున్నారని, పార్టీ నియామకాలను పట్టించుకోవడం లేదనే విమర్శలు టీడీపీ శ్రేణుల నుంచే వినిపిస్తున్నాయి.
అభిప్రాయ సేకరణ జరిగినా..
టీడీపీ జిల్లా అధ్యక్షుడి ఎంపిక కోసం అధిష్టానం ప్రత్యేకంగా మంత్రి కొలుసు పార్థసారథి, ఎమ్మెల్యేలు పత్తిపాటి పుల్లారావు, ముక్కు ఉగ్రనరసింహారెడ్డిలతో త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ జిల్లాలోని మెజారిటీ నేతల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుని అధ్యక్ష పదవికి పేర్లను అధిష్టానానికి సిఫారసు చేస్తుంది. మూడు నెలల క్రితం బూరుగుపూడిలోని టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్‌చార్జులు, నియోజకవర్గానికి సుమారు 10 మంది చొప్పున ప్రత్యేక ఆహ్వానితుల నుంచి ఈ కమిటీ అభిప్రాయాలు సేకరించింది. ఆ అభిప్రాయాలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లింది. అక్కడితో సరి.. ఇప్పటి వరకూ అధ్యక్షుడి ఎంపికపై అధిష్టానం ఏ ప్రకటనా చేయలేదు. జిల్లా అధ్యక్షుడు లేకపోవడంతో తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదని టీడీపీ కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
త్వరలో సీఎం పర్యటన
ఈ నెల లేదా వచ్చే నెలలో ఏదో ఒక రోజు సీఎం చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటనకు రానున్నట్లు సమాచారం. రాజమహేంద్రవరంలో ఓ సినిమా లాంచింగ్ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారని తెలిసింది. ఆలోగా జిల్లా అధ్యక్షుడి ఎంపికపై ఓ స్పష్టత వస్తుందని టీడీపీ శ్రేణులు ఆశిస్తున్నాయి. అలా జరగని పక్షంలో కనీసం చంద్రబాబు పర్యటనలోనైనా ఈ విషయం ఓ కొలిక్కి రావచ్చని భావిస్తున్నారు.
సిఫారసులకే ప్రాధాన్యమా?
నామినేటెడ్ పదవుల భర్తీలో టీడీపీ అధిష్టానం ఎమ్మెల్యేల సిఫారసులకే ప్రాధాన్యం ఇచ్చిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. పార్టీ విజయానికి శ్రమించిన వారికి నామినేటెడ్ పదవులు ఇస్తానన్న చంద్రబాబు అధికారంలోకి వచ్చాక మాట మార్చారు. పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి, ఎమ్మెల్యేల సిఫారసులకు పెద్దపీట వేశారు. వారు చెప్పిన వారికి, వారి అనుచరులకే పదవులు కట్టబెట్టడంతో చిత్తశుద్ధితో పని చేసిన తమకు అన్యాయం జరిగిందని పలువురు నేతలు వాపోతున్నారు. పెద్ద పదవులైతే చినబాబు చలవ లేనిదే దక్కని పరిస్థితి నెలకొంది. ఇప్పుడు పార్టీ జిల్లా అధ్యక్షుడి ఎంపికలో సైతం అదే పంథా కొనసాగిస్తారా.. లేక పార్టీని సమర్థవంతంగా నడిపే నేతకు కట్టబెడతారా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
జిల్లా అధ్యక్ష పదవిపై
టీడీపీ నాన్చివేత ధోరణి
అభిప్రాయ సేకరణ పూర్తయినా నిర్లిప్తత
అధిష్టానంపై శ్రేణుల్లో అసంతృప్తి
మూడు వర్గాలుగా
పావులు కదుపుతున్న నేతలు


